- ఆలయ భవనాలకు శంకుస్థాపన
- స్వామి ఆశీస్సులు తీసుకునే ఇకముందు ఎన్నికల ప్రచారం
- సంపద సృష్టించేందుకు కొత్త పథకాల అమలు
- మంచి చేస్తున్నందువల్లనే త్వరగా ఋతుపవనాలు
- ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క
ముదిగొండ, ప్రజాతంత్ర, మే 28: మధిర నియోజకవర్గ ప్రజలు ఇచ్చిన అవకాశంతో ప్రజా ప్రభుత్వంలో కీలక భూమిక పోషిస్తున్నందున ఈరోజు ఎడవెల్లి శ్రీ యోగానంద లక్ష్మీనరసింహస్వామి ఆలయ (Edavelli LakshmiNarasimha Swamy Temple) అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.4.75కోట్లు మంజూరు చేసే అవకాశం దక్కిందని ఉపముఖ్య మంత్రి మల్లు భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) అన్నారు. ఈ ఆలయ అభివృద్ధికి నిధులు రావడంలో మీ అందరి పాత్ర వున్నదన్నారు. ముదిగొండ మండలం ఎడవల్లి గ్రామంలోని శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి ఆలయ రాజగోపురం, ముఖ మండపం, విశ్రాంతి భవనాలకు బుధవారం శంకుస్థాపన చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు.
రాష్ట్రంలో సంపద సృష్టించి, దాన్ని ప్రజలకు పంచడానికి కొత్త పథకాలు అమలు చేయడమే కాదు, రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం ప్రణాళిక బద్ధంగా రాష్ట్ర నిధులను వెచ్చిస్తూ ప్రజా ప్రభుత్వం ముందుకు వెళుతున్నదన్నారు. ప్రజలకు మంచి చేయాలన్న సంకల్పంతో ప్రజాపాలన అందిస్తున్నందుకు భగవంతుడు రుతుపవనాలను ముందే తీసుకొచ్చారు. ఆ భగవంతుడి ఆశీస్సులతో రాష్ట్రంలో ఇక సమృద్ధిగా వర్షాలు కురవడంతో పాటు పాడిపంటలు పుష్కలంగా పండుతాయన్నారు. రాజీవ్ వికాసం, ఇందిరా సౌర గిరి జల వికాసం, సన్న బియ్యం పంపిణీ, రాష్ట్రంలో నాలుగు లక్షల 50వేల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, రైతులకు రూ.22 వేల కోట్ల రుణమాఫీ, వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ద్వారా ఏడాదికి రూ.12 వేల సాయం, పంట పెట్టుబడికి ఎకరాకు రైతులకు రైతు భరోసా ద్వారా రూ.12 వేల సాయం, మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం, రూ.500లకే గ్యాస్ సిలిండర్ పంపిణీ, గృహ జ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ సరఫరా, మహిళలకు వడ్డీ లేని రుణాలు ప్రజా ప్రభుత్వం అందిస్తున్నదన్నారు.
రాబోయే ఐదేళ్ల కాలంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడానికి రూ.లక్ష కోట్లు రూపాయలు వడ్డీ లేని రుణాలు అందిస్తామన్నారు. ఆరోగ్యశ్రీ పరిమితిన రూ. 5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంపు తదితర పథకాలను ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని అమలు చేస్తున్నవే నన్నారు. ప్రజలకు మంచి చేస్తున్న ప్రభుత్వానికి భగవంతుడు చల్లని చూపులు, ఆశీస్సులు మెండుగా ఉన్నందునే వరుణ దేవుడు రాష్ట్రానికి ముందే వస్తున్నాడన్నారు. ఇక ముందుఎన్నికల ప్రచారం ఎడవల్లి శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకుని ఆయన ఆశీస్సులతో మొదలుపెడతానని వెల్లడించారు. శ్రీ యోగనంద లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులు, నియోజకవర్గ ప్రజల ఆదరణతో ఎమ్మెల్యేగా గెలుపొందడం వల్ల కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బాధ్యతలను అప్పగించింద న్నారు.
భారీ స్పందన
శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం పనుల శంకుస్థాపనకు ఎడవెల్లి గ్రామానికి విచ్చేసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు ముదిగొండ మండల కాంగ్రెస్ శ్రేణులు, గ్రామ ప్రజలు స్వాగతం పలికారు. మహిళలు బోనాలు ఎత్తుకొని మంగళ హారతులతో దీవించి వీర తిలకం దిద్ది స్వాగతం పలుకగా, గ్రామ కాంగ్రెస్ శ్రేణులు క్రేన్ సాయంతో భారీ గజమాల వేసి సత్కరించారు. సన్నాయి మేళాలు, డప్పు వాయిద్యాలతో గ్రామంలో వేల మందితో భారీ ఊరేగింపు జరిగింది. ఈ ర్యాలీలో కోలాటం కళాకారుల ఆట-పాటలు, డప్పు కళాకారుల దరువులు విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రచార రథం నుంచి ప్రజలకు అభివాదం చేస్తూ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దంపతులు ర్యాలీలో ముందుకు సాగగా, దారి పొడవున బంతి, గులాబీ పూల వర్షం కురిపిస్తూ కార్యకర్తలు తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఆలయం వద్దకు కుటుంబ సమేతంగా చేరుకున్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు ఆలయ అర్చకులు, వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. గర్భాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భట్టి దంపతులు ఆలయ అర్చకులు నిర్వహించిన హోమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేద పండితులు అర్చకులు ఉప ముఖ్యమంత్రి భట్టి దంపతులకు వేద ఆశీర్వచనం చేశారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి సతీమణి మల్లు నందిని, కుమారుడు మల్లు సూర్య విక్రమాదిత్య, వైరా శాసనసభ్యులు మాలోతు రామదాసు నాయక్, డిసిసి అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ నాయుడు సత్యం, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.





