– నాలుగు రోజుల్లో 27,650 మెట్రిక్ టన్నుల యూరియా
– గత రెండు రోజుల్లో 23 వేల మెట్రిక్ టన్నులు సరఫరా
– యూరియా సరఫరాపై అధికారులతో సమీక్ష
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 12: రాష్ట్రంలోని ఆర్‌ఎఫ్‌సీఎల్ ఎరువుల కర్మాగారాన్ని పునరుద్ధరించేలా మరోసారి కేంద్రాన్ని కోరాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని రైతులకు అవసరమైన ఎరువుల సరఫరా నిరంతరంగా కొనసాగించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నదని తెలిపారు. యూరియా సరఫరాపై వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, డైరెక్టర్ గోపి, కమిషనరేట్ అధికారులతో మంత్రి తుమ్మల శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గురువారం ఆర్‌ఎఫ్‌సీఎల్, సిల్, క్రిభ్‌కో, ఐపీఎల్-దామ్రా కంపెనీల నుండి 11,930 మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి చేరుకుందని, రెండు రోజులుగా రాష్ట్రానికి 23,000 మెట్రిక్ టన్నులు యూరియా వచ్చిందని చెప్పారు. శనివారం వరకు సిల్, ఐపీఎల్, ఆర్‌ఎఫ్‌సీ, జీఎస్‌ఎఫ్‌సీ, స్పిక్ కంపెనీల ద్వారా మరో 5,680 మెట్రిక్ టన్నులు రానున్నాయని, అలాగే వచ్చే నాలుగు రోజుల్లో ఇఫ్‌కో, ఎంసీఎఫ్‌ఎల్, సిల్-కాకినాడ, స్పిక్, క్రిబభ్‌కో, ఎన్‌ఎపఫ్‌ఎల్-యాస ఉన్సాల్ సునార్Iవైజాగ్, సిల్-ఫోర్జాదోరియా, ఐపీఎల్, నర్మద, ఆర్‌సీఎఫ్, ఆర్‌సీఎఫ్-ట్రాంబే కంపెనీల ద్వారా 27,650 మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి రానున్నదని వివరించారు. ప్రస్తుతం రాష్ట్రానికి వివిధ ఎరువుల కంపెనీల నుండి 11 రేక్‌లు రవాణాలో ఉన్నాయని మంత్రి తెలిపారు. ఈ ఎరువులు ఆయా రైల్వే రేక్ పాయింట్లకు చేరుకుంటాయన్నారు. ఈ రేక్‌లు రేపటి వరకు క్రమంగా జిల్లాలకు చేరుతాయని కూడా తెలిపారు. అదేవిధంగా ఈనెల 12 నుండి 18వ తేదీ మధ్యకాలంలో మరో 11 రేక్‌ల రాకకు ప్రణాళిక రూపొందించినట్లు, ఆయా రేక్ పాయింట్ల నుంచి అవసరమైన జిల్లాలకు వీటిని తరలించే ఏర్పాట్లు పూర్తయ్యాయని వివరించారు. ఎరువుల పంపిణీలో అంతరాయం లేకుండా ఉండేందుకు రైతు వేదికలలో కూడా సేల్ పాయింట్లు ఏర్పాటు చేయాలని జిల్లాల అధికారులను ఇప్పటికే ఆదేశించినట్లు మంత్రి తుమ్మల తెలిపారు.
ఇక్రిశాట్ సంస్థ ప్రతినిధులతో మంత్రి భేటీ
రాష్ట్రంలో వ్యవసాయాభివృద్ధికి ఇక్రిశాట్‌తో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని మంత్రి తుమ్మల తెలిపారు. వ్యవసాయ రంగంలో తమ సంస్థ భాగ్యస్వామ్యం గురించి ఇక్రిశాట్ సంస్థ ప్రతినిధులు సచివాలయంలో ఆయనతో చర్చించారు. ఈ సందర్భంగా ఇక్రిశాట్ ప్రతినిధులు చిక్కుళ్ళు, తృణ ధాన్యాల మెరుగైన రకాలతోపాటు, వివిధ పంటలలో తాము అమలు చేస్తున్న వ్యవసాయ సాంకేతిక పద్ధతులను వివరించారు. ఇక్రిశాట్, రాష్ట్రం మధ్య సహకారాన్ని బలోపేతం చేయడం ద్వారా రాష్ట్రంలో వ్యవసాయ రంగం మరింతగా ఎలా అభివృద్ధి చెందుతుందో కూడా వారు వివరించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన మంత్రి వ్యవసాయ రంగంలో ఇక్రిశాట్ కృషిని ప్రశంసించారు. ఇక్రిశాట్ తన భాగస్వామ్యాన్ని ప్రభుత్వంతో బలోపేతం చేయాలని కోరుకుంటోందని, వ్యవసాయ రంగ అభివృద్ధికి అవసరమైన సాంకేతిక సహకారాన్ని అందిస్తామని తెలిపారు. హైదరాబాద్‌లోని ఇక్రిశాట్ సంస్థను సందర్శించాల్సిందిగా ఆ సంస్థ డిప్యూటీ డైరెక్టర్ జనరల్-రీసెర్చ్, డాక్టర్ స్టాన్‌ఫోర్డ్ బ్లేడ్, డాక్టర్ హరికిషన్ సుడిలు మంత్రికి ఆహ్వానం అందజేశారు. కాగా, నెదర్లాండ్ బేస్‌డ్ ఏఐ కంపెనీ ప్రతినిధులతోనూ తుమ్మల సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో రైతు సమస్యలకు పరిష్కారం చూపేలా సాంకేతికతను ఉపయోగించి ఒక యాప్‌ను వృద్ది చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఇప్పటికే వివిధ ప్రైవేట్ సంస్థలు వివిధ రకాల యాప్‌లతో ముందుకు వచ్చాయన్నారు. అలాకాక వ్యవసాయ శాఖనే సొంతంగా ఒక యాప్‌ను వృద్ధి చేసి ప్రభుత్వ పథకాల గురించి, పంటల యాజమాన్యంలో రైతులకు ఎదురయ్యే వివిధ సమస్యలకు వెంటనే పరిష్కారం లభించేలా వన్ స్టాప్ సొల్యూషన్ యాప్‌ను ఏఐ రంగంలో పనిచేస్తున్న సంస్థలతో కలిసి వృద్ధి చేయాల్సిందిగా ఆదేశించారు.
విత్తన రంగంలో సహకారంపై ఆఫ్రికన్ ప్రతినిధుల చర్చలు
సీడ్ సమ్మిట్‌లో పాల్గొనేందుకు వచ్చిన ఆఫ్రికన్ సీడ్ ట్రేడ్ అసోసియేషన్ సెక్రటరీ, ఇతర ప్రతినిధులు రాష్ట్రంలో వ్యవసాయ రంగం, ముఖ్యంగా విత్తనోత్పత్తి రంగంలో సాధించిన ప్రగతిని తెలుసుకోవడానికి మంత్రి తుమ్మలను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతుల సంక్షేమం కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాలను, విత్తనోత్పత్తి రంగంలో ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యంతో సాధించిన అద్భుత విజయాలను మంత్రి వారికి వివరించారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం విత్తన హబ్‌గా రూపుదిద్దుకుందని, దేశీయ అవసరాల కోసం సరఫరా అయ్యే మొత్తం విత్తనంలో దాదాపు 60% తెలంగాణ నుండే వెళ్తోందని తెలిపారు. రైతులకు నాణ్యమైన విత్తనాన్ని అందించడంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను, పరిశోధన, అభివృద్ధికి ఇస్తున్న ప్రాధాన్యతను ఆయన ఆఫ్రికన్ ప్రతినిధులకు తెలియజేశారు. విత్తన రంగంలో రాష్ట్రం సాధించిన పురోగతిని, రైతుల కోసం అమలు చేస్తున్న పథకాలను ఆ ప్రతినిధులు అభినందించారు. భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వంతో విత్తన రంగంలో సహకారాన్ని పెంపొందించుకోవాలని ఆకాంక్షించారు. ఈ సమావేశం ఇరు దేశాల మధ్య వ్యవసాయ రంగంలో పరస్పర సహకారానికి మార్గం సుగమం చేస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




