– పాక్ ప్రేలాపనలపై ఆర్మీ చీఫ్ జనరల్ ద్వివేది
భోపాల్,నవంబర్1: అఫ్ఘానిస్థాన్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్‌పై నోరు పారేసుకుంటున్న పాక్‌కు భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది మరోమారు గట్టి వార్నింగ్ ఇచ్చారు. పాక్ మళ్లీ ఏదైనా మూర్ఖపు చర్యకు దిగితే ఆపరేషన్ సిందూర్ రెండో రౌండ్‌కు తాము రెడీగా ఉన్నామని అన్నారు. ఆపరేషన్ సింధూర్ 2.0కు భారత సాయుధ దళాలు సిద్ధంగా ఉన్నాయి. త్రివిధ దళాధిపతులు సాయుధ దళాలను ముందుండి నడిపిస్తే మమల్ని ఎవరూ ఎదుర్కోలేరని ఆయన అన్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం రేవా జిల్లాలోని సైనిక్ స్కూల్‌ను సందర్శించిన సందర్భంగా ఆయన ఈ హెచ్చరిక చేశారు. ఆపరేషన్ సిందూర్ ముగింపు ఎప్పుడో భారత్ తప్ప ఇతరులెవరూ నిర్ణయించలేరని కూడా తేల్చి చెప్పారు. పాక్ తగిన గుణపాఠం నేర్చుకుందని తాము భావించినప్పుడే ఆపరేషన్ సిందూర్ ముగుస్తుందని అన్నారు.సైన్యానికి నేతృత్వం వహిస్తున్న లెప్టెనెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేదీ, నావికాదళాధిపతి అడ్మిరల్ దినేశ్ త్రిపాఠీ ఇద్దరూ 1970ల్లో కలిసి చదువుకున్నారు. అప్పట్లో రేవా సైనిక్ స్కూల్లో క్లాస్ 5ఏ తరగతిలో క్లాస్ మేట్స్‌గా ఉన్నారు. ఆ తరువాత ఇద్దరు అంచెలంచెలుగా ఎదుగుతూ సాయుధ దళాల అధిపతులయ్యారు. భారత్‌తో యుద్ధం జరిగే అవకాశం ఉందని ఇటీవల పాక్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈసారి యుద్ధంలో తాము గతంలో కంటే మెరుగైన ఫలితాలు సాధిస్తామని కూడా అన్నారు. ఈ నేపథ్యంలో భారత ఆర్మీ ఛీప్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన దాడికి ప్రతీకారంలో భారత్ మే 6,7 తేదీల్లో ఆపరేషన్ సిందూర్ పేరిట దాడులు చేసి పాక్ పాలక వర్గానికి, అక్కడి ఉగ్రమూకలకు వెన్నులో వణుకు పుట్టించింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





