– ప్రధాని విజన్‌కు అనుగుణంగా ముందుకు సాగాలి
– వచ్చే రెండేళ్లలో శాస్త్రీయంగా అత్యధిక గనులు మూసేయాలి
– అధికార్లు, కలెక్టర్లతో సమన్వయంతో పనిచేయాలి
-పర్యావరణ రక్షణకు పెద్దపీట వేయాలి
– లాభాల మైన్‌లపై దృష్టి సారించాలి
– భద్రతపై రాజీవద్దు
– చింతన్ శిబిర్ చర్చలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 6: దేశ అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం బొగ్గు రంగంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో తీసుకువచ్చిన సంస్కరణలు క్షేత్ర స్థాయిలో అమలు కావాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. మానేసర్‌లో రెండురోజులపాటు జరిగిన చింతన్ శిబిర్ చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. బొగ్గు రంగం పనితీరు, తీసుకొస్తున్న సంస్కరణలు, సంస్థాగతంగా తీసుకురావల్సిన మార్పులు వంటి వాటిపై సుదీర్ఘ చర్చ జరిగింది. ప్రధాని విజన్‌కు అనుగుణంగా అందరం ముందుకు సాగాలన్నారు. అప్పుడే వికసిత భారత్ లక్ష్యాలను మనం చేరుకునే అవకాశం ఉంటుంది. మరిన్ని సంస్కరణలు తీసుకువచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నాం. సబ్సిడరీలు ఆయా సంస్థలను బలోపేతం చేసేందుకు యాక్షన్ ప్లాన్‌తో ముందుకు రావాలి. కోల్ గ్యాసిఫికేషన్ విషయంలో ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగాలన్నారు. వచ్చే రెండేళ్లలో భారీ సంఖ్యలో శాస్త్రీయంగా గనులను మూసివేయాలి. ఇందుకోసం సంబంధిత అధికారులు, కలెక్టర్లతో కలిసి సమన్వయంతో పనిచేయాలి. వచ్చే రెండేళ్లలో భారీ సంఖ్యలో గనులను మూసివేసి గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కేందుకు కృషి చేయాలి. మన బొగ్గు రంగం సమాజానికి అందిస్తున్న సేవల గురించి ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు.
పర్యావరణ పరిరక్షణకు పెద్ద పీట వేయాలి
కంపెనీల ఎదుగుదల, కార్మికుల సంక్షేమంతోపాటు పర్యావరణ పరిరక్షణకు పెద్ద పీట వేయాలన్నారు. ప్రతి సబ్సిడరీ వద్ద ప్రతి మైన్‌కు సంబంధించిన యాక్షన్ ప్లాన్ ఉండాలి. హోల్ ఆఫ్ గవర్నమెంట్ అప్రోచ్ తో ఎలా పనిచేయాలో ఆలోచించాలి. దీనిపై సబ్సిడరీలు సరైన సూచనలు చేయాలి. 2026 చివరి వరకు ఏం చేయాలనే దానిపై సునిశిత విమర్శ చేసుకోవాలి. సరైన యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకోవాలి. నష్టాలు చవిచూస్తున్న మైన్స్‌పై దృష్టి తగ్గించి ఎక్కువ ఉత్పత్తి, ఎక్కువ లాభం జరిగే వాటిపై దృష్టి సారించాలని సూచించారు. రెవెన్యూ షేరింగ్‌పై ప్రైవేట్ కంపెనీలతో మాట్లాడాలి. మైనింగ్ యాక్టివిటీ ప్రారంభమయ్యేందుకు పడుతున్న 7 ఏళ్ల సమయాన్ని ఎలా తగ్గించాలనే దానిపై ఆలోచన చేయాలి. సబ్సిడరీ వారీగా మేధోమథనం జరగాలన్నారు. గనుల తవ్వకంలో పరికరాల వినియోగాన్ని పెంచేందుకు మెరుగైన ప్రణాళిక, పర్యవేక్షణ ద్వారా ఆపరేషనల్ లోపాలను తగ్గించేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి. భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడొద్దు. కఠినమైన భద్రతా ప్రమాణాలు, పర్యవేక్షణ బాధ్యతలను బలోపేతం చేయాలి. ‘జీరో యాక్సిడెంట్స్’ లక్ష్యంగా పనిచేయాలి. పర్యావరణ పరిరక్షణకు కూడా కృషి చేయాలన్నారు. దేశీయ ఉత్పత్తి పెరుగుదల, మెరుగైన లాజిస్టిక్స్ కారణంగా బొగ్గు దిగుమతులు గణనీయంగా తగ్గాయి. దీంతో రూ.60 వేల కోట్ల మేర విదేశీ మారక ద్రవ్యాన్ని పొదుపు చేయగలిగాం. ఈ సందర్భంగా రాంచీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కోల్ మేనేజ్‌మెంట్ లో నూతనంగా నిర్మించిన ఎగ్జిక్యూటివ్ హాస్టల్‌ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమానికి బొగ్గు గనుల శాఖ సహాయ మంత్రి సతీష్ చంద్ర దూబే, బొగ్గు శాఖ కార్యదర్శి విక్రమ్ దేవ్ దత్, అదనపు కార్యదర్శి రూపిందర్ బ్రార్, అదనపు కార్యదర్శి సనోజ్ కుమార్ ఝా, కోలిండియా లిమిటెడ్ చైర్మన్, కోలిండియా సబ్సిడరీల సీఎండీలు, బొగ్గు శాఖ అధికారులు హాజరయ్యారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





