ముగ్గురి అరెస్టు : సిఐ పి.సత్యనారాయణ రెడ్డి
కాజీపేట, ప్రజాతంత్ర, జూన్ 1: వరంగల్ ఆఫీసర్స్ క్లబ్ (Warangal Officers Club ) లో గతేడాది ఏప్రిల్ 18న ఫ్యానుకు ఉరేసుకున్న శ్రీనివాస్, తన ఆత్మహత్యకు క్లబ్ లోని మేనేజర్ గోలి గోపాల్ రెడ్డి, చెరుకు రాజిరెడ్డి, పొడిచెట్టి రవీందర్ కారణమని తన కొడుకు సెల్ ఫోన్ కు వీడియో పంపించాడు. ఆత్మహత్య చేసుకున్న శ్రీనివాస్ కొడుకు ఫిర్యాదు మేరకు సుబేదారి పోలీసులు దర్యాప్తు చేయగా విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.
వరంగల్ ఆఫీసర్స్ క్లబ్ లో మేనేజర్ గోలి గోపాల్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ చెరుకు వెంకట రాజిరెడ్డి, షటిల్ బాయ్ గా పని చేసే పొడిశెట్టి రవీందర్ లు డబ్బులు సులభంగా సంపాదించాలని నిర్ణయించుకున్నారు. ఎవరైనా క్లబ్ లో మెంబర్ షిప్ కోసం వొస్తే వారికి క్లబ్ ఎంట్రీ ఫీజు రూ.1,40,000/- ఉంటుందని చెప్పి వారు జాయిన్ కావడానికి వొస్తే వారి నుంచి జాయినింగ్ ఫీజు తీసుకొని వారికి ఒక ఐడి కార్డ్ ను ఇచ్చేవాడు, కానీ వారి వివరాలు క్లబ్ మినట్స్ బుక్ లో ఎంట్రీ చేసే వాడు కాదు. ఇలా మొత్తంగా సుమారు రూ.1,30,00,000/- ల వరకు తీసుకొని వాటిని క్లబ్ అకౌంటులో కట్టలేదు. అదే విధంగా జాయింట్ సెక్రటరీ చెరుకు వెంకట రాజిరెడ్డి కొంత మందిని క్లబ్ లో జాయిన్ కావడానికి తీసుకొచ్చి వారి వద్ద నుండి డబ్బులు సుమారు రూ.60,00,000/- ల వరకు వసూలు చేసి తన స్వంత అవసరాలకు వాడుకున్నాడు. క్లబ్ లో షటిల్ బాయ్ గా పని చేసే పొడిశెట్టి రవీందర్ రూ 10 లక్షలు క్లబ్ డబ్బులను వాడుకున్నారు. ఇలా ఈ ముగ్గురు కుమ్మక్కయి మొత్తంగా రూ.2,00,00,000/- వరకు డబ్బులను క్లబ్ లో ఎంట్రీ పెట్టకుండా వారి సొంత అవసరాలకు వాడుకున్నారని పోలీసులు పేర్కొన్నారు. సుబేదారి పోలీసులు ఆఫీసర్స్ క్లబ్ లో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. కాగా ఈ కేసు ఛేదనలో ప్రతిభ కనబరిచనిన ఎస్ఐ రామరావు, ఏఎస్ఐ వేంకటేశ్వర రావు, హెడ్ కానిస్టేబుల్ లు శ్రీనివాస స్వామి, రోషన్ అలీ, పోలీస్ కానిస్టేబుల్ ఉమేశ్, దేవేందర్ ను సుబేదారి సిఐ పి.సత్యనారాయణ రెడ్డి అభినందించారు.