నదీ జలాల వివాదంలో పీటముడి

 తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పోల్చుకుంటే ట్రిబ్యునల్ లో విచారణ గురించి ఆంధ్ర ప్రదేశ్ సన్నాహాలు ఇంత వరకు చేపట్టలేదు. ముఖ్యమంత్రి కాదు కదా.. జల వనరుల శాఖ మంత్రి కూడా దృష్టి పెట్టినట్లు కన్పించడం లేదు. మరో విశేషమేమంటే తెలంగాణలో ప్రతిపక్ష  బిఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఆందోళన తో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష  వైసిపి కూడా ట్రిబ్యునల్ విచారణ గురించి ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. వామ పక్షాలు ఇటీవల ఆవిర్భవించిన ఆలోచనపరుల వేదిక కొందరు రైతు సంఘాల నేతలు మాత్రం బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులు కాపాడుకోవాలని ఆందోళన చేస్తున్నాయి.  

shankaraiah

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య నదీ జలాల వివాదంలో పడిన పీటముడి రోజు రోజుకూ బిగుసుకుంటోంది .బిఆర్ఎస్ పార్టీ పాలన రోజులకు మించి కాంగ్రెస్ పాలనలో సామరస్య పరిష్కారం కను చూపు మేర కనిపించడం లేదు. ఉమ్మడి రాష్ట్ర విభజన సమయంలో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నోటి వాక్కుకు మించి రావణ కాష్టాన్ని తలపిస్తోంది. నిన్న మొన్నటి వరకు బనకచర్ల అనుసంధానంతో గోదావరి జలాల వివాదం కొనసాగుతుండగా ప్రస్తుతం కృష్ణా నదీ జలాల వివాదం ప్రముఖంగా తెర మీదకు వచ్చింది. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఈనెల 23 24 25 తేదీల్లో తుదిగా తెలంగాణ వాదన వినబోతోంది.

వాస్తవం చెప్పాలంటే నదీ జలాలపై ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య రచ్చను మించి తెలంగాణలో అధికార ప్రతిపక్షాల మధ్య రగడ ఎక్కువగా వుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళేశ్వరం లొసుగులపై దూకుడు పెంచే కొద్దీ గతంలో చంద్రబాబు నాయుడుతో రేవంత్ రెడ్డికి ఉండిన  సాన్నిహిత్యం ఆధారం చేసుకుని బిఆర్ఎస్ పార్టీ నేతలు లేని పోని లింకులు అల్లి విమర్శలు గుప్పిస్తున్నారు. కొసమెరుపు ఏమంటే కాళేశ్వరం ప్రాజెక్టుపై ఘోష్ కమిషన్ కు చంద్రబాబు నాయుడు కు లింకు పెట్టారు. ఈ పూర్వ రంగంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత పదేళ్ల బిఆర్ఎస్ పార్టీ పాలన కన్నా ఎక్కువగా నదీ జలాల వాటా సాధించాలని బిఆర్ఎస్ పార్టీపై, పైచేయి సంపాదించాలనే దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నారు. ఫలితంగా ఆంధ్ర ప్రదేశ్ తో రగడ పెరుగుతోంది.
     ఒక దశలో కృష్ణ లో 500 టిఎంసిలు ఇస్తే బనకచర్ల అంగీకరించుతానని ప్రకటన చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు 904 టియంసిలకు ట్రిబ్యునల్ వద్ద టెండర్ పెట్టారు. ట్రిబ్యునల్ విచారణ సందర్భంగా రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డిని దిల్లీకి పంపుతున్నారు. దిల్లీ లో జరిగిన ముఖ్యమంత్రుల సమావేశంలో వివాదాల పరిష్కారానికి కమిటీ నియామకానికి అంగీకరించినా అంతిమంగా నేడు అందుకూ సిద్ధం కావడం లేదు. నదీ జలాల వివాదంపై ఆంధ్ర ప్రదేశ్ తో చర్చలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెరదించినట్లుంది. ఈ క్రమంలోనే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ విచారణ సందర్భంగా కృష్ణ లో ఎక్కువ నీళ్ల కోసం పోరాడాలనే నిశ్చయానికొచ్చినట్లుంది. ట్రిబ్యునల్ విచారణ సందర్భంగా అనుసరించ వలసిన వ్యూహం రూపొందించేందుకు ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కృష్ణ నదీ జలాల్లో తెలంగాణ వాటాగా 904 టిఎంసిలు సాధించాలని నిర్దేశించారు.
తెలంగాణకు 904 టిఎంసిలు కేటాయించితే మరి ఆంధ్ర ప్రదేశ్ పరిస్థితి ఏంటి? మొత్తం ఉన్న  నీళ్లు ఎన్ని? అమలులో ఉన్న  బచావత్ ట్రిబ్యునల్ ఆంధ్ర ప్రదేశ్ కు 811 టిఎంసిలు కేటాయించింది. పోలవరం నుండి వచ్చే 80 టియంసిల్లో ఎగువ రాష్ట్రాలకు 35 టియంసిలు పోగా మిగిలినది కేవలం 45 టియంసిలు. విచారణ జరుపుతున్న బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఈ నీళ్లనే పంచ వలసి ఉంది . బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన క్యారీ ఓవర్ 150 టిఎంసిలు పరిగణనలోకి తీసుకుంటుందా? కాకుంటే 2013 లో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఆంధ్రప్రదేశ్ కు కేటాయించిన నికరంగా 39 టిఎంసిలు క్యారీ ఓవర్ కింద 150 టీఎంసీలు ఉన్నాయి. అయితే ఈ తీర్పు నోటిఫై కాలేదు. కాబట్టి అధికారిక ముద్ర లేదు.
    2013 లో బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ చేసిన కేటాయింపులు ఇతర రాష్ట్రాలు కూడా అనుభవించడం లేదు. అందువలననే బేసిన్ లో బచావత్ ట్రిబ్యునల్ తీర్పు అమలులో ఉంది. ప్రస్తుతం విచారణ జరుపుతున్న బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ గతంలో తను కేటాయించిన ఆంధ్ర ప్రదేశ్ వాటాను పరిగణనలోకి తీసుకుంటుందా? ఎటొచ్చి క్యారీ ఓవర్ కింద 150 టీఎంసీలు ఉంటాయి కాబట్టి ఈ అంశంలో ట్రిబ్యునల్ ఏ వైఖరి తీసుకొంటుందో వేచి చూడాలి. ఈ లెక్కన చూసినా బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 811 టిఎంసిలు పోలవరం వాటా 45 టీఎంసీలు క్యారీ ఓవర్ కింద 150 టీఎంసీలు మొత్తం 1006 టిఎంసిలు మిగులుతాయి. ఇందులో తెలంగాణ 904 టిఎంసిలు డిమాండ్ చేస్తే ఇక ఆంధ్ర ప్రదేశ్ కు మిగిలేదెంత? తెలంగాణ ప్రభుత్వం   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పోల్చుకుంటే ట్రిబ్యునల్ లో విచారణ గురించి ఆంధ్ర ప్రదేశ్ సన్నాహాలు ఇంత వరకు చేపట్టలేదు.
ముఖ్యమంత్రి కాదు కదా.. జల వనరుల శాఖ మంత్రి కూడా దృష్టి పెట్టినట్లు కన్పించడం లేదు. మరో విశేషమేమంటే తెలంగాణలో ప్రతిపక్ష  బిఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఆందోళన తో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష  వైసిపి కూడా ట్రిబ్యునల్ విచారణ గురించి ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. వామ పక్షాలు ఇటీవల ఆవిర్భవించిన ఆలోచనపరుల వేదిక కొందరు రైతు సంఘాల నేతలు మాత్రం బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులు కాపాడుకోవాలని ఆందోళన చేస్తున్నాయి. తెలంగాణకు మరో వెసులుబాటు ఉంది.గత కొన్నేళ్లుగా అడ్వకేట్ వైద్య నాధన్ తెలంగాణ తరఫున అటు ట్రిబ్యునల్ ఇటు సుప్రీమ్ కోర్ట్ లో వాదిస్తున్నారు. ఫలితంగా సమగ్ర అవగాహన ఉంటుంది. కానీ ఆంధ్ర ప్రదేశ్ కు ఆలాంటి సౌకర్యం లేదు. ఇంతకీ రేపు ట్రిబ్యునల్ లో ఎవరు వాదన విన్పించుతారో స్పష్టత లేదు. ఆంధ్ర ప్రదేశ్ వాదనలు ఇంకా మొదలు కాకున్నా తొలి నుండి ఒకే అడ్వకేట్ ఫాలో అయి ఉంటే  అవగాహన ఉండేది. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని కోట్లు పెట్టుబడులు వచ్చేది.. ఎన్ని లక్షల మందికి ఉద్యోగాలు రాబోయేది రోజూ ప్రకటనలు వస్తాయి గాని మున్ముందు ఏదైనా జరిగితే కొంప మునగబోయే ట్రిబ్యునల్ విచారణ గురించి మాత్రం ఒక్క ముక్క బహిర్గతం కాదు.
-వి. శంకరయ్య 
విశ్రాంత పాత్రికేయులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *