33.జనధర్మోవిజయతే
జూన్ 2: నెత్తురోడిన వరంగల్లు రోజు
2014 జూన్ 2 తెలంగాణ అధికారికంగా అవతరించిన రోజు. అర్థశతాబ్దం నుంచి పోరాడిన జనం తెలంగాణను సాధించారు. ఆశ్చర్యం ఏమంటే తెలంగాణ నాడి వరంగల్లు నగరంలో 1969 జూన్ 2న వరంగల్ జిల్లా ప్రజాసమితి పిలుపుననుసరించి వరంగల్ పోస్టాఫీసు ముందు సత్యాగ్రహం జరిగింది.
శ్రీయుతులు వెలగందుల వైకుంఠం. అరుసం కొమురయ్య, నరసింహార్య, భూపతి కృష్ణమూర్తి పార్సి యీశ్వరయ్య, వెలిశాల కనకయ్య, గోపీ కిషన్ లాహోటీ ప్రభుృతులు నాయకత్వం వహించారు. పోస్టాఫీసు వద్ద పోలీసులు వీరిని చెదరగొట్టటానికి లాఠీఛార్జి చేశారు. శ్రీయుతులు వెలగందుల వైకుంఠం, భూపతి కృష్ణమూర్తి, గోపీకిషన్ వగైరాలకు లాఠీలవల్ల గాయాలు తగిలాయి.
ఖండన
అయినా సత్యాగ్రహులను చెదరగొట్టలేకపోయిన పోలీసులు కాల్పులు జరపగా శ్రీ చంద్రమౌళి, షేక్ ఫకీరు చనిపోయారు. మరునాడు వెంకటస్వామి ఆసుపత్రిలో మృతి చెందాడు. క్షతగాత్రులు ఆసుపత్రిలో చేర్చబడ్డారు. ఈ దుర్ఘటనతో ప్రజలు రెచ్చిపోయారు. వీటికి తోడు హైద్రాబాద్ కత్తిపోటు మరణం అగ్నికి ఆజ్యమైపోయింది. ఫలితం దహనకాండ. బట్టల బజారులో చవాన్ లక్ష్మీనారాయణ షాపు మొదలు కొని భూమయ్య బట్టల షాపు వరకు కొన్ని దుకాణాలు భస్మీ పంటలం అయినవి. జయప్రకాశ్ రోడ్లోని విజయ ఎరువుల షాపు బూడిద అయింది. గాంధీ మెడికల్ హాల్ దుకాణం బ్రద్దలైంది. వరంగల్ రేడియో హౌజ్, ఉడిపి ఆర్యభవన్ శ్రీ సీతారామ నూలు అద్దకం కంపెనీ భవనం దహనమైంది.
తెలంగాణా ప్రదేశ్ కాంగ్రెసు కార్యదర్శి శ్రీ టి.హయగ్రీవాచారి, కేంద్ర ప్రజాసమితి ప్రముఖులు ఎస్.బి. గిరి, పి.జనార్దన్ రెడ్డి, జిల్లా ప్రజాసమితి పెద్దలు టి. పురుషోత్తమరావు, వి. రాజేశ్వరరావు, టి. లక్ష్మారెడ్డి, వి. సాంబశివరావు, మొదలగు వారేగాక, వరంగల్ పురపాలక సంఘాధ్యక్షులు పి. ఉమారెడ్డిగారు, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి శ్రీ ఆర్.మృత్యుంజయలింగం గార్లు కాలినడకన ప్రజాసమితి కార్యాలయం వెళ్ళి కాలిపోయిన ఇండ్లను పరిశీలించారు. అంతకు పూర్వం జరిగిన సంఘ సభలను గూర్చి వరంగల్ బట్టలవర్తక సంఘం ఆధ్యక్షులు శ్రీ రాయవరపు రాజేశ్వరరావు గారు శ్రీ హయగ్రీవాచారి గారు పోలీసులకు వివరించారు.
చర్యలను ఖండిస్తూ రాజేశ్వరరావు, డా. టిఎన్.సదాలక్ష్మి గారు పి. రాజేశ్వరరావు, పి. గోవిందరావు, గూడూరు మల్లయ్య, మాచర్ల జగన్నాథం, వుదయరాజు సాంబశివరావు. Ch. సుదర్శన్, పురుషోత్తం మొదలగువారు ప్రకటన చేశారు. మృత వీరులు కుటుంబాల సహాయార్ధం భూరి విరాశాలివ్వాలని వారు విజ్ఞప్తి చేశారు. వరంగల్ కాల్పులపై న్యాయ విచారణ జరిపాలని, అంధ్ర కేంద్ర రిజర్వ్ పోలీసు దళాలు కవ్వింపు చర్యలు సాగిస్తున్నారు. కనక ఉపసంహరించాలనీ శ్రీ హయగ్రీవాచారి గారు ప్రకటించారు. న్యాయ విచారణ జరిగే వరకు “బంద్”ను సాగించుటకై ప్రజాసమితి పిలుపునిచ్చింది. శ్రీ ఆర్. మృత్యుంజయ లింగంగారి అధ్యక్షతన బాధితుల సహాయార్ధం నిధి సేకరణ కమిటీ ఏర్పడింది. 5వ తేదీన సత్యాగ్రహంలో 6గరు ఆరెస్టు చేయబడినారు.
హైదాబాద్ లో ఉద్యమం తీరు
జూన్ 2, 3, 4 తేదీలు శాంతియుత సమరాన్ని ‘బ్లడీవార్’ మార్చేసాయి. రాజధానికి ప్రేతకళను తెచ్చాయి. ఈ మూడు రోజులలో 20 మంది పోలీసుల తుపాకి గుండ్లకు బలైనట్లు అంచనా. వీరిలో దుర్గావిలాస్ వద్ద కత్తిపోటుకు గురైన శ్రీ ప్రేంకిశోర్, అశోక్ అనే 13 ఏళ్ల విద్యార్థి, మేడపై చదువుకుంటున్న 16 ఏళ్ల మరో విద్యార్థి తన పిల్ల వాడిని రక్షించబోయి ”బులెట్”కు ఎర అయిన ఆడ్వొకేటు డి.వెంకటేశ్వరరావు వగైరా ఉన్నారు. ఈ మూడు రోజులలో కనీసం 22 చోట్ల పోలీసులు అనేక రౌండ్లు కాల్పులు జరిపారు. సుమారు వంద మంది కాల్పులలో గాయపడ్డారు.
జనధర్మ పత్రిక తెలంగాణా ఉద్యమం- ప్రారంభం- విస్తృతి వ్యాసంలో సంగ్రహ సమీక్ష చేసారు. 1969 జనవరి 24 తేదీన ప్రారంభమైన ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం స్వల్పకాలంలోనే దినదినాభివృద్ధి చెందింది. రాజధానీ జంట నగరాలు మొదలుకొని జిల్లా తాలూకా కేంద్ర పట్టణాల్లోనూ, పంచాయితీ సమితి కేంద్ర గ్రామాల్లోనూ, ‘పెద్ద గ్రామాల్లోనూ కూడా ఈ ఉద్యమం తీవ్రం గానూ, సువ్యాప్తంగాను సాగటానికి విద్యార్థుల పాత్ర ప్రముఖమైందనేది నిర్వివాదం. 1956లో ఆంధ్రప్రదేశ్ అవతరణకు కారణభూతమైన ఒప్పందాన్ని, ఆ ఒప్పందం ఆధారంగా ఇవ్వబడిన హామీలు, చట్టబద్ధమైన రక్షణలూ అమలుపరచకపోవటం ప్రాంత అభివృద్ధి విషయంలో ప్రదర్శించబడిన నిర్లక్ష్యమూ ప్రజలలో ఎంతోకాలంగా కుతకుత లాడుకున్న వేదన ఒక్కుమ్మడిగా వెల్లువలై ప్రవహించటానికి, కొద్ది కాలంలో యావద్భారత దృష్టిని ఆకర్షించటానికీ, ఏదో ఒక చర్య తీసుకొనటం ద్వారా ప్రజలను సంతృప్తిపరిచ వలసిన అవసరం ఉన్నదన్న వాస్తవాన్ని కేంద్రప్రభుత్వం, ముఖ్యంగా భారత ప్రధాని శ్రీమతి గాంధీ వంటి వారు గుర్తించటానికీ విద్యార్థుల యువశక్తే మూలకారణమైందన్నా సత్యదూరం కాదు.
మార్చి 1969తో గడుపు అంతమయ్యే ముల్కీ నిబంధనలు మరో అయిదేళ్లు పొడిగించాలని ఉద్యోగి వర్గమూ, విద్యార్థులూ కోరటంతో ప్రారంభం అయిని ఈ ఉద్యమం 1968 అక్టోబర్ ప్రాంతంలో “తెలంగాణా రక్షణలు” సక్రమంగా అమలు అయ్యేందుకు ప్రభుత్వంపై వత్తిడితేవటం ఆశయంగా ‘హక్కుల’ రక్షణల ఆందోళనకై వరంగల్ జిల్లా వర్దన్నపేట శాసనసభ్యుడు శ్రీ తక్కిళ్లపల్లి పురుషోత్తమరావు గారి నాయకత్వాన ప్రజా ఉద్యమానికి నాందీ ప్రస్తావన జరిగింది.
శ్రీ రవీంద్రనాధ్ అనే విద్యార్థి జనవరి 8వ తేదీన ఖమ్మంలో ఆమరణ నిరశనదీక్ష ప్రారంభించారు. శ్రీ రవీంద్రనాథ్ ప్రాయోపవేశానికి సానుభూతిగా మరి కొందరిచే 24 గంటల, 48 గంటల ఉపవాస దీక్షలు తెలంగాణా పట్టణాల్లో హర్తాళులు జరిగాయి. వరంగల్లో 9-1- 69న పరిపూర్ణ హర్తాళ్ జరిగింది. శ్రీ పురుషోత్తంరావుగారి అధ్యక్షతన జరిగిన బ్రహ్మాండమైన బహిరంగ సభలో ఇతర తీర్మానాలు అనేకంతోపాటు, తెలంగాణా అభివృద్ధికి రూపొందించిన పధకాలను, వాటి అమలుకు తెలంగాణా నిధులను వినియోగ పరచుకోవటానికి ముఖ్యమంత్రి, ప్రభుత్వం ప్రమేయం అధికారంతో నిమిత్తం లేకుండా- స్వేచ్ఛ అధికారములను తెలంగాణా ప్రాంతీయ సంఘానికి కావాలని తీర్మానించారు. ఇవే సమయంలో ఖమ్మం జిల్లా కొత్తగూడెం ధర్మల్ స్టేషన్ లోని తెలంగాణా ఉద్యోగుల సంఘం తరపున జనవరి 10న ఆమరణ నిరశన దీక్షను యూనియన్ కార్యదరి గారు ప్రారంభించారు.
జనవరి 11న ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం ప్రతినిధి వర్గాన్ని చర్చలకు పంపి, ఆ తర్వాత ఉద్యమ రంగంలో ప్రవేసించటమేగాక జనవరి 15 తేదీ నుండి అంచలవారీ నిరశన దీక్షలకు -ఊరేగింపు, సత్యాగ్రహాలకు పిలుపునిచ్చింది. ఈ సమయంలోనే ఉస్మానియా విద్యార్థి సంఘం. అధ్యక్షుడు శ్రీ వెంకట్రాంరెడ్డి నాయకత్వాన హక్కుల రక్షణవాదులుగా, ఉస్మానియా విద్యార్థి సంఘ ప్రధాన కారదర్శి శ్రీ మల్లికార్జున్ నాయకత్వాన్ని ప్రత్యేక రాష్ట్ర వాదులుగా చీలిపోయి ఘర్షణ పడ్డారు.





