ప్రభుత్వాల నిర్లక్ష్యానికి రిటైర్డ్ ఉద్యోగులు బలి!!

రాష్ట్రంలో పదవీ విరమణ చేసిన ఉద్యోగులు తమకు న్యాయంగా రావలసిన గ్రాట్యుటీ, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, జనరల్ ప్రావిడెంట్ ఫండ్ వంటి ప్రయోజనాల కోసం ఎదురు చూస్తున్నారు. వీటికి సంబంధించి ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు రూ.8200వేల కోట్ల నుంచి రూ.12వేల కోట్ల వరకు ఉన్నాయి. చాలా మంది ఉద్యోగులు రీయింబర్స్‌మెంట్ క్లయిమ్‌లు ఆలస్యం కావడం లేదా పెండింగ్‌లో ఉండటం వల్ల వైద్యఖర్చులు భరించలేకపోతున్నారు. ప్రభుత్వ హెల్త్ కార్డులను కార్పొరేట్ హాస్పిటల్స్ అంగీకరించడం లేదు. పెండింగ్ బకాయిల వల్ల ఉద్యోగులు దీర్ఘ కాలిక బకాయిలు తీర్చలేకపోతున్నారు. పిల్లల పెళ్లిళ్లు చేయలేక, జీవన వ్యయం భరించలేక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పీఆర్‌సీ, ఇతర బకాయిలకు సరైన పరిష్కారాన్ని ఈ బడ్జెట్‌లో ప్రభుత్వం చూపలేదని రిటైర్డ్ ఉద్యోగులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అనధికారికంగా తెలుస్తున్న వార్తలను బట్టి ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న  పదవీ విరమణ ప్రయోజనాలు చెల్లించేందుకు అధికారులు 10 శాతం, బ్రోకర్లు 5శాతం వెరసి మొత్తం 15 శాతం వరకు కమీషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపణలు వొస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులే తమ సాటి ఉద్యోగుల వద్ద ఈ రకంగా కమీషన్లకు కక్కుర్తి పడటమంటే మానవత్వ పతనం ఎంతకు దిగజారిందో ఇంతకంటే గొప్ప నిదర్శనం మరోటి అక్కరలేదు. కొందరు ఉద్యోగులు ఫాస్ట్ ట్రాక్ క్లియరెన్స్ కోసం బ్రోకర్లకు ఏకంగా రూ.3 లక్షనుంచి రూ.4 లక్షల వరకు చెల్లిస్తున్నట్టు కూడా వార్తలు  వినిపిస్తున్నాయి.

గత 22 నెలలుగా తమ రిటైర్‌మెంట్ ప్రయోజనాలకోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులు కూడా ఉన్నారు. 2021లో అప్పటి బీఆరఎస్ ప్రభుత్వం, రిటైర్డ్ ఉద్యోగులకు తక్షణం చెల్లించాల్సిన బకాయిల నుంచి తప్పించుకునేందుకు రిటైర్‌మెంట్ వయసును 58 నుంచి 61 కు పెంచి చేతులు దులుపుకుంది. అప్పటికి తాత్కాలికంగా ప్రభుత్వానికి ఉపశమనం కలిగినా, 2024 నుంచి  పెద్ద ఎత్తున ఉద్యోగులు పదవీ విరమణ చేయడం మొదలైంది. వీరికి అధిక మొత్తంలో ప్రయోజనాలు చెల్లించాల్సి రావడంతో గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డ చందంగా ప్రస్తుత ప్రభుత్వానికి ఇబ్బందులు మొదలయ్యాయి. ఎందుకంటే నాటి ప్రభుత్వ నిర్ణయం వల్ల రెగ్యులర్‌గా పదవీ విరమణ చేసేవారికి అదనంగా 17వేల నుంచి 20వేల మంది రిటైర్ కావడంవల్ల, పెద్ద మొత్తంలో బకాయిలు చెల్లించాల్సి రావడంతో, ఇప్పటికే అలవికాని “సంక్షేమ” హామీలిచ్చి అవి పూర్తి చేయలేక చేతులెత్తేసిన దశలో ఉన్న  ప్రభుత్వం, ఉద్యోగులకు న్యాయబద్ధంగా అందించాల్సిన బెనిఫిట్స్‌ను కూడా పెండింగ్‌లో పెట్టడం మొదలుపెట్టింది. దీనికి తోడు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉద్యోగులకు చెల్లించాల్సిన రిటైర్‌మెంట్ బకాయిల పెండింగ్ మొత్తం రూ.4575కోట్లు కూడా చెల్లించాల్సి రావడం మూలిగే నక్క మీద తాటికాయ పడిన చందమైంది.  ఈ పరిణామాల నేపథ్యంలో రిటైర్డ్ ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇందుకోసం కూడా ఒక్కొక్కరిపై రూ.15వేల నుంచి రూ.20వేల వరకు ఖర్చు భారం పడింది. పదవీ విరమణ చేసిన ఉద్యోగుల బకాయిలు చెల్లించడానికి  ఏడు నెలలకు మించి ఆలస్యం  జరగడం ఎంత మాత్రం సమంజసం కాదని హైకోర్టు స్పష్టం చేయడమే కాదు, ఎనిమిది వారాల్లోగా పూర్తి బకాయిలు చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించించాన ఇప్ప‌టికీ సమస్య కొలిక్కి రాలేదు.

ఈ ఏడాది జనవరి నాటికి రాష్ట్రంలో 20500 కు పైగా రిటైర్డ్ ఉద్యోగులు తమకు న్యాయబద్ధంగా ప్రభుత్వం నుంచి రావలసిన ప్రయోజనాల కోసం ఎదురుచూస్తున్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం రిటైర్‌మెంట్ వయసును 61 ఏళ్లకు పెంచుతూ తీసుకున్న నిర్ణయం వల్ల 2024 మార్చి నుంచి డిసెంబర్ మధ్య కాలంలో ఏకంగా 7995 నుంచి 8 వేల మంది ఉద్యోగులు రిటైర్ అయ్యారు. ఇక 2025 లో మరో 9630 మంది ఉద్యోగులు పదవీ విరమణ చేసిన వారి జాబితాలో చేరారు. ఈ ఏడాది సుమారు మరో 9700 మంది రిటైర్ కానున్నారు. ప్రస్తుతం నెలకు 800 నుంచి 1000 మంది ఉద్యోగులు సగటున రిటైర్ అవుతుండటంతో, బకాయిలు చెల్లించాల్సిన వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. రిటైర్ అవుతున్న సిబ్బందిలో 1400 మంది గెజిటెడ్ ఆఫీసర్లు, 5300 మంది నాన్ గెజిటెడ్ ఆఫీసర్లు, 1200 మంది క్లాస్ ఫోర్ ఉద్యోగులు ఉంటున్నారు.

రిటైరైన ప్రతి ఉద్యోగికి పీఎఫ్, కమ్యుటేషన్, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ వంటి ప్రయోజనాలు రూ.35 లక్షల నుంచి రూ.75 లక్షల వరకు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వం నెలకు రూ.700 కోట్ల నుంచి రూ.745 కోట్ల వరకు ఉద్యోగుల బిల్లుల చెల్లింపు కోసం విడుదల చేస్తున్నా, ఏ నెలకానెల రూ.300 కోట్ల బిల్లులు కొత్తగా వొచ్చి చేరుతుండటంతో, రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు రూ.10వేల కోట్లకు తగ్గడం లేదు. ఇదిలాఉండగా  ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో విపక్ష బీఆర్‌ఎస్ నేతలు రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఇప్పటికే 80 మంది రిటైర్డ్ ఉద్యోగులు ఆర్థిక ఒత్తిళ్లు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్నా రని బీఆర్‌ఎస్ నాయకుడు హరీష్ రావు  అసెంబ్లీలో ఆరోపించారు. అంతేకాదు  గ్రాట్యుటీ, జీపీఎఫ్ చెల్లింపులపై బీఆర్ఎస్ ఉభయసభల్లో వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. రిటైర్డ్ ఉద్యోగులకు రూ.12వేల కోట్ల  బకాయిలు చెల్లించకపోవడం నేరపూరిత నిర్లక్ష్యంగా పేర్కొంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచంద్రరావు నాయకత్వంలో పార్టీ నాయకులు అసెంబ్లీ ముట్టడి నిర్వహించారు.

ఈ నిరసనలన్నింటికీ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమాధానమిస్తూ, తమ ప్రభుత్వం ఈ బకాయిలు చెల్లించేందుకు కృతనిశ్చయంతో ఉన్నదన్నారు. గత ప్రభుత్వం వొదిలివెళ్లిన బకాయిలు తీర్చుకుంటూ ఒక్కొక్కటీ గాడిన పెడుతూ ముందుకెళుతున్నామన్నది ఆయన ఇచ్చిన సమాధానం. ఉద్యోగులకు సంబంధించిన మెడికల్ క్లయిమ్ బిల్లులను ఇప్పటికే చెల్లించామని ఆయన స్పష్టం చేశారు. ఇక ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఒక ప్రకటన చేస్తూ, 2026-27 ఆర్థిక సంవత్సరం  నాటికి ఉద్యోగుల మొత్తం పెండింగ్ బిల్లులను చెల్లిస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుతం నిధులు అత్యవసరం కావడంతో ప్రభుత్వ భూములను తనఖా పెట్టి రూ.10వేల కోట్లు సమీకరించాలని కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తున్నది. ఇందులో రూ.2వేల కోట్లు ఉద్యోగుల బకాయిల చెల్లింపునకు కేటాయించాలన్నది ప్రభుత్వ సంకల్పం. ఇది ఎప్పటికి జరిగేను..? రిటైర్‌మెంట్ ప్రయోజనాలతో దీర్ఘకాల సమస్యలను పరిష్కరించుకుందా మనుకున్న ఉద్యోగుల పరిస్థితేంటి? వారి ప్రణాళికలన్నీ ఒక్కసారిగా కుప్పకూలిపోవడమే ఇప్పుడు జరుగుతోంది..! ఇది చాలా ఉద్యోగుల కుటుంబాలను ఆర్థిక పరంగా పెద్ద కుదుపునకు గురిచేస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *