అందరికీ రోల్‌మోడల్‌గా నిలవాలి

ఏఎంవీఐల పాసింగ్‌ ఔట్‌ పెరేడ్‌లో మంత్రి పొన్నం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 9: తెలంగాణ పోలీస్‌ అకాడమీలో శిక్షణ పొందిన 96మంది అసిస్టెంట్‌ మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్స్‌ (ఏఎంవీఐ) పాసింగ్‌ ఔట్‌ పెరేడ్‌ బుధవారం జరిగింది. ముఖ్య అతిథిగా రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏఎంవీఐ నుంచి గౌరవ వందనం స్వీకరించారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి రవాణా శాఖలో పలు కీలక పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు తీసుకుందని మంత్రి పొన్నం తెలిపారు. ఇప్పటికే 113 ఏఎంవీఐ పోస్టులు, 54 రవాణా కానిస్టేబుల్‌ పోస్టులు, 10 జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తయిందని, 113 పోస్టులకు గాను 96మందికి మార్చిలో శిక్షణ ప్రారంభం కాగా నాలుగు నెలల శిక్షణ తర్వాత నేడు వారు పాసింగ్‌ పెరేడ్‌ జరుపుకున్నట్లు తెలిపారు. శిక్షణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి మంత్రి అవార్డులు ప్రదాపం చేశారు. దేశంలో రవాణా శాఖలో నియామకం అవుతున్న వారందరికీ మీరు రోల్‌ మోడల్‌గా ఉండాలని మంత్రి పొన్నం ఆకాంక్షించారు. రోడ్డు ప్రమాదాలు నివారించడానికి మీ శక్తి ఉపయోగించాలని, డెత్‌ రేట్‌ తగ్గించాలని,
ట్రాఫిక్‌ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, ఉల్లంఘనులపై ఎన్‌ఫోర్స్‌ెమెంట్‌ చేస్తూ కఠినంగా వ్యవహరించాలని మంత్రి వారికి సూచించారు. రవాణా శాఖలో అనేక సంస్కరణలు తీసుకొచ్చి ప్రజలకు సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. మీరు రవాణా శాఖలోకి రావడం వల్ల శాఖ మరింత పటిష్టం అయిందన్నారు. దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల్లో గాయపడనవారికి కేంద్రం క్యాష్‌లెస్‌ ట్రీట్మెంట్‌ తీసుకొచ్చిందని చెప్పారు. శిక్షణ తీసుకున్న వారిలో రైల్వే, పోలీస్‌ ఇతర విభాగాల్లో విధులు నిర్వర్తించిన వారు కూడా ఉన్నారన్నారు. హైదరాబాద్‌ నగరంలో ఈవి, సీఎన్‌జీ, ఎల్‌పీజీ వాహనాలకు ప్రాధాన్యమిస్తున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి పక్షాన, రాష్ట్ర కేబినెట్‌ పక్షాన మీకు శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతున్నానన్నారు. కార్యక్రమంలో స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ వికాస్‌రాజ్‌, పోలీస్‌ అకాడమీ డైరెక్టర్‌ అభిలాష బిస్తి, రవాణా శాఖ కమిషనర్‌ సురేంద్రమోహన్‌, జేటీసిలు, రవాణా శాఖ అధికారులు, పోలీస్‌ అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *