– రెపోరేటును ఏకంగా 50 బేసిస్ పాయింట్ల మేర తగ్గింపు
– గృహ,వాహన రుణాలపై తగ్గనున్న వడ్డీలు
– ఈఎంఐలు చెల్లించేవారికి ఊరట
ఆర్బీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. వరుసగా మూడోసారి వడ్డీరేట్లను తగ్గించింది. రెపోరేటును ఏకంగా 50 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. దీనివల్ల రెపో రేటు 6 శాతం నుంచి 5.50 శాతానికి దిగొచ్చింది. ఆర్బీఐ తీసుకున్న నిర్ణయంతో గృహ రుణాల వడ్డీరేట్లు 7.5 శాతం తగ్గనున్నాయి. అలాగే బ్యాంకు ఈఎంఐలు తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.దేశ ఆర్థిక వృద్ధిని పెంపొందించడం, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 3.16 శాతంగా ఉంది. ఎస్‌బీఐ నివేదిక ప్రకారం 2025-26 ఆర్థిక సంవత్సరంలో రెపోరేటు మరో 75 బేసిస్ పాయింట్ల తగ్గింపు జరిగే అవకాశం ఉంటుంది. దీంతో రెపో రేటు 5.0నుంచి 5.25కు చేరుకోవచ్చు. దీనివల్ల బ్యాంకులు కూడా రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించడానికి వీలుంటుంది. వడ్డీ రేట్లను తగ్గించడం ఈ ఏడాదిలో వరుసగా ఇది మూడోసారి అని చెప్పాలి. ఫిబ్రవరి, ఏప్రిల్‌లో 25 బేసిస్ పాయింట్ల చొప్పున తగ్గించారు. తాజాగా మళ్లీ వడ్డీ రేట్లు తగ్గించడం ద్వారా వివిధ రకాల ప్రయోజనాలు కలగనున్నాయి. గృహ, వాహన, వ్యక్తిగత రుణాలపై వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి రుణాలు తీసుకున్న వారందరికీ ఇది శుభవార్త అనే చెప్పాలి.
నెలవారీ చెల్లింపుల వాయిదా భారం మోస్తున్న గృహ వినియోగదారులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరోసారి శుభవార్త చెప్పిందనే అనుకోవాలి. కీలక వడ్డీరేట్లను ఏకంగా 50 బేసిస్ పాయింట్లు- తగ్గించి మరింత ఊరట కల్పించింది. తాజా నిర్ణయంతో గృహ రుణగ్రహీతలపై ఈఎంఐ భారం మరింత తగ్గనుంది.ప్లోటింగ్ రేట్‌పై గృహ రుణాన్ని తీసుకున్న వారికి సవరించిన వడ్డీరేటు ఆధారంగా ఊరట లభించనుంది. 2019 అక్టోబర్ 1 తర్వాత జారీ చేసిన గృహ రుణాలన్నీ ప్లోటింగ్ రేటుతో జారీ అయినవే. కాబట్టి వారికి బ్యాంకులు ఆ మేరకు వడ్డీ రేట్లను సవరిస్తాయి. పాత వినియోగదారులకే కాదు.. కొత్తగా రుణాలు తీసుకునేవారు తక్కువ వడ్డీకే రుణాలు పొందొచ్చు. పైగా ఎక్కువ మొత్తం రుణం పొందేందుకు అవకాశం ఉంటుందని బ్యాంకింగ్ నిపుణులు చెబుతున్నారు. ఆర్‌బీఐ రెపో రేటు తగ్గించిన నేపథ్యంలో రుణగ్రహీతల ముందు ఇప్పుడు రెండు ఆప్షన్లు ఉండబోతున్నాయి. ఒకటి ఈఎంఐ తగ్గించుకోవడం. రెండోది కాలవ్యవధి తగ్గించుకోవడం. దీంట్లో రెండో ఆప్షన్ ఎంచుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల దీర్ఘకాలంలో ఎక్కువ మొత్తంలో వడ్డీని ఆదా చేసుకోవచ్చని పేర్కొంటున్నారు.
ఉదాహరణకు ఈ ఏడాది జనవరిలో 20 ఏళ్ల కాలవ్యవధికి రూ.50 లక్షల రుణం తీసుకున్నారనుకుందాం. అప్పట్లో బ్యాంకు వడ్డీ రేటు 8.50శాతం ఉంటే.. నెలకు రూ.43,391 చెల్లించాల్సి వచ్చేది. ఇప్పుడు ఆర్‌బీఐ మూడు దఫాల్లో వడ్డీ రేట్లను సవరించడంతో ఈఎంఐ మొత్తం రూ. 40,280కి తగ్గనుంది. అంటే నెలకు దాదాపు రూ.3వేల పైనే ఆదా అవుతుంది. దీర్ఘకాలంలో మొత్తంగా దాదాపు రూ.7.12లక్షల మేర వడ్డీ భారం తగ్గుతుంది. ఒకవేళ ఈఎంఐని స్థిరంగా ఉంచుకొని కాలవ్యవధిని మార్చుకుంటే గనుక.. రుణ చెల్లింపు గడువు దాదాపు మూడు సంవత్సరాల వరకు తగ్గుతుంది. ఈ ఏడాది జనవరిలో 240 నెలల కాల వ్యవధికి రూ.50 లక్షల రుణం తీసుకున్నారనుకుంటే.. ఆర్‌బీఐ ఊరటతో ఈ కాలవ్యవధి 206 నెలలకు తగ్గుతుంది. అంటే వడ్డీ భారం దాదాపు రూ.14.78 లక్షల మేర ఆదా అవుతుంది. ఆర్‌బీఐ తీసుకున్న నిర్ణయంతో బ్యాంకులు ఎంత వేగంగా వినియోగదారులకు ఆ ప్రయోజనాన్ని బదిలీ చేస్తారనే దానిపై ఈ ఊరట ఆధారపడి ఉంటు-ంది. ఎక్స్‌టర్నల్ బెంచ్ మార్క్ లెండింగ్ రేటుపై తీసుకున్న రుణాలను బ్యాంకులు వెంటనే సవరించాల్సి ఉంటు-ంది. మూడు నెలలకోసారి సమీక్షించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఆర్‌బీఐ నిబంధనలు చెబుతున్నాయి.



