సామూహిక అనుభవానికి ప్రతినిధి

‘అంతే అతడు లేచాడు స్మశానానికి వచ్చినప్పుడు లేని మొండి ధైర్యమేదో మనసు నిండా నిండింది. నడుస్తూ వుంటే వీధి లైట్లు, వెలుగు నీడలు. అవును నీడ దాటితే వెలుగు. ఈ హైదరాబాద్ నాకు ఉద్యోగమిస్తుంది, ఈ హైదరాబాద్ నన్ను నిలబెడుతుంది, ఈ హైదరాబాద్ నాకు జీవితాన్నిస్తుంది’ అన్న విశ్వాసం, నమ్మకం రచయిత అక్కినేని కుటుంబరావుదో, ‘పట్టణంలో బతుకుదామని’ వచ్చిన ఏ శ్రీనివాసరావుదో మాత్రమే కాదు. బతుక్కోసం పట్టణానికి వలస వచ్చిన ప్రతి మనిషి ఆశ, కోరిక, నమ్మకం కూడా.  అయితే హైదరాబాద్ పాతపట్టణపు వీధుల్లో సాయంత్రాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఎక్కడో ఒక ఇరానీ చాయ్ వాసన, ఎక్కడో పుస్తకాల దుమ్ము, మధ్యలో నడుచుకుంటూ వెళ్లే ఓ మనిషి. యాభై ఏండ్ల పాటు తనకెప్పుడూ కష్టం కాని కష్టం చేయడం. తన కోసం తన ఇష్టాలకోసం పడిన అనేక  కష్టాల్ని ఏరి కూర్చి రాసిన నవల ఈ  ‘పట్టణంలో బతుకుదామని’. కష్టాల సముద్రంలో ఈదుతూ మునుగుతూ తన జీవితానికి ఒక అర్థాన్ని సాఫల్యాన్నీ సాధించిన యువకుడి కథ ఈ నవల.

నిజానికి నవలల్ని జేబులో పెట్టుకుని సినిమాల్ని కళ్లలో మోసుకుంటూ నగరంలో తిరిగినవాడు అక్కినేని కుటుంబరావు. ఆయన కథలు పెద్దగా అరవవు. నిశ్శబ్దంగా కూర్చుని మన జీవితాల్ని వింటాయి. ప్రతిధ్వనిస్తాయి. ఒక గదిలో ఒక కుర్చీ, ఒక కిటికీ, ఒక సాధారణ మనిషి ఆతని సంఘర్షణ ఇవే ఆయన నవలల్లోని పాత్రలు. బయట ప్రపంచం మారుతుంటే లోపల మనసు ఎలా నిలబడుతుందో చూపించే చిన్నచిన్న దృశ్యాలు. పాతనగరంలో పసివాడుగా ఆయన లిఖించిన అక్షరాలూ రూపొందించిన దృశ్యాలూ మనల్ని వెంటాడుతాయి. అక్కినేని కుటుంబరావు నవల పట్నంలో బతుకుదామని ఆశావాక్యం కాదు, ఒక ఆర్తనాదం. ఈ నవల మనల్ని ప్రశ్నిస్తుంది. ఆలోచనలో పడేస్తుంది. పట్నంలో మనుషులు నిజంగా బతుకుతున్నారా, లేక కేవలం బ్రతికిపోతున్నారా? అంటూ కుటుంబరావు ఈ నవల ద్వారా పట్నం వెలుగుల వెనుక దాగి ఉన్న మానవనీడలను అక్షరాలుగా మలిచారు.

నవల రాస్తూ సినిమా కలగంటూ ఆయన కాలంతో ఒప్పందం చేసుకున్నట్టు “నన్ను తొందర పెట్టొద్దు” అని కాలానికి చెప్పిన మనిషిలా ఇన్నేళ్ళుగా నెమ్మదిగా ముందుకు నడిచాడు, నడుస్తున్నాడు. సినీ దర్శకుడిగా ఆయన కెమెరా ఆకాశం వైపు కాదు. మనిషి భుజాల మీదే నిలుస్తుంది. చెమట, అలసట, మాట్లాడని మౌనబాధ ఇవే ఆయన కెమెరా ఫ్రేముల హీరోలు. అందుకే ఆయన సినిమాలు చూసిన తర్వాత అలా మౌనంగా ఆలోచిస్తూ నడుచుకుంటూ ఇంటికి వెళ్లాలనిపిస్తుంది. అక్కినేని కుటుంబరావు మాత్రం మన వెనుక నడుస్తూ మన కథల్ని మనకే గుర్తుచేసే నిశ్శబ్ద సహ యాత్రికుడు.

తెలుగు సాహిత్యం, సినిమా రెండింటినీ ఒకే సృజనాత్మక ప్రవాహంగా చూసిన కొద్దిమందిలో అక్కినేని కుటుంబరావు ఒకరు. ఆయన కృషిలో నవలా రచనకు ఉన్న లోతు, సినిమాకు అవసరమైన దృశ్యాత్మకత పరస్పరం కలిసిపోయి కనిపిస్తాయి. సాహిత్యాన్ని కేవలం చదవడానికి మాత్రమే కాకుండా, “చూడగలిగే అనుభూతి”గా మలిచిన సృజనకర్తగా ఆయన నిలబడతాడు.

తెలుగు ఆధునిక నవలా సాహిత్యంలో పట్టణ జీవితాన్ని ఎలాంటి హంగూ ఆర్భాటం లేకుండా, నిజాయితీతో చిత్రించిన రచనలలో అక్కినేని కుటుంబరావు పట్నంలో బతుకుదామని ఒక ముఖ్యమైన నవల. ఈ నవల ఆశల రాజధానిగా భావించే పట్టణాన్ని సంఘర్షణల ప్రయోగశాలగా ఆవిష్కరిస్తుంది. గ్రామం నుంచి పట్నానికి వలస వచ్చిన మనిషి జీవన పోరాటమే ఈ నవల. నవల పేరులోనే వేదనాత్మక వ్యంగ్యం దాగి ఉంది. ఇక్కడ బతకడం అంటే కేవలం బతకడమే కాదు అది గౌరవం కోసం, గుర్తింపు కోసం, భద్రత కోసం సాగే పోరాటం. ఈ నవల- కథ పల్లెనుంచి పట్నానికి వచ్చిన మధ్యతరగతి వ్యక్తుల చుట్టూ తిరుగుతుంది. ఉద్యోగాల కోసం, మంచి జీవితం కోసం వచ్చిన వారు పట్నంలో ఎదుర్కొన్న నిరుద్యోగం కిరాయి ఇండ్లల్లో అవమానాలు మనుషుల సంబంధాల్లోని స్వార్థం మానసిక ఒంటరితనం లాంటి అనేక అనుభవాలు ఎదురెదురవుతారు.

పట్నంలో పైకి కనిపించే వెలుగులు మొదట ఆకర్షించినా, నెమ్మదిగా అవి మసకబారుతాయి. పట్నం ఒక పాత్రగా సాగే ఈ నవలలో పాత్రలు హీరోలు కాదు, వారు తప్పులు చేస్తారు, రాజీపడతారు కొన్నిసార్లు నైతికంగా ఓడిపోతారు కానీ ఈ ఓటములే వారిని నిజమైన పాత్రలుగా తీర్చిదిద్దుతాయి. పాత్రల అంతర్ముఖత్వం ఈ నవలకున్న ప్రధాన బలం. సంఘటనల కన్నా, పాత్రల మనసుల్లో జరిగే అలజడులే ఇందులో కథను ముందుకు నడుపుతాయి. పట్నం ఇక్కడ మానవ సంబంధాలను విచ్ఛిన్నం చేసే యంత్రంగా రూపుదిద్దుకుంటుంది. రచయితగా అక్కినేని కుటుంబరావు భాష, శైలి, దృశ్యాత్మక వర్ణన సంభాషణల్లో సహజత్వంతో కూడి నిజాయితీ ప్రధానంగా కనిపిస్తుంది. సినిమాదర్శకుడిగా ఆయనకున్న అనుభవం సన్నివేశాల నిర్మాణంలో స్పష్టంగా ప్రతిఫలిస్తుంది.

ఈ నవల ద్వారా రచయిత పట్టణీకరణ వల్ల ఏర్పడిన మానవ సంక్షోభాన్ని, మధ్యతరగతి అస్థిరతను, వలస జీవన మానసిక ఒత్తిడిని విశ్లేషిస్తాడు. ఇది ఒకరకంగా వ్యక్తిగత కథలా కనిపించినా నిజానికి అది సామూహిక అనుభవానికి ప్రతినిధి. అందుకే అక్కినేని కుటుంబరావు రచనలు చదివితే “సినిమా చూస్తున్న అనుభూతి” కలుగుతుంది. ఆయన సినిమాలు చూస్తే “నవల చదువుతున్న లోతు” అనిపిస్తుంది. తెలుగు సాహిత్యం సినిమా రంగ చరిత్రలో ఆలోచనకు దృశ్యాన్ని, దృశ్యానికి ఆత్మను ఇచ్చిన సృజనకర్తగా అక్కినేని కుటుంబరావు స్థానం ప్రత్యేకమైనది.

వారాల ఆనంద్ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *