నందిని సిద్దారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు

– కవితా సంపుటి ‘అనిమేష’కు..

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 16: ప్రముఖ తెలుగు సాహితీవేత్త, కవి నందిని సిధారెడ్డిని కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు వరించింది. కేంద్రం సాహిత్య అకాడమి సోమవారం 24 భారతీయ భాషలకు సంబంధించిన తన వార్షిక పురస్కారాలను ప్రకటించింది. అందులో తెలుగు కవి నందిని సిధారెడ్డి కవితా సంపుటి ‘అనిమేష’ 2025 సాహిత్య అకాడమీ పురస్కారానికి ఎంపికైంది. కరోనా కాలంలో పరిస్థితులను వస్తువుగా తీసుకుని అనిమేష కవితా సంపుటిని సిధారెడ్డి రూపొందించారు. సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు దక్కడంపై పలువురు తెలుగు భాషాభిమానులు, కవులు, రచయితలు, తెలంగాణ వాదులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.

కేసీఆర్ హర్షం

కేంద్ర ప్రభుత్వ అత్యున్నత సాహిత్య పురస్కారం కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు-2025 నందిని సిధారెడ్డికి దక్కడం పట్ల మాజీ ముఖ్యమంత్రి, బీఆరఎస్ అధినేత కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఆయనను అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. కరోనా సందర్భంగా ప్రపంచం ఎదుర్కొన్న సంక్షోభాన్ని, ముఖ్యంగా మానవ సంబంధాల విచ్చిన్నతలను కవిత్వం ద్వారా హృద్యంగా చిత్రీకరించిన దీర్ఘ కవితా సంపుటి ‘అనిమేష’కు ఈ అవార్డు రావడం గొప్ప విషయం అని అన్నారు. తెలంగాణ మట్టివాసన తెలిసిన కవిగా, తన సాహిత్యం ద్వారా తెలంగాణ జీవితాన్ని అక్షరబద్ధం చేసిన, తెలంగాణ గర్వించదగ్గ కవి, నందిని సిద్ధారెడ్డి అని కొనియాడారు. మెదక్ జిల్లా కేంద్రంగా మంజీరా రచయితల సంఘం ఏర్పాటు చేసి అన్ని వర్గాల ప్రజా సమస్యలు, సామాజిక సమానత్వం కోసం రచనలు చేస్తూ తమ కలాన్ని గళాన్ని విప్పారని కేసీఆర్ తెలిపారు. రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో తన పాట, సాహిత్యం ద్వారా ప్రజలను ఆలోచింపజేస్తూ ఉద్యమ కవిగా రాష్ట్ర ప్రజల అభిమానాన్ని సిద్ధారెడ్డి చూరగొన్నారన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *