– రెండేళ్ల పాలనలో ఏం చేశారు?
– కేసీఆర్ పూర్తి చేసిన ప్రాజెక్టులకు రిబ్బన్ కటింగ్ తప్ప
– క్రెడిట్ కొట్టేయడంపై వున్న శ్రద్ధ భూసేకరణ మీద లేదు
– ప్రజల మనోఫలకాలపై ముద్ర వేయాలి
– మాజీ మంత్రి హరీష్‌రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 16: తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా మార్చేందుకు కేసీఆర్ అహర్నిశలు శ్రమించి ప్రాజెక్టులు కడితే వాటిపై కాంగ్రెస్ స్టిక్కర్లు వేసుకోవాలని చూస్తున్న రేవంత్ అర్భకత్వాన్ని చూసి జాలివేస్తోందని మాజీ మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో నిర్మించిందేం లేక కేసీఆర్ పూర్తి చేసిన ప్రాజెక్టులు, నిర్మాణాలకు రిబ్బన్ కట్ చేయడమే రేవంత్ పనిగా పెట్టుకున్నాడన్నారు. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు అన్నట్లు.. సీఎం పదవి కలిసొచ్చిన రేవంత్ రెడ్డికి కేసీఆర్ నిర్మించిన ప్రాజెక్టులు, ఉద్యోగ నియామకపత్రాలు రెడీ మేడ్ గా తయారై ఉన్నాయి. తట్టెడు మట్టి తీసింది లేదు, ఒక్క ఇటుక వేసింది లేదు అయినా చనాకా కొరటా, సదర్మాట్ బ్యారేజీలను తామే పూర్తి చేసినట్లు గొప్పలు చెప్పుకున్న నేటి మీ సభ మీరు చెప్పినట్లే.. చరిత్రలో నిలబడుతుందన్నారు. కేసీఆర్ మహారాష్ట్రతో చారిత్రక ఒప్పందం కుదుర్చుకొని, రూ. 1200 కోట్లు ఖర్చు పెట్టి చనాకా-కొరాటా బ్యారేజీ, పంప్ హౌస్‌లు, మెయిన్ కెనాల్, సబ్ స్టేషన్లతో సహా పనులు పూర్తి చేయించారు. 2023 సెప్టెంబర్‌లోనే సక్సెస్‌ఫుల్‌గా వెట్ రన్ కూడా పూర్తి చేసారు. ప్రాజెక్టుకు కాలువల పనులకు అవసరమైన 3,200 ఎకరాల్లో 1600 ఎకరాలను కేసీఆర్ సేకరిస్తే.. ఈ రెండేళ్లలో ఒక్క ఎకరా భూమి కూడా సేకరించలేని నువ్వు, ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వని నువ్వు.. ఏ మొహం పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ రీ-రన్ (వెట్ రన్) డ్రామాలు ఆడుతున్నావని ప్రశ్నించారు. రెండేళ్లుగా భూమి సేకరించకుండా, కాలువలు తవ్వకుండా.. ఆదిలాబాద్ ప్రజలను మోస పుచ్చారు. క్రెడిట్ కొట్టేయడం మీద ఉన్న శ్రద్ధ.. భూసేకరణ మీద పెట్టి ఉంటే ఈపాటికి ప్రాజెక్ట్ ఫలితాలు రైతులకు దక్కేవి. 1.5 టీఎంసీల సామర్థ్యంతో కేసీఆర్ రూ. 500 కోట్లతో సదర్మాట్ బ్యారేజీని సిద్ధం చేస్తే.. రెండేళ్లుగా చుక్క నీరు నిలపకుండా ఉమ్మడి ఆదిలాబాద్ రైతుల నోట్లో మట్టి కొట్టారు. రెండేళ్ల క్రిందనే 18 వేల ఎకరాల ఆయకట్టును నీళ్లు ఇచ్చే అవకాశం ఉన్నా, ఇవ్వకుండా రైతులకు తీరని అన్యాయం చేసారు. ఇప్పుడు సిగ్గులేకుండా రిబ్బన్ కట్ చేస్తూ అంతా మీ ఘనతే అని డబ్బా కొట్టుకోవడం మీ దగుల్భాజీతనానికి పరాకాష్ట అన్నారు. ఈ రెండేళ్ల కాలం వృథా చేసినందుకు ముక్కు నేలకు రాసి రైతులకు క్షమాపణ చెప్పాలి. కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్లకు నియామక పత్రాలు పంచడం.. కేసీఆర్ కట్టిన ప్రాజెక్టులకు రిబ్బన్లు కట్ చేయడం తప్ప సొంతంగా మీరు చేసిందేం లేదు. బీఆర్ఎస్ కట్టిన ప్రాజెక్టుకు సున్నాలు వేసి నాదే అని చాటింపు వేసుకోవడం మీ అల్పబుద్దికి నిదర్శనం. ప్రాజెక్టులు కట్టడం మా వంతు, పేర్లు పెట్టుకోవడం మీ వంతు పరిపాటిగా మారింది. లోయర్ పెన్ గంగా ప్రాజెక్టు పేరు చెప్పుకొని రెండు సార్లు ఎన్నికల్లో గెలిచి, ప్రజల్ని మోసం చేసిన సి. రామచంద్రారెడ్డి పేరు ప్రాజెక్టుకు పెట్టడం అంటే ఆదిలాబాద్ ప్రజల మనోభావాలను అవమానించడమే. ప్రాజెక్టు నిర్మించి ఆదిలాబాద్ ప్రజల కలలు సాకారం చేసింది బిఆర్ఎస్ అయితే, ఆ ప్రాజెక్టు నిర్మాణంలో వీసమెత్తు కృషి చేయని వ్యక్తి పేరు పెట్టి మోసం చేస్తున్నది కాంగ్రెస్ అన్నారు.
రెండేళ్లు గడిచినా తట్టెడు మట్టి కూడా తీయలేకపోయారు
ఆదిలాబాద్ వెనుకబాటు తనానికి, పాలమూరు వలసలకు కారణం దశాబ్దాల పాటు పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వానిది కాదా? తమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్టు కడుతామని చెప్పి రెండేళ్లు గడిచినా ఒక్క తట్టెడు మట్టి కూడా ఎందుకు తీయలేక పోయారు? తమ్మిడిహట్టి పేరు మీద అప్పుడు ఆరేండ్లు, ఇప్పుడు రెండేళ్లు కాలయాపన చేసారు. మాయ మాటలు చెప్పి అదిలాబాద్ జిల్లాకు తీరని ద్రోహం చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. గ్రావిటి కాలువను వదిలి ఎత్తిపోతలకు వెళ్లామని మమ్మల్ని విమర్శించిన మీరు ఇప్పుడు తమ్మడిహట్టి నుంచి గ్రావిటి ద్వారా ఎల్లంపల్లికి నీళ్లు తెచ్చి చూపండి. లేదంటే అధికారం కోసం ప్రజలకు నోటికొచ్చిన అబద్దం చెప్పినందుకు క్షమాపణలు చెప్పమని డిమాండ్ చేస్తున్నానన్నారు. చిత్తశుద్ది గల ప్రభుత్వం ఉంటే పనులు చేస్తది తప్ప సాకులు వెతకదు. రెండేళ్లలో చేసిందేం లేక బిఆర్ఎస్ ప్రభుత్వంపై నిందలు మోపుతున్నడు రేవంత్ రెడ్డి ఎనుముల ఫ్యామిలీ అభివృద్ది కోసం రెండేళ్లలో రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసిండు. బిఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదిన్నరేండ్లలో చేసిన అప్పు అక్షరాల రూ.4.17లక్షల కోట్లే అని కాగ్ రిపోర్ట్‌తో పాటు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో చెప్పినా ఎందుకు పదే పదే తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నీ పాలన మీద నీకు నమ్మకం ఉంటే మా జోగు రామన్న, యితర బిఆర్ఎస్ నాయకులను, కార్యకర్తలను ఎందుకు ఉదయం నుంచి అరెస్టులు చేసావు రేవంత్ రెడ్డి? పోలీసులను అడ్డం పెట్టుకొని తిరుగుతూ ఇలా ఎన్ని రోజులు గడుపుతావని ప్రశ్నించారు. కేసీఆర్ కట్టిన ప్రాజెక్టుల దగ్గర శిలాఫలకాల మీద మీ పేరు చెక్కించుకోవడం కాదు.. ప్రజల మనోఫలకాల మీద మీ ముద్ర వేసుకునేలా పని చేయడం అని ఇప్పటికైనా గ్రహించండని హితవు పలికారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




