నిన్నటివరకు పనికిరాదన్నారు..

“కాళేశ్వరాన్ని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రెండేళ్ళుగా పడావుపెట్టింది. ఒకవైపు ప్రాజెక్టు పనికిరాదంటూనే మల్లన్నసాగర్‌నుండి హైదరాబాద్‌కు నీళ్ళు ఇస్తామనడాన్ని, ప్రాణహిత- చేవెళ్ళ ప్రాజెక్టు లింకును కాళేశ్వరంలో భాగమైన సుందిళ్ళ బరాజ్‌ ‌నుంచి ఎల్లంపల్లికి చేపడుతామనడం చూస్తుంటే కాళేశ్వరం భారీ ప్రాజెక్టు తప్ప నీటి ఎత్తిపోతలకు మరో ప్రత్యమ్నాయం లేదన్నది స్పష్టమవుతుంది ..”

  • నేడు వినియోగంలోకి తెస్తామంటున్నారు
  • కాళేశ్వరంపైన మాట మార్చిన కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం

manduva ravindhraకాళేశ్వరానికి తెలంగాణ సర్కార్‌ ‌కూలేశ్వరమని నామకరణచేసింది. నిన్నటివరకు ఈ ప్రాజెక్టు పనికిరానిదని ముద్రవేసింది. కట్టిన కొద్దికాలంలోనే ఆ ప్రాజెక్టు పనికిరాకుండా పోయిందంటూ తీవ్రంగా ధ్వజమెత్తింది. ఈ ప్రాజెక్టులో లక్షకోట్ల అవినీతి జరిగిందని ఎలుగెత్తింది. బిఆర్‌ఎస్‌కు ఇది ఏటిఎంగా మారిందని ఆ పార్టీతోపాటు బిజెపికి చెందిన దిల్లీ నుంచి గల్లీ లీడర్లవరకు ఆరోపించారు. నిరుపయోగమైన ఈ ప్రాజెక్టుకు ప్రత్యమ్నాయ నిర్మాణంచేస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మాటమార్చింది. దాన్ని వినియోగంలోకి తీసుకొస్తామంటోంది నేడు. ఇది కాంగ్రెస్‌ ‌ద్వంద్వ వైఖరికి నిదర్శనమన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి.

లక్ష కోట్ల వ్యయంతో నిర్మించిన కాళేశ్వరాన్ని వదిలేయలేమని, వాడుకలోకి తెస్తామని సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొనడం పలువురిని ఆశ్చర్యపర్చింది. కాళేశ్వరాన్ని తీసుకుని నిన్నటివరకు గత బిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వంపైన, కెసిఆర్‌పైన దుమ్మెత్తిపోసిన రేవంత్‌రెడ్డి తన అభిప్రాయాన్ని ఇలాఎలా మార్చుకున్నారన్న విషయం రాష్ట్ర ప్రజల్లో ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది. గత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ‌పార్టీ, ముఖ్యంగా ఆనాడు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డికి బిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వంపై దాడికి కాళేశ్వరం ప్రధానాస్త్రంగా లాభించింది. ఎంతో ప్రతిష్టగా భావించి లక్ష కోట్లతో నిర్మించిన ప్రాజెక్టు కేవలం కొద్దిమాసాల్లోనే కూలిపోవడం బిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వ అవినీతికి తార్కాణమంటూ ఆనాడు కాంగ్రెస్‌ ఎలుగెత్తి చాటడంతో బిఆర్‌ఎస్‌ అధికారానికి దూరమైంది.

అదిమొదలు గడచిన రెండేళ్ళుగా కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం బిఆర్‌ఎస్‌ను వెన్నాడుతూ వచ్చింది. కాళేశ్వరంలో జరిగిన అవినీతిపై నిగ్గుతేల్చేందుకు కమిషన్లు, విజిలెన్స్‌ల విచారణలతో బిఆర్‌ఎస్‌ను ఒకవిధంగా ఉక్కిరిబిక్కిరి చేసింది. ఇంజనీరింగ్‌ ‌నిపుణులు, నిర్మాణ ఏజన్సీలు, ఐఐటీ రూర్కీ సంస్థ, ఎన్డీఎస్‌ఏ (‌నేషనల్‌ ‌డ్యామ్‌ ‌సేఫ్టీ అథార్టి) లాంటివనేకం కాళేశ్వరం నిర్మాణంపై అధ్యయనం చేసి నివేదికలను అందజేశాయి. మేడిగడ్డ బారేజ్‌లో మొత్తం ఎనిమిది బ్లాకులుండగా, అందులో ఏడవ బ్లాక్‌లోని రెండు పిల్లర్లు పగుళ్ళుపట్టాయి. వాటిని రిపేర్‌ ‌చేసి బరేజ్‌ను వాడుకోవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే రేవంత్‌ ‌సర్కార్‌ ‌మరమ్మతు విషయాన్ని పక్కకుపెట్టి, దాని వైఫల్యాన్ని తన రాజకీయ లబ్ధికి వినియోగించుకుంటూ వచ్చారన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అలాగే ముఖ్యమంత్రి మొదలు మంత్రులు, పార్టీ నాయకులందరికీ బిఆర్‌ఎస్‌పై విరుచుకుపడడానికి ఇదిఒక ఆయుధంగా మారింది.

ఈ రెండేళ్ళ కాలంలో సభలు, సమావేశాలు, ప్రభుత్వ కార్యక్రమాలు ఏవైనప్పటికీ కాళేశ్వరం, కెసిఆర్‌ ‌పేరులేకుండా ఉపన్యాసం ముగింపులేని పరిస్థితి. ఒక విధంగా ఈ విమర్శ కాంగ్రెస్‌కు సక్సెస్‌ ‌చేకూరుస్తునే ఉంది. ఈ రెండేళ్ళ కాలంలో రాష్ట్రంలో జరిగిన ఎన్నికలన్నిటిలో కాంగ్రెస్‌ ‌విజయాలకు ఇదే కారణమని భావిస్తున్నారు. నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అయితే కాళేశ్వరం ప్రపంచంలోనే అతిపెద్ద మానవ తప్పిదం (మ్యాన్‌మేడ్‌ ‌డిజాస్టర్‌)‌గా అభివర్ణించారు. దేశంలోనే అత్యంత ప్రమాదకర డ్యామ్‌ల్లో కాళేశ్వరం మొదటిస్థానంలో నిలుస్తుందంటూ దానిపైన అసెంబ్లీలో ఆయన పవర్‌పాయింట్‌ ‌ప్రజంటేషన్‌ కూడా ఇచ్చారు. కాళేశ్వరం ఎట్టిపరిస్థితిలోనూ పనికిరాని ప్రాజెక్టు కావటంవల్ల తాము ఎట్టిపరిస్థితిలోనూ తుమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి తీరుతామని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించడం గమనార్హం. మేడిగడ్డలో రెండు పిల్లర్లు పగుళ్ళు పడటాన్ని తీసుకుని మొత్తం ప్రాజెక్టే నిష్ప్రయోజనమంటూ దాన్ని వినియోగించుకోవడమే మానివేసింది రేవంత్‌ ‌సర్కార్‌. ‌ఫలితంగా గత రెండేళ్ళ కాలంలో లక్షల ఎకరాల వ్యవసాయ క్షేత్రాలకు నీరు అందక రైతాంగం నష్టపోవడంపై ప్రతిపక్షాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి.

బరాజ్‌ ‌విషయంలో ఒకపక్క విచారణ జరుగుతున్నప్పుడు రైతాంగం నష్టపోకుండా పిల్లర్లను రిపేరు చేయవచ్చుకదా అంటూ తెలంగాణవాదులు కూడా రేవంత్‌ ‌సర్కార్‌కు విజ్ఞప్తులు చేశారు. ఏదిఏమైన కాళేశ్వరాన్ని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రెండేళ్ళుగా పడావుపెట్టింది. ఒకవైపు ప్రాజెక్టు పనికిరాదంటూనే మల్లన్నసాగర్‌నుండి హైదరాబాద్‌కు నీళ్ళు ఇస్తామనడాన్ని, ప్రాణహిత- చేవెళ్ళ ప్రాజెక్టు లింకును కాళేశ్వరంలో భాగమైన సుందిళ్ళ బరాజ్‌ ‌నుంచి ఎల్లంపల్లికి చేపడుతామనడం చూస్తుంటే కాళేశ్వరం భారీ ప్రాజెక్టు తప్ప నీటి ఎత్తిపోతలకు మరో ప్రత్యమ్నాయం లేదన్నది స్పష్టమవుతున్నదంటున్నారు బిఆర్‌ఎస్‌ ‌నేతలు. ఇంతకాలానికైన కాళేశ్వరాన్ని వాడుకుంటామని సిఎం రేవంత్‌రెడ్డి అనడాన్ని బిఆర్‌ఎస్‌ ‌నేతలు హర్షిస్తున్నారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నిపుణుల కమిటీ సూచనల మేరకు కాళేశ్వరాన్ని వాడుకలోకి తెస్తామని రేవంత్‌రెడ్డి పేర్కొనడం చూస్తుంటే కాళేశ్వరంపై ఇంతకాలం కాంగ్రెస్‌ ‌చేస్తున్న ఆరోపణల్లో వాస్తవంలేదని అర్థమవుతున్నదంటున్నది బిఆర్‌ఎస్‌.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *