– సుప్రీంకోర్టు ఆదేశాలు
– ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన మావోయిస్టు నేత
– నకిలీ ఎన్‌కౌంటర్ అంటూ ఛత్తీస్‌గఢ్ హైకోర్టులో కుమారుడి పిటిషన్
– విచారణ ఆలస్యంతో సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాజాచంద్ర
హుస్నాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 26 : ఛత్తీస్‌గఢ్‌లోని అటవీ ప్రాంతంలో జరిగినట్టు పోలీసులు చెబుతున్న ఎన్‌కౌంటర్‌లో మరణించిన మావోయిస్టు నేత కాతా రామచంద్రరెడ్డి మృతదేహాన్ని ఛత్తీస్‌గఢ్ హైకోర్టు తీర్పు వెలువడే వరకు మార్చురీలో భద్రపరచాలని సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీచేసింది. అంతకుముందు రామచంద్రారెడ్డి కుమారుడు రాజాచంద్ర తన తండ్రిది నకిలీ ఎన్‌కౌంటర్ అని ఆరోపిస్తూ ఛత్తీస్‌గఢ్ హైకోర్టులో రిట్‌పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై తక్షణ విచారణ జరగడంలేదన్న ఆందోళనతో నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాజా ఆదేశాలతో రామచంద్రారెడ్డి అలియాస్ వికల్ప్, రాజుదాదా మరణం ఇప్పుడు దేశ అత్యున్నత న్యాయస్థానం పర్యవేక్షణలోకి వచ్చినట్లయింది. నల్సార్ యూనివర్శిటీ ఆఫ్ లాలో పరిశోధకుడైన రాజాచంద్ర ప్రారంభించిన న్యాయపోరాటానికి సుప్రీంకోర్టు అండ లభించింది. పోలీసులు మృతదేహాన్ని దహనం చేయకుండా అడ్డుకునేందుకు ఐదు రోజులుగా రామచంద్రారెడ్డి భార్య శాంతి, కొడుకు రాజాచంద్ర కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. మొదట ఛత్తీస్‌గఢ్ హైకోర్టును ఆశ్రయించారు. సెలవుల కారణంగా కేసు వాయిదా పడడంతో నిరాశ చెందిన రాజాచంద్ర దిల్లీలోని సుప్రీంకోర్టు తలుపు తట్టారు. దీంతో కోర్టు రామచంద్రారెడ్డి మృతదేహాన్ని దహనం చేయకుండా మార్చురీలో భద్రపరచాలని పోలీసులను ఆదేశించింది. హైకోర్టు సెలవులు ముగిసిన వెంటనే ఈ కేసును మొదటి ప్రాధాన్యంగా విచారించాలని సూచించింది. నిజం బయటపడాలి.. ఆయనను పట్టుకొని కాల్చేశారు అని నమ్ముతూ, అంత్యక్రియలు వాయిదా వేసి రామచంద్రారెడ్డి కుటుంబం కోర్టుల చుట్టూ తిరుగుతున్నది. వర్షాలు ఎడతెరపిలేకుండా కురుస్తున్నా, వసతి సౌకర్యం లేకపోయినా రామచంద్రారెడ్డి భార్య, కొడుకు ఛత్తీస్‌గఢ్‌లో ధైర్యంగా నిలబడి పోరాడుతున్నారు. మరోవైపు రామచంద్రారెడ్డి మృతదేహం రాక కోసం ఆయన స్వగ్రామం కోహెడ మండలం తీగలకుంటపల్లెలో బంధువులు, అభిమానులు, గ్రామస్తులు ఎదురుచూస్తున్నారు. తల్లిదండ్రులు వజ్రమ్మ, మల్లారెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు రామచంద్రారెడ్డి తమ్ముడు వెంకటరెడ్డి తెలిపారు. కోమాలో ఉన్న తన తల్లికి ఏ క్షణంలో ఏమవుతుందో తెలియడంలేదని కన్నీళ్లు పెట్టుకున్నాడు. నా భర్తను కాల్చేశారు.. కనీసం నిజం బయటపడాలి.. ఆయన మృతదేహం దహనం కాకుండా ఉండాలి.. కోర్టు ఆదేశం మాకు కాస్త ఊరట ఇచ్చింది అని కన్నీళ్లతో శాంతి పేర్కొంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




