Retired Teachers | రిటైర్మెంట్ బెనిఫిట్స్ అంద‌కముందే మ‌రో టీచ‌ర్ మృతి

  • క్యాన్స‌ర్ చికిత్స‌కు డ‌బ్బులేక మ‌ర‌ణించిన వైనం
    ఏడాదిన్న‌ర కాలంలో 28 మంది మృతి
    ఇప్ప‌టికీ చెల్లింపులు జ‌ర‌ప‌ని ప్ర‌భుత్వం
    త‌క్ష‌ణ‌మే చెల్లించాల‌ని రిటైర్డ్ టీచ‌ర్ల సంఘం డిమాండ్‌

వ‌రంగ‌ల్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 29:  రిటైర్‌మెంట్ ప్ర‌యోజ‌నాలు అంద‌క క్యాన్స‌ర్ వ్యాధితో బాధ‌ప‌డుతున్న మ‌రో రిటైర్డ్ ఉపాధ్యాయుడి ప్రాణాలు శ‌నివారం అనంత‌వాయువుల్లో క‌లిసిపోయాయి. ఆయ‌న పేరు కంక‌ల బీర‌య్య‌. వ‌రంగ‌ల్ జిల్లాలో ఉపాధ్యాయుడిగా ప‌నిచేస్తూ 2024లో ప‌ద‌వీ విర‌మ‌ణ చేశారు. గ‌త కొంత‌కాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతు తన వద్దనున్న డబ్బులన్నీ కూడా వైద్యానికి వెచ్చించారు. ఆయ‌న‌కు  రిటైర్మెంట్ బెనిఫిట్స్ వచ్చినట్లయితే త‌న వ్యాధికి చికిత్స చేయించుకునే వాడిన‌ని చెబుతుండేవారు. కానీ క్యాన్స‌ర్ మ‌హ‌మ్మారి ఆయ‌న ప్రాణాలు తీసింది.  మార్చి 2024 నుండి అక్టోబర్ 2025 వరకు రిటైర్డ్ అయిన ఉద్యోగ,ఉపాధ్యాయులు (Retired Teachers)  28 మంది వరకు చ‌నిపోయారు. వీరెవ‌రికీ రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ ఇంత‌వ‌ర‌కు అంద‌లేదు. ఇంకా ఎంతోమంది వీటికోసం ఎదురుచూస్తున్నార‌ని తెలంగాణ రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ బకాయిల సాధన సమితి ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి బోగేశ్వర్, జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు కందుకూరి దేవదాసు వివ‌రించారు. క‌నిక‌రం లేని ఈ ప్ర‌భుత్వాన్ని ఏవిధంగా అర్థం చేసుకోవాల‌ని ప్ర‌శ్నించారు. కనీసం ఈ నెలలోనైనా రిటైర్మెంట్ బకాయిలు బెనిఫిట్స్ చెల్లించాలని డిమాండ్ చేశారు. మ‌ర‌ణించిన టీచ‌ర్‌కు ఈ. ఇంద్రసేనారెడ్డి, ఆర్. వెంకటాచలం వి అజయ్ బాబు, సోమ విష్ణువర్ధన్,సోమ గోవర్ధన్, రంగయ్య తదితరులు నివాళులు అర్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *