– తనయుడి వివాహ వేదికపై ఆశీనులైన ఆదివాసీ మహిళలు
– నాటి మిత్రులకు కృతజ్ఞత చూపిన డిప్యూటీ సీఎం భట్టి
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 5 : ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తనయుడు సూర్య విక్రమాదిత్య – సాక్షిల వివాహ వేడుకలో ఒక అపురూప ఘట్టం చోటుచేసుకుంది. రాజకీయ ప్రముఖులు, సెలబ్రిటీల మధ్య నాడు భట్టి విక్రమార్కతో కలిసి అడుగులేసిన సామాన్య ఆదివాసీ మహిళలు ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. గత ఎన్నికలకు ముందు సీఎల్పీ నేతగా భట్టి విక్రమార్క ఆదిలాబాద్ జిల్లా బోథ్ నుంచి ఖమ్మం వరకు నిర్వహించిన పాదయాత్రలో వీరంతా భాగస్వాములయ్యారు. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జైనూర్ మండలం బూసిమెట్టకు చెందిన వాలే లక్ష్మీబాయి, డాకూర్ రుక్మబాయి, దుర్గ సిందు, ఉట్నూరు మండలం దేవగూడకు చెందిన మరప గంగుబాయి, సుమన్‌బాయి, సీడం లక్ష్మీబాయిలు పాదయాత్ర ఆద్యంతం ఉత్సాహంగా పాల్గొనడమే కాక ఎండ తీవ్రతకు భట్టి అలసిపోకుండా, ఆయన ఆరోగ్యం దెబ్బతినకుండా తమ సంప్రదాయ ఆదివాసీ పానీయాలను అందించి ఆత్మీయతను చాటుకున్నారు.
మరువని కృతజ్ఞత 

పదవులు వచ్చినా పాత మిత్రులను మరువని భట్టి విక్రమార్క తన కుమారుడి వివాహానికి వారిని ప్రత్యేకంగా ఆహ్వానించారు. వివాహ వేడుకకు హాజరైన ఆ ఆదివాసీ మహిళలను భట్టి దంపతులు ఆప్యాయంగా పలకరించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. కేవలం అతిథులుగా మాత్రమే కాక వారికి వివాహ వేదికపైనే ప్రత్యేక స్థానం కల్పించడం అందరినీ ఆకట్టుకుంది. రాజకీయాల్లో మానవ సంబంధాలకు, కృతజ్ఞతకు ఈ ఘటన నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



