ప్లేస్, డేట్, టైం డిసైడ్ చేసి చెప్పాలి
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 5: తెలంగాణలో ఏ పంటను అడిగినా, ఏ పైరును అడిగినా.. ఏ రైతును అడిగినా.. ఏ రైతు పక్కనున్న ఎద్దును అడిగినా వ్యవసాయాన్ని పండుగలా మార్చింది కేసీఆర్ అనే చెప్తారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.తారకరామారావు అన్నారు. బీఆర్‌ఎస్ తెచ్చిన రైతు రాజ్యం మీద, కాంగ్రెస్ తెచ్చిన రాబందుల రాజ్యం మీద చర్చించడానికి తాను సిద్ధమన్నారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్ రైతుల పేరుతో రొటీన్‌గా రంకెలు వేసిన రేవంత్ రెడ్డి ముచ్చట తీర్చడానికి ఆయన ఛాలెంజ్‌ను స్వీకరిస్తున్నానన్నారు. అయితే బేసిన్లు, బెండకాయలని పరువు తీసుకోకుండా ఉండడానికి బేసిక్ నాలెడ్జ్ లేని రేవంత్ రెడ్డికి 72 గంటల ప్రిపరేషన్ టైం ఇస్తున్నానని, ప్లేస్, టైం, డేట్ డిసైడ్ చేసి చెప్పాలని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రజాపాలన నడవడం లేదన్న కేటీఆర్.. చంద్రబాబు కోవర్డు రేవంత్ రెడ్డి పాలనే నడుస్తున్నదన్నారు. గురువు కోసం ఏపీకి తెలంగాణ నీళ్లను పారిస్తున్న రేవంత్‌రెడ్డి ముమ్మాటికీ కోవర్డే అని విమర్శించారు. ‘రైతులకు ఎవరు మంచి చేశారన్న దానిలో చర్చించడానికి, ఛాలెంజ్‌లు చేసుకోవడానికి కొత్తగా ఏంలేదు.. ముఖ్యమంత్రి ముచ్చట పడి రొటీన్‌గా రంకెలు వేశారు.. ఆయన ముచ్చట తీర్చడానికి నేను సిద్ధం. ఆయన స్థాయికి కేసీఆర్ అవసరం లేదు.. నేను సరిపోతాను.. ఎప్పుడంటే అప్పుడు చర్చకు రెడీ.. కానీ రేవంత్ రెడ్డికి మాత్రం ప్రిపేర్ కావడానికి టైం కావాలి.. గతంలో కూడా ప్రిపేరై రాక కాంగ్రెస్ నేతలు పరువు తీసుకున్నారు.. అందుకే 72 గంటలు టైం ఇస్తున్న‘ అని కేటీఆర్ అన్నారు. 8 తారీకు ఉదయం 11 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వచ్చినా సరే. మీడియా ముందే చర్చిద్దాం.. నీళ్లకు నీళ్లు పాలకు పాలు చేసేద్దాం అన్నారు. ముఖ్యమంత్రి సొంతూరు కొండారెడ్డిపల్లి కానీ.. ఆయన నియోజకవర్గం కొడంగల్‌లో కానీ చర్చ పెడతారంటే నేను రెడీ. లేదంటే మా నాయకుడు కేసీఆర్ సొంత ఊరు చింతమడక లేదంటే ఆయన నియోజకవర్గం గజ్వేల్‌కి వస్తానన్నా సరి అని అన్నారు. నీరు పల్లం ఎరుగు నిజం దేవుడు ఎరుగు అన్నట్టు రైతులకు ఎవరు ఏమి చేశారో యావత్ తెలంగాణకు తెలుసునని కేటీఆర్ అన్నారు. తెలంగాణలో రైతు రాజ్యం ఎవరు తీసుకొచ్చారో? ధాన్యం ఉత్పత్తిలో పంజాబ్, హర్యానాను తలదన్ని భారతదేశంలోనే నంబర్ వన్‌గా తెలంగాణను ఎవరు చేసిండ్రో తెలంగాణ ప్రజలకు తెలుసునన్నారు. సమైక్య పాలనలో దశాబ్దాలపాటు దగాపడ్డ తెలంగాణలో సాగునీరు, వ్యవసాయ రంగంలో కెసిఆర్ నాయకత్వంలో ఎలాంటి విప్లవం సృష్టించామో ప్రజలందరికీ తెలుసని చెప్పారు. రేవంత్ తెలంగాణ ప్రయోజనాల కోసం కాక ఆంధ్ర ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నారని, బనకచర్ల పేరుతో ఆంధ్రకు నీళ్లు పంపుతున్నారు.. నిధులను ఢల్లీికి పంపుతున్నారు.. ఆయన తొత్తులు కొంతమందికి నియామకాలు ఇస్తున్నారు.. స్వతంత్ర భారత చరిత్రలో ఏ ప్రభుత్వం కూడా రైతుల విషయంలో కెసిఆర్ తీసుకున్నట్టు సాహసోపేత చర్యలు తీసుకోలేదు. ఇది అక్షర సత్యం అని కేటీఆర్ చెప్పారు.





