అరెస్టు చేసిన కాజీపేట పోలీసులు
కాజీపేట, ప్రజాతంత్ర, మే 27: ఆన్ లైన్ ట్రేడింగ్ పేరు (Online Trading) తో అమాయకులకు అధిక వడ్డీ ఆశ చూపి ఏకంగా రూ.4కోట్ల వరకు మోసం చేసిన ఘటన కాజీపేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కాజీపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కాజీపేట ఎస్ఎస్ఎస్ కాంప్లెక్స్ లో 2022లో స్థాపించిన వీఐపీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కు చెందిన ‘గ్లోబల్ అఫిలియేటెడ్ బిజినెస్’లో డబ్బులు పెట్టుబడి పెడితే 3 శాతం వడ్డీ ఇస్తామని ఆశ చూపి సుమారు 70 మంది నుంచి దాదాపు రూ.3 .70 కోట్ల వరకు మోసం చేసినట్టు ఏసీపీ తెలిపారు. పెట్టుబడి పెట్టినవారికి అడిగిన వెంటనే డబ్బులు ఇస్తామని సదరు సంస్థ ప్రతినిధులు హామీలు గుప్పించారు. మీ డబ్బులు ట్రేడింగ్ లో పెట్టుబడి పెట్టి లాభాలు ఇస్తామని కాజీపేట బ్రాంచ్ మేనేజర్ అయిన మందల కనకరాజు, కంపెనీ అధికారులు క్లబ్ ప్రెసిడెంట్ మెరుగు దీక్షిత్, డైరెక్టర్‌లు బాలకృష్ణ , కేఎల్‌ఎన్ రావు, గుమ్ముల సత్యనారాయణ, కళ్యాణ్ చక్రవర్తి, సంతోష్ పురని, సీఈఓ వినోద్ కుట్టే చెప్పడంతో అందం నమ్మి ఇన్వెస్ట్మెంట్ చేశామని బాధితులు చెప్పారు. అయితే అంతకుముందే కంపెనీ లావాదేవీలు సక్రమంగా లేవని వారి హెడ్ ఆఫీసుపై ఈడీ అధికారులు దాడి చేసి కంపెనీ యజమాని వినోద్ కుట్టే, వారి కుటుంబ సభ్యులపై కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలో కంపెనీలో పెట్టుబడి పెట్టిన వారి డబ్బులు ఇవ్వకపోయేసరికి ఆరూరి రాజయ్య అనే బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో మంగళవారం మందల కనకరాజు, మెరుగు దీక్షితులను అరెస్టు చేసినట్టు ఏసీపీ ప్రశాంత్ రెడ్డి తెలిపారు. కేసు ఛేదించిన కాజీపేట సిఐ సుధాకర్ రెడ్డి, ఎస్సైలు వి.నవీన్ కుమార్, ఎస్.సర్వేశ్వర్, కానిస్టేబుళ్లు కే.శ్రీనివాస్, సీహెచ్. శ్రీధర్, బి.భాస్కర్, జి.సునీల్ కుమార్, ఎం.వినయ్ కుమార్ ను ఏసీపీ అభినందించారు.