- బేషరతుగా కాల్పుల విరమణ ప్రకటించాలి
- సాయుధ బలగాలను వెనక్కి రప్పించాలి
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరిన మావోయిస్టు పార్టీ
- లేఖ విడుదల చేసిన భారత మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటి అధికార ప్రతినిధి అభయ్
భద్రాచలం,ప్రజాతంత్ర,ఏప్రిల్ 02 : మావోయిస్టు పార్టీపై జరుగుతున్న కాల్పుల్లో అనేక మంది మృత్యువాత పడుతున్నారని అందుకు కారణంగా తాము శాంతి చర్చలకు సిద్దంగా ఉన్నామని , కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి తమతో చర్చలు జరపాలంటూ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటి అధికార ప్రతినిధి అభయ్ లేఖ విడుదల చేసారు. బేషరతుగా కాల్పుల విరమణ ప్రకటించి శాంతి చర్చలు జరుపాలని కోరారు. మార్చి 24వ తేదీన హైద్రాబాద్‌లో శాంతి చర్చల కమిటి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించిందని శాంతి చర్చల కమిటి ఏర్పాటును తాము స్వాగతిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. ఈ సందర్బంగా శాంతి చర్చల పట్ల తమ వైఖరిని తెలియచేసినట్లు లేఖలో పేర్కొన్నారు. 2024 జనవరిలో బ్రాహ్మణీయ హిందుత్వ బిజెపి కేంద్ర ప్రభుత్వం విప్లవోద్యమ ప్రబావిత రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కగార్ పేరుతో విప్లవోద్యమ ప్రభావిత రాష్ట్రాల ప్రజలపై ప్రతిఘాతక యుద్దాన్ని చేసారని లేఖలో పేర్కొన్నారు.

ప్రజల్ని మోసగించడాన్ని ఛత్తీస్‌గడ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, హోంమంత్రి విజయ్‌శర్మ, తమ ప్రభుత్వం మావోయిస్టులు చర్చ జరుపడానికి సిద్దమే , మావోయిస్టులు చర్చలకు రావాలని అని పదేపదే ప్రకటన చేసారని ఈ సందర్బంగా మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోన్ కమిటి మీడియా ప్రతినిధి వికల్ప్ కు రెండు సార్లు శాంతి చర్చలకు సిద్దమే అని తెలియచేయటం జరిగిందని లేఖలో పేర్కొన్నారు. శాంతి చర్చల కోసం సానుకూల వాతావరణాన్ని ఏర్పాటు చేయటం కోసం కగార్ పేరుతో ఆదివాసీ ప్రజానీకంపై కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న హత్యకాండలు నిలిపివేయాలని బస్తర్ ప్రాంతంలో మోహరించిన కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వ సాయుధ బలగాలను బ్యారక్ లకే పరిమితం చేయాలని లేఖలో తెలిపారు. సాయుధ బలగాల కొత్త క్యాంపు ఏర్పాటును నిలిపి వేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రతిపాదన చేసినట్లు లేఖలో పేర్కొన్నారు.
ఈ యుద్దంలో దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు 400 పైగా మావోయిస్టు నాయకులు, కార్యకర్తలను ప్రజా విముక్తి గెరిల్లాసైన్యానికి చెందిన వివిధ స్థాయిల కమాండర్‌లను ,సభ్యులను, సాధారణ ఆదివాసీ ప్రజానీకాన్ని హత్య చేసారని పేర్కొన్నారు. ఇందులో 1/3 సంఖ్యలో సాధారణ ఆదివాసీ ప్రజలు హత్య చేయబడ్డారని తెలిపారు. ఈ పరిస్థితిలో ప్రజల ప్రయోజనాల కోసం మేము ఎప్పుడైన శాంతి చర్చలకు సిద్దంగానే ఉన్నామని లేఖలో తెలిపారు. అందుకే శాంతి చర్చల కోసం సానుకూల వాతావరణాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ముందు ప్రతిపాదన చేస్తున్నట్లు తెలిపారు. మేము చేస్తున్న ఈ ప్రతిపాదన ఆధారంగా శాంతి చర్చల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాలని శాంతి చర్చల కమిటీకి దేశంలోని ప్రజా పక్ష మేధావులకు రచయితలకు ప్రింట్ Ê ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు , హక్కుల సంఘాలకు, ఆదివాసీ దళిత సంఘాలకు అందరికి విజ్ఞప్తి చేసినట్లు లేఖలో పేర్కొన్నారు.





