రిటైర్డ్ ఉద్యోగుల బ‌కాయిలు త‌క్ష‌ణ‌మే చెల్లించాలి

“రిటైర్ అయ్యే ముందు ఉద్యోగులు రిటైర్మెంట్ డబ్బులతో అనేక ప్రణాళికలు ఏర్పాటు చేసుకుంటారు. కానీ ప్రభుత్వం ఇప్పటివరకు రిటైర్మెంట్ బకాయిలు చెల్లించ‌నందున‌ పిల్లల పెళ్లిళ్లు చేయలేక, ఇండ్ల నిర్మాణానికి తీసుకొచ్చిన అప్పులు చెల్లించలేక, బ్యాంకు ఈఎంఐలు చెల్లించలేక, పిల్లల ఉన్నత చదువులకు తెచ్చిన విద్యా రుణాల ఈఎంఐలు చెల్లించలేక, కొంతమంది ఉద్యోగుల పిల్లలు నిరుద్యోగులుగా ఉండడం చూడలేక, ఆరోగ్యాన్ని బాగు చేసుకోలేక, అనేక బాధలు పడుతున్నారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 26 మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు రిటైర్మెంట్ బకాయిలు రాక చనిపోయారు.”

రిటైర్డ్ ఉద్యోగుల బ‌కాయిలు త‌క్ష‌ణ‌మే చెల్లించాలిమార్చి 2024 నుండి అక్టోబర్ 2025 వరకు రిటైర్డ్ అయిన ఉద్యోగులు వివిధ పత్రికలలో వచ్చిన కథనాల ప్రకారం ఏటా 9వేల‌ మంది ఉద్యోగులు రిటైర్ అవుతారు. ఈ లెక్కల ప్రకారం ఇప్పటివరకు రిటైర్ అయిన ఉద్యోగ, ఉపాధ్యాయులు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 14 వేల మంది ఉంటారు. వీరిలో దాదాపుగా 7% శాతం మంది అంటే దాదాపుగా వెయ్యి మందికి హైకోర్టు ఉత్తర్వుల ద్వారా కావచ్చు, వ్యక్తిగత ప్రయత్నాల ద్వారా కావచ్చు వారికి రావలసిన రిటైర్మెంట్ బకాయిల చెల్లింపు జ‌రిగింది. మిగిలిన 13వేల‌ మందికి ఒక్కొక్కరికి వారి సర్వీస్ హోదాను బట్టి మరియు వారు సర్వీసులో జిపిఎఫ్ లో చేసిన పొదుపులను బట్టి ఒక్కొక్కరికి రూ.35 లక్షల నుండి అత్య‌ధికంగా రూ. 75 లక్షల వరకు రిటైర్మెంట్ బకాయిలు రావాల్సివుంది. ఈ 13వేల మందికి స‌గ‌టున రూ.50 లక్షలు చొప్పున గణించినట్లయితే 13వేల‌ మందికి రూ.6500 కోట్లు మాత్రమే ప్రభుత్వం రిటైర్మెంట్ బకాయిలు చెల్లించవలసి ఉంటుంది.

కానీ ప్రభుత్వం టీజీఈపిజెఏసి నాయకులు, ప్రభుత్వ అధికారులు, మిగతా ప్రజాప్రతినిధులు ప్రభుత్వానికి తప్పుడు సమాచారం ఇస్తూ రూ.15 వేల కోట్లు లేదా రూ.16 వేల కోట్లు చెల్లించాల్సి ఉంటుంద‌ని తప్పుడు లెక్కలు చెప్తున్నారు. వీరు ఏ లెక్క‌ల ఆధారంగా ఈవిధంగా చెబుతున్నారు? 13వేల‌ మందికి ఒక్కొక్కరికి ఒక కోటి రూపాయలు చొప్పున గణించారా? ఒక కోటి చొప్పున గణించినా కానీ రూ. 13000 కోట్లు అవుతాయి. కానీ ఎంత పెద్ద ఉద్యోగి అయినా కోటి రూపాయల బకాయిలు అసలే వుండ‌వు. కానీ రూ.15 వేల కోట్లు, రూ.16వేల‌ కోట్లు అవుతాయని చెప్ప‌డం ప్రభుత్వాన్ని తప్పుదారి ప‌ట్టించ‌డం త‌ప్ప మ‌రోటి కాదు. రిటైర్ అయిన పెన్షనర్లను వేధించ‌డ‌మే అవుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు ఖచ్చితమైన లెక్కలు తీసి ఇప్పటి వరకు ఎంత మంది రిటైర్ అయ్యారు, ఒక్కొక్క‌రికి ఎంత చెల్లించాల‌న్న‌ది లెక్క‌లు క‌ట్టాలి. ఏ ప్ర‌కారం చూసుకున్నా ఈ మొత్తం రూ.6500కోట్ల‌కు మించ‌దు. ఈ అమౌంట్ మొత్తాన్ని ప్రభుత్వము ఒకేసారి చెల్లించవచ్చు కానీ ప్రభుత్వము రిటైర్ అయిన ఉద్యోగులకు చెల్లించాలనే ఉద్దేశ్యం కనబడడం లేదు. వీరు రిటైర్ అయిన వాళ్లే కదా వీళ్ళతో పనేముంది? వీరికి ఎందుకు చెల్లించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉన్నట్లుగా భావించవలసి వస్తున్నది. కానీ ఉద్యోగ, ఉపాధ్యాయుల, పెన్షనర్ల వల్లనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింద‌నే విషయాన్ని మరువకూడదు.

రిటైర్ అయ్యే ముందు ఉద్యోగులు రిటైర్మెంట్ డబ్బులతో అనేక ప్రణాళికలు ఏర్పాటు చేసుకుంటారు. కానీ ప్రభుత్వం ఇప్పటివరకు రిటైర్మెంట్ బకాయిలు చెల్లించ‌నందున‌ పిల్లల పెళ్లిళ్లు చేయలేక, ఇండ్ల నిర్మాణానికి తీసుకొచ్చిన అప్పులు చెల్లించలేక, బ్యాంకు ఈఎంఐలు చెల్లించలేక, పిల్లల ఉన్నత చదువులకు తెచ్చిన విద్యా రుణాల ఈఎంఐలు చెల్లించలేక, కొంతమంది ఉద్యోగుల పిల్లలు నిరుద్యోగులుగా ఉండడం చూడలేక, ఆరోగ్యాన్ని బాగు చేసుకోలేక, అనేక బాధలు పడుతున్నారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 26 మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు రిటైర్మెంట్ బకాయిలు రాక చనిపోయారు. ఉదాహ‌ర‌ణ‌కు ఉమ్మడి వరంగల్ జిల్లాలో రిటైర్డ్ ఇన్‌స్పెక్ట‌ర్‌ ఆఫ్ పోలీస్ మట్టేవాడ, వరంగల్ తమకు రూ.55 లక్షల బ‌కాయిలు రావ‌ల‌సి వుండ‌టంతో, రిటైర్మెంట్ డబ్బులు వచ్చిన తర్వాత కట్నం డబ్బులు ఇస్తానని చెప్పి త‌న కుమార్తె వివాహం చేశారు.

కట్నం డబ్బుల కొరకు అత్తింటి వారు వేధించడంతో కూతురు ఆత్మహత్య చేసుకుంది. కూతురు ఆత్మహత్యతో మానసికంగా కృంగిపోయి, మనో వేదనతో రిటైర్డ్ సిఐ బాలకృష్ణ గత మే నెలలో చనిపోయారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే బాలగోని లక్ష్మణ్ కుమార్ జడ్పీహెచ్ఎస్ పైడిపల్లి జూనియర్ అసిస్టెంట్, కె.సోమిరెడ్డి హెడ్మాస్టర్ మహబూబాబాద్ జిల్లా, అజయ్ కుమార్ టీచర్ జనగాం జిల్లా, రాజేశ్వరి రిటైర్డ్ హెడ్ మాస్టర్ వరంగల్ జిల్లా, రమేష్ టీచర్ భూపాలపల్లి జిల్లా, రంగారెడ్డి జిల్లాకు చెందిన మనోహర్ రావు, ఖమ్మం జిల్లాకు చెందిన సీతారామరాజు, స్వయాన ముఖ్యమంత్రి జిల్లా అయిన మహబూబ్ న‌గ‌ర్ జిల్లాకు చెందిన రిటైర్డ్ హెడ్మాస్టర్ కొండయ్య వంటి వారు ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 26 మంది రిటైర్మెంట్ బకాయిలు రాకుండానే చనిపోయారు. రంగారెడ్డి జిల్లాలో సిలువేరు సత్యనారాయణ అనే రిటైర్డ్ హెడ్ మాస్టర్ రిటైర్మెంట్ బకాయిలు రాక మనోవేదన చెంది, అప్పులు చెల్లించలేని స్థితిలో ఇంట్లో ఎవరికి చెప్పకుండా ఎక్కడికో వెళ్లిపోయారు. ఇంతవరకు అతని ఆచూకీ లేదు. పెన్షనర్ల చావులకు ప్రభుత్వం బాధ్యత వహించవలసి ఉంటుంది ఇంతమంది పెన్షనర్లు చనిపోయినా ముఖ్యమంత్రికి రవంత, ఇసుమంత బాధ, కనికరం కూడా లేదు.

అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు నెలల్లో పిఆర్సి అమలు చేస్తామన్నారు, పెండింగ్ డి.ఏ.లన్నింటిని వెంటనే విడుదల చేస్తామని అన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు, పెన్షనర్లకు నగదు రహిత హెల్త్ కార్డులు కార్పొరేట్ హాస్పిటల్లో అమలు అయ్యే విధంగా విడుదల చేస్తామన్నారు. ఈ హామీలన్నీ అమలైనాయా? పెన్షనర్లకు రిటైర్మెంట్ బకాయిలు చెల్లించకపోవడం న్యాయమా? సమంజసమేనా? ఇది మీకు తగునా? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మానవతా దృక్పథంతో క్రింది విషయాలు కూడా పరిశీలించండి. ఉదాహరణకు ప్రభుత్వ ఉద్యోగి సర్వీసులో ఉన్నప్పుడు పూర్తి జీతం ఒక లక్ష 70 వేల రూపాయలు వేతనం తీసుకున్నప్పుడు ప్రస్తుతం అతనికి పెన్షన్ మాత్రం రూ.78,000 నుండి రూ.80,000 రూపాయలు వస్తున్నది. మిగతా రూ.90 వేలు ప్రభుత్వానికి ప్రతినెల మిగులుగానే ఉంటున్నది కదా! మరి ఆ డబ్బులు ఏం చేస్తున్నట్టు? మా జీపీఎఫ్‌ నిధులు కూడా వాడుకొని ప్రభుత్వము మాకు జీపీఎఫ్‌ ఇవ్వక పోవడం ఎంతవరకు న్యాయం? ఎంతవరకు సమంజసం? ఈ విధంగా రిటైర్ అయినటువంటి ఉద్యోగుల నుండి దాదాపుగా 55% ప్రభుత్వం దగ్గర మిగులు వేతనం ఉంటున్నది. మా జీపీఎఫ్‌ డబ్బులు మాకు ఇవ్వకుండా ఈ విధంగా పెన్షనర్లను వేధించడం సరైన విధానం కాదు. ఈ విషయాలన్నీ వివిధ టి.జి.ఈ.పి.జె.ఎ.సి. సంఘాల నాయకులు, ఉద్యోగులు, ప్రభుత్వం,ప్రజలు ఆలోచించాలని రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల సాధన కమిటీ నాయకులు కోరుతున్నారు.

ముఖ్య‌మంత్రి ఇప్పటికైనా మాకు న్యాయంగా రావలసిన రిటైర్మెంట్ బకాయిలన్నింటిని జీపీఎఫ్, జీఐఎస్, కమ్యుటేషన్, గ్రాట్యుటీ, ఈ.ఎల్.ఎన్ క్యాష్మెంట్, 2020 పీఆర్సీ ఏరియర్స్, సర్వీసులో ఉన్నప్పుడు చేసుకున్న సరెండర్ లీవులు, డి.ఏ. ఏరియర్స్ మొదలగునవి వెంటనే ఒకేసారి చెల్లించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. రిటైర్మెంట్లు ప్రారంభమై 19 నెలలు గడచినా ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడంతో, విసిగి,వేసారి విధిలేని పరిస్థితిలో రాష్ట్ర వ్యాప్తంగా రిటైర్మెంట్ ఉద్యోగుల బకాయిల సాధన కమిటీ ని అన్ని జిల్లాలలో ఏర్పాటు చేసుకొని బ‌కాయిల‌కోసం పోరాడుతున్నాం. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల జేఏసీ ఆధ్వర్యంలో నవంబర్ 17వ తేదీన హైదరాబాదులోని ఇందిరా పార్క్ వద్ద మహా ధర్నాకార్యక్రమం బాధిత కుటుంబాలతో చేపట్టబోతున్నాం. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి నవంబర్ 15 వ తేదీలోగా రిటైర్డ్ ఉద్యోగుల రిటైర్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని కోరుతున్నాం.

– కందుకూరి దేవదాసు
(రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల సాధన కమిటీ జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు ఉమ్మడి వరంగల్ జిల్లా, ఎస్.జి.పి.ఏ.టి. హనుమకొండ ఎస్టీఓ యూనిట్‌ ప్రధాన కార్యదర్శి)
సెల్ నెంబర్ 9949937745

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *