గొప్ప సాయుధ రైతాంగ పోరాట యోధుడు రావి

– భూస్వామిగా పుట్టి 500 ఎక‌రాలు దానమిచ్చిన మ‌హా నేత‌
– అర‌వ‌య్యేళ్ల వ‌య‌సులో రాజ‌కీయాల‌నుంచి త‌ప్పుకున్న నాయ‌కుడు
– ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 2: అరాచక శక్తులకు వ్యతిరేకంగా సాయుధ రైతాంగ పోరాటంలో కీలక పాత్ర పోషించిన మహనీయుడు రావి నారాయణరెడ్డి అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు.రావి నారాయణరెడ్డి జాతీయ పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమంలో సోమ‌వారం ఆయ‌న ప్ర‌సంగించారు. భూస్వామ్య కుటుంబంలో పుట్టినా పేదల కోసం తన 500 ఎకరాల భూమిని దానం చేసిన గొప్ప వ్యక్తి అంటూ ప్ర‌శంసించారు. రాచరిక పాలనకు వ్యతిరేకంగా పోరాడి వెట్టిచాకిరీ విముక్తికి పోరాడి, బండి యాదగిరి లాంటి నిరక్షరాస్యులను ప్రభావితం చేసిన గొప్ప వ్యక్తి ఆయన అన్నారు. దేశంలో మొట్ట మొదటి ప్రధాని నెహ్రూ కంటే ఎక్కువ మెజారిటీతో పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారని గుర్తుచేశారు. ప్రజా తీర్పును ప్రతిబింబించేలా ఆనాడు మొట్టమొదటి పార్లమెంట్ భవనాన్ని రావి నారాయణరెడ్డితో నెహ్రూ ప్రారంభింపజేశారన్నారు. అరవై ఏళ్ల వయసులో ప్రజలకు స్ఫూర్తినిస్తూ పార్టీ, రాజకీయ పదవుల నుంచి తప్పుకున్న గొప్ప నేత రావి నారాయణరెడ్డి అన్నారు. ఈ కాలంలో ప్రజలు ఓడించినా కొందరు పదవులు వదులుకోవడానికి సిద్ధంగా ఉండటం లేదు. రావి నారాయణరెడ్డి పురస్కారం జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డికి దక్కడం గౌరవప్రదమ‌న్నారు.

తొలి తరంలో బూర్గుల, రావి నారాయణ రెడ్డి స్ఫూర్తినిస్తే మలి తరంలో జైపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి లాంటి వాళ్లు తెలంగాణ సమాజానికి ఒక స్ఫూర్తినిచ్చార‌న్నారు. 2019 లో నిబద్ధత కలిగిన, ప్రశ్నించగలిగిన మీరు రాజకీయాల్లో ఉండాలని జైపాల్ రెడ్డిని కోరాన‌న్నారు. కానీ తరం మారింది.. ప్రత్యక్ష రాజకీయాలకు తాను దూరం అని, మీలాంటి యువతరం రాజకీయాల్లో ఉండాలని ఆయన ప్రోత్సహించారన్నారు. సమాజంలో వస్తున్న మార్పును, ప్రజల ఆలోచనని గౌరవించిన గొప్ప నాయకులు జైపాల్ రెడ్డి, రావి నారాయణరెడ్డి అన్నారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి నిబద్ధత మోదీని బభ‌య‌పెడుతోంద‌ని, ఆయనను రాహుల్ గాంధీ ఉప రాష్ట్రపతిగా బరిలో దించారని చెప్పారు. ప్రజలకు ప్రజాస్వామ్య స్ఫూర్తిని అందించాలనే ఏక పార్టీ, ఏక వ్యక్తి పాలనకు వ్యతిరేకంగా సుదర్శన్ రెడ్డి ఎన్నికల బరిలో దిగారన్నారు. అలాంటి వ్యక్తికి రావి నారాయణరెడ్డి పురస్కారం అందించడం సముచితమ‌న్నారు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్న నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. కమ్యూనిస్టు సోదరులు నినాదాలు ఇచ్చారు.. పోరాటాలు చేశారు.. వాటికి చట్టబద్ధత కల్పించింది కాంగ్రెస్. దున్నే వాడికే భూమి అని పోరాడితే పేదలకు భూములు పంచింది కాంగ్రెస్ అని చెప్పారు. నాణేనికి ఒకవైపు కాంగ్రెస్, మరోవైపు కమ్యూనిస్టులు ఉండాలి. వన్ నేషన్.. వన్ పార్టీ అని మోదీ లక్ష్యంగా పెట్టుకున్నారని, రాజ్యాంగం ప్రసాదించిన ఓటు హక్కును కాలరాయాలని బీజేపీ ‘స‌ర్‌’ను తీసుకు వచ్చింద‌ని ఆరోపించారు. ఓటు హక్కును కాలరాయాలన్న కుట్రపై కమ్యూనిస్టులు గ్రామాల్లో చైతన్యం తీసుకురావాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగంపై దాడి జరుగుతోంది.. దీనిపై మనమంతా ప్రజల్లో చైతన్యం కలిగించాలి అని విజ్ఞ‌ప్తి చేశారు. రావి నారాయణ రెడ్డికి సముచిత గౌరవం ఇచ్చేందుకు చేపట్టాల్సిన చర్యలు తీసుకుంటాం. అందరితో సమావేశమై తెలంగాణలో సముచిత గౌరవం కల్పించే బాధ్యత మా ప్రభుత్వానిది అని రేవంత్ హామీ ఇచ్చారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *