బుల్డోజర్‌ రాజ్‌గా రేవంత్‌రెడ్డి

మీనాక్షి నటరాజన్‌కు హరీష్‌రావు ట్వీట్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 1: పేదలు, మధ్య తరగతి వర్గాల ఇండ్లపై హైడ్రా అరాచక రాజ్యం కొనసాగించడం దుర్మార్గం.. హైకోర్టు స్టే ఉన్నా గుట్టల బేగంపేటలో ఇళ్ల కూల్చివేతకు పాల్పడటం న్యాయవ్యవస్థను అవమానించడమే అని బీఆర్‌ఎస్‌ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు వ్యాఖ్యానించారు. రేవంత్‌ రెడ్డి ప్రభుత్వానికి న్యాయస్థానాలపై ఉన్న గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు. ఈమేరకు ఆయన కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌కు మంగళవారం ట్వీట్‌ చేశారు. సామాన్లు తీసుకోవడానికి కూడా సమయం ఇవ్వకుండా, పేదలపై కనికరం లేకుండా బుల్డోజర్లు ఇండ్ల మీదకు నడపడం అమానవీయమన్నారు. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వం చేస్తున్న బుల్డోజర్‌రాజ్‌కు దీటుగా తెలంగాణలో రేవంత్‌ బుల్డోజర్‌రాజ్‌ నడిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఒకవైపు ప్రతిపక్ష నేతగా రాహుల్‌ గాంధీ గారు దేశవ్యాప్తంగా బుల్డోజర్‌రాజ్‌కు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ మోహబ్బత్‌కి దుకాన్‌ అంటూ ప్రేమ సందేశాలు ఇస్తుంటే మరోవైపు అదే పార్టీ ముఖ్యమంత్రి అయిన రేవంత్‌ రెడ్డి మాత్రం బుల్డోజర్‌ రాజ్‌ చేస్తూ పేదల గూడు కూల్చుతున్నడని హరీష్‌రావు విమర్శించారు. ఇది కాంగ్రెస్‌ ద్వంద్వ వైఖరికి నిదర్శనం కాదా అని ప్రశ్నించారు. సీఎంను రాజ్యాంగ విలువలకు, కాంగ్రెస్‌ పార్టీ చెబుతున్న సిద్ధాంతాలకు లోబడి నడుచుకునేలా ఆదేశించాలని మీనాక్షి నటరాజన్‌కు విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *