– ఇందిరమ్మ అమృతం పథకం ప్రారంభం
– అంగన్‌వాడీ టీచర్లకు రిటైర్మెంట్ బెనిఫిట్ కింద రూ.2లక్షలు
– మిషన్ వాత్సల్య కింద నెలకు రూ.4వేలు
– మంత్రి ధనసరి సీతక్క
తొలి బడి అమ్మవొడి మలి బడి అంగన్‌వాడీ అని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా గురువారం మంత్రి పాత కొత్తగూడెం నుండి పెనుబల్లి రోడ్డు సమీపంలో రూ 6.50 కోట్లతో నిర్మించనున్న హై లెవెల్ బ్రిడ్జి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి కొత్తగూడెం క్లబ్ లో ఏర్పాటుచేసిన ఇందిరమ్మ అమృతం పథకం ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఆడపిల్లలకు శక్తినిద్దాం ఆరోగ్య తెలంగాణను నిర్మిద్దాం అనే నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఇందిరమ్మ అమృతం పథకాన్ని మహబూబాబాద్ పార్లమెంటు సభ్యులు పోలిక బలరాం నాయక్, శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ అనిత రామచంద్రన్, మహిళ, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ కాంతి వెస్లీ, ఐటిడిఏ పిఓ రాహుల్ తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ కౌమార బాలికల్లో రక్తహీనతను నివారించేందుకు ఇందిరమ్మ అమృతం పేరిట ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా భద్రాద్రి కొత్తగూడెం, కొమురం భీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలలో ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ పథకం ద్వారా మూడు జిల్లాల్లో 50,269 మంది బాలికలకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. ఏజెన్సీ ప్రాంతాలలో సరైన పౌష్టికాహార లోప నివారణకు 14 నుండి 18 సంవత్సరాల లోపు బాలికలకు ఇందిరమ్మ అమృతం పథకం ద్వారా మిల్లెట్స్ తో కూడిన చిక్కీలను నెలకు రెండు ప్యాకెట్లు అందిస్తామన్నారు.
ఒక్కో ప్యాకెట్లో 15 చిక్కిలు ఉంటాయని రోజుకు ఒక చిక్కి తిండటం ద్వారా ఆడపిల్లలకు నెలసరి టైం లో వచ్చే సమస్యలనుంచి ఉపశమనం లభిస్తుందన్నారు. రక్తహీనతను తగ్గించి శక్తిని పెంపొంచే విధంగా ఈ చెక్కిలు ఉంటాయని మంత్రి వెల్లడించారు. ఆడపిల్లను ఎదగనిద్దాం, బ్రతకనిద్దాం, గౌరవిద్దాం, ప్రోత్సహించి లక్ష్యాలను సాధిద్దాం అని పిలుపునిచ్చారు. అంగన్‌వాడీ కేంద్రాలను ప్రీ ప్రైమరీ పాఠశాలలుగా మార్చామని, పిల్లలందరికీ నర్సరీ పాటలతో పాటు ఆహారం అందజేస్తామన్నారు. ప్రైవేటు పాఠశాలకు వెళ్లి తల్లిదండ్రుల కష్టం వృధా చేయకుండా అంగన్‌వాడీ కేంద్రాలను కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా తయారు చేస్తునామన్నారు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా అంగన్‌వాడీ కేంద్రాలలో ఏక రూప దుస్తులను అందిస్తున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీ కేంద్రాలలో పిల్లలు ఆడుకోవడానికి 57 రకాల ఆట వస్తువులను అందుబాటులో ఉంచామని చెప్పారు. త్వరలోనే గర్భిణీ స్త్రీలు కింద కూర్చోకుండా అన్ని అంగన్‌వాడీ కేంద్రాలలో బల్లలను ఏర్పాటు చేస్తామన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలలో పంపిణీ చేస్తున్న బాలామృతం కొంత మార్చి పిల్లలు ఇష్టంగా తినేలా రుచికరమైన పదార్థాలతో అందిస్తామన్నారు. అంగన్‌వాడీ సెంటర్ల నుండి దేశ భవిష్యత్ నిర్మాణం అవుతదని మంత్రి అన్నారు. అంగన్‌వాడీ టీచర్లు పిల్లలకు పౌష్టికాహారం అందించాలన్నారు.
అంగన్‌వాడీ కేంద్రాలలో పిల్లలను ఆకర్షించేలా బొమ్మలు, పెయింటింగ్ ఇటువంటి వాటి ద్వారా పాఠాలు బోధించాలన్నారు. జిల్లాలో మహిళ, శిశు సంక్షేమ శాఖ తయారుచేసిన వేస్ట్ నుండి బెస్ట్ చాలా ఆకర్షించిందని వాటిని రాష్ట్రవ్యాప్తంగా చూపెడతామన్నారు. మొట్టమొదటిసారిగా అంగన్‌వాడీ కేంద్రాలకు నెలరోజుల వేసవి సెలవులను ప్రభుత్వం ప్రకటించిందిని గుర్తు చేశారు. అంగన్‌వాడీ టీచర్లు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్ రూ. 2 లక్షలు అందించడానికి ఆమోదం తెలుపుతూ బుధవారం సాయంత్రం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సంతకం చేశారని గుర్తుచేశారు. చిరుద్యోగుల కష్టాలు కన్నీళ్లు తుడవడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అన్నారు. రాబోయే కాలంలో ఆశ వర్కర్ల జీతాల పెంపు, రెగ్యులైజేషన్ చేస్తామని తెలిపారు. ప్రభుత్వం అందించే పథకాలు క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరికి అందేలా ఉద్యోగులు సహకరించాలని కోరారు. విద్యార్థుల అభివృద్ధికి అమ్మ, నాన్న, ఉపాధ్యాయులు మాత్రమే కీలకమని తెలిపారు. మిషన్ వాత్సల్య పథకం కింద తల్లిదండ్రులు లేని పిల్లలకు అండగా ప్రభుత్వం నెలకు రూ.4 వేలు అందజేస్తున్నట్లు మంత్రి తెలిపారు.
తల్లితండ్రులు లేని పిల్లలు బాధపడొద్దని, కాంగ్రెస్ ప్రభుత్వం మీ వెంట ఉందని మంత్రి భరోసా కల్పించారు. ఈ పథకం కింద జిల్లాకు మంజూరు అయిన రూ. 74 .64లక్షల చెక్కును పిల్లలకు మంత్రి అందజేశారు. అంగన్‌వాడీ టీచర్లకు రిటైర్మెంట్ బెనిఫిట్ కింద రూ.2 లక్షలు ఆమోదానికి కృషిచేసిన మంత్రి సీతక్కను మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు, అంగన్‌వాడీ టీచర్లు సన్మానించారు. ముందుగా ఐసిడిఎస్ ఏర్పాటు చేసిన స్టాల్స్ మంత్రి పరిశీలించి వేస్ట్ నుండి బెస్ట్ రూపొందించిన కళాకృతులను చూసి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కునంనేని సాంబశివరావు, తెల్లం వెంకట్రావు, కోరం కనకయ్య, పాయం వెంకటేశ్వర్లు, జారే ఆదినారాయణ, జడ్పీ సీఈవో నాగలక్ష్మి, సిపిఓ సంజీవరావు,మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి స్వర్ణలత లేనినా, జిల్లా అధికారులు, అంగన్వాడి టీచర్లు, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు





