శాస్త్రీయ పద్ధతుల్లో ఆ మూడు బ్యారేజీల పునరుద్ధరణ

– కేంద్ర జలవనరుల సంఘం సూచనలను పరిగణనలోకి తీసుకుంటాం

– మేడిగడ్డ, సుందిళ్ళ, అన్నారంలపై మంత్రి ఉత్తమ్‌ సమీక్ష

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 12: కాళేశ్వరం ప్రాజెక్టులోని అంతర్భాగాలైన మేడిగడ్డ, సుందిళ్ళ, అన్నారం బ్యారేజీల పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నామని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖల మంత్రి కెప్టెన్‌ ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి పేర్కొన్నారు. కేంద్ర జలవనరుల సంఘంతో సమన్వయం చేసుకుని శాస్త్రీయ పద్ధతుల్లో పునరుద్ధరించేందుకు సన్నాహాలు జరుపుతున్నామన్నారు. డాక్టర్‌ బి.ఆర్‌.అంబేెడ్కర్‌ సచివాలయంలో నీటిపారుదల శాఖాధికారులతో మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. మేడిగడ్డ కూలిపోవడానికి, సుందిళ్ళ, అన్నారం బ్యారేజ్‌లలో లీకేజీలకు తప్పుడు నిర్ణయాలు, సాంకేతిక లోపాలే ప్రధాన కారణమని నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ, న్యాయ కమిషన్‌లు స్పష్టంగా పేర్కొన్నాయని మంత్రి తెలిపారు. సెంట్రల్‌ డిజైన్‌ ఆర్గనైజేషన్‌పై కూడా ఆరోపణలొచ్చిన నేపథ్యంలో అర్హత కలిగిన స్వతంత్ర సాంకేతిక సంస్థలను నియమించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. కేంద్ర జలవనరుల సంఘం సూచనలను పరిగణనలోకి తీసుకుని కొత్త డిజైన్లను రూపొందించాలని నిపుణులను అదేశించామన్నారు. ప్రతిష్టాత్మక సంస్థలతోపాటు ఐఐటి అనుబంధ కంపెనీలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు వెల్లడిరచారు. పూణేలోని సెంట్రల్‌ వాటర్‌ అండ్‌ పవర్‌ రీసెర్చ్‌ స్టేషన్‌ (సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌) ద్వారా జియో ఫిజికల్‌, హైడ్రాలిక్‌ టెస్టులు నిర్వహించి నష్టం విలువ అంచనా వేసి పనుల పునరుద్ధరణకు అంకురార్పణ చుట్టబోతున్నట్లు తెలిపారు. తాజాగా కురిసిన భారీ వర్షాలతో నీరు చేరుకుందని, 15 నుండి 20 రోజులలో నీరు తగ్గిన వెంటనే పరీక్షలు ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. అందులో భాగంగా మొదట ఐదు సంస్థలను ఎంపిక చేసి వాటిలో డ్యామ్‌ సేఫ్టీ రంగంలో అనుభవం కలిగి ఉండడంతోపాటు సాంకేతిక సంస్థలతో అనుబంధం కలిగి ఉన్న మూడు సంస్థలనే ఫైనల్‌ చేస్తామన్నారు. పునరుద్ధరణ వ్యయం మొత్తం ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఆయా సంస్థలే భరించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. గత అనుభవాల దృష్ట్యా ప్రజా ఆస్తుల పరిరక్షణ నిమిత్తం నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ పునరుద్ధరణ పనులు చేపట్టబోతున్నట్లు ఆయన తెలిపారు. డిజైన్‌ లోపాలు, పనుల నిర్లక్ష్యం, ఆర్థిక అవకతవకలను జాతీయ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ నివేదికలో స్పష్టం చేసిందని గుర్తు చేశారు. ఇదే విషయంలో విచారణ నిర్వహించిన విజిలెన్స్‌ శాఖ సంబంధిత అధికారులతోపాటు కాంట్రాక్టర్లపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని సిఫారసు చేసిందన్నారు. అలాగే సమ్మక్క-సారక్క, సీతమ్మ సాగర్‌, సీతారామ సాగర్‌, చనకా-కొరాట, దేవాదుల, చిన్న కాళేశ్వరం, ఎస్‌ఎల్‌బిసి హెలిబోర్న్‌ సర్వే, డిరడిలతో పాటు జూరాల వద్ద నిర్మించ తలపెట్టిన ప్రత్యమ్యాయ బ్రిడ్జి, సింగూర్‌ కాల్వ లైనింగ్‌ పనులపై కూడా సమీక్షించారు. నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్‌ బొజ్జా, సలహాదారు ఆదిత్యానాధ్‌ దాస్‌, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, సహాయ కార్యదర్శి కె.శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *