రోడ్లు, కల్వర్టులకు తక్షణ మరమ్మతులు చేపట్టాలి

– ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 30: వరద నీరు ప్రవేశించిన లోతట్టు కాలనీలు, గ్రామాలను మ్యాపింగ్‌ చేసి మరోసారి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అధికారులను ఆదేశించారు. కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులు, వాటర్‌ బోర్డు, ఆర్‌ అండ్‌ బి, విద్యుత్తు అధికారులు, మున్సిపల్‌ కమిషనర్లతో గురువారం ఆయన ఫోన్‌లో మాట్లాడారు. దెబ్బతిన్న రోడ్లు, కల్వర్టులకు తక్షణ మరమ్మతులు చేపట్టాలని, తరచూ విద్యుత్తు సరఫరాకు అంతరాయం జరిగే ప్రాంతాల్లో శాశ్వత ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వరదల వల్ల నష్టపోయిన ప్రజలకు తక్షణ సాయం అందించడంతోపాటు నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదికలు పంపించాలని కూడా ఆదేశించారు. అధికారులు స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి కూరగాయల తోటలు, వరి పొలాల్లో పంట నష్టం అంచనాలు తయారు చేయాలన్నారు. వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా యుద్ధప్రాతిపదికన మరమ్మతులు పూర్తిచేయాలని శ్రీధర్‌బాబు ఆదేశించారు. ఆర్టీసీ బస్సులు నిలిచిపోయిన గ్రామాల రహదారుల మరమ్మతులు చేపట్టి రవాణా సౌకర్యాన్ని పునరుద్దరించాలన్నారు. జిల్లా కలెక్టర్లు, మున్సిపల్‌ కమిషనర్లు అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసుకుని ఎక్కడా అవాంతరాల్లేకుండా పనులు జరిగేలా చూడాలని సూచించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *