న్యూఢిల్లీ, మార్చి 4 : ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి బుధవారం ఢిల్లీలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక భద్రతా అంశాలు, పోలీస్ విభాగ బలోపేతంపై చర్చించారు. ముఖ్యమంత్రి వెంట ప్రిన్సిపల్ సెక్రటరీ వి.శేషాద్రి, రాష్ట్ర డిజిపి బి.శివధర్ రెడ్డి, ఇంటెలిజెన్స్ అడిషనల్ డిజిపి విజయ్ కుమార్, ఎస్‌ఐబి ఐజిపి బి.సుమతి తదితరులు ఉన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలను ముఖ్యమంత్రి కేంద్ర మంత్రికి వివరించారు. ముఖ్యంగా ఈగల్ ఫోర్స్ కార్యకలాపాలు, సైబర్ నేరాలను, సైబర్ సవాళ్లను ఎదుర్కోవడంలో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోషిస్తున్న క్రియాశీలక పాత్రను ప్రస్తావించారు. ఈ మధ్య హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి కమిషనరేట్లను పునర్వ్యవస్థీకరణ చేసి కొత్తగా ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ ను ఏర్పాటు చేసిన విషయాన్ని వివరించారు. ఈ కారణంగా తెలంగాణకు ఇంకా ఎక్కువ ఐపీఎస్ అధికారుల అవసరాన్ని వివరించి తెలంగాణ ఐపీఎస్ క్యాడర్ సంఖ్యను పెంచవలసిన అవసరాన్ని తెలిపారు. అంతేకాక శరవేగంగా పెరుగుతున్న హైదరాబాద్ జనాభా దృష్ట్యా పరిపాలన సౌలభ్యం కొరకు అదనంగా ఐపిఎస్ అధికారుల కేటాయింపు అత్యవసరమని, ఈ దిశగా కేంద్ర హోం శాఖ సానుకూల నిర్ణయం తీసుకోవాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఇటీవల అజ్ఞాతాన్ని వీడి బయటకు వచ్చిన మావోయిస్టు నాయకుల విషయం కూడా చర్చకు వచ్చింది. మిగిలిన మావోయిస్టు నాయకుల లొంగుబాటు, వారి పునరావాసం సంబంధించిన విషయాలను సీఎం ఈ సమావేశంలో వివరించారు. గత రెండు సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో గణనీయమైన మార్పులు వచ్చాయని, మొత్తం 591 మంది మావోయిస్టులు రాష్ట్రంలో జనజీవన స్రవంతిలో కలిసిన విషయాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఇటీవల కాలంలో పలువురు మావోయిస్టు అగ్రనేతలు కూడా సాధారణ జీవితం గడిపేందుకు ముందుకు రావడం శుభపరిణామమని, వీరందరికీ ప్రభుత్వం తరపున కల్పిస్తున్న సౌకర్యాలను వివరించారు. వెనుకబడిన ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు కేంద్రం నుంచి అందాల్సిన సహకారంపై కూడా చర్చించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




