– కాంగ్రెస్ కుట్రను వ్యతిరేకిస్తున్న బీసీ సంఘాలు
– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు
ఇల్లందు, ప్రజాతంత్ర, జులై 30: బీసీ రిజర్వేషన్ల విషయంలో రాష్ట్రం తర్జనభర్జన చేస్తూ రాజకీయ లబ్ధి పొందాలనే కుట్రలో భాగంగా ఆ రిజర్వేషన్లలో 10 శాతం ముస్లింలకు కేటాయించేందుకు ప్రయత్నిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ కుట్రకు బీసీ సంఘాలన్నీ వ్యతిరేకిస్తున్నాయని, కాంగ్రెస్‌లోని బీసీ నాయకులు కూడా వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారని అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో 4 శాతం రిజర్వేషన్లు ముస్లింలకు కేటాయించారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింలకు రిజర్వేషన్లు 10 శాతానికి పెంచి, ఎంఐఎంకు ఇంకొన్ని సీట్లు ధారాదత్తం చేయాలని చూస్తోందని, ప్రతిసారీ ఓబీసీలకు అన్యాయం జరుగుతోందని అన్నారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో బీఆర్‌ఎస్ పార్టీకి నైతికంగా విమర్శించే హక్కే లేదన్నారు. గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ బీసీలకు 50 శాతం రిజర్వేషన్ ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే సుప్రీంకోర్టులో కేసు ఉందనే నెపంతో దానిని 28 శాతానికి పరిమితం చేశారని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీసీ రిజర్వేషన్లను అమలు చేయలేక బీజేపీిపై బురద జల్లే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. 42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలుకు తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ఓబీసీలకు న్యాయం జరిగే వరకు బీజేపీ పోరాటం చేస్తుందన్నారు. ఆపరేషన్ సిందూర్‌పై నిన్న పార్లమెంట్‌లో జరిగిన చర్చలో కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేయడం బాధాకరమని, పదేపదే కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నాయకులు భారత సైనికులను తక్కువ చేస్తూ మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆపరేషన్ సిందూర్ గురించి, భారత ఆర్మీ చర్యల వెనుక ఉన్న సాహసాన్ని, వ్యూహాన్ని, విజయాలను స్పష్టంగా వివరించినప్పటికీ కాంగ్రెస్ పార్టీ పాకిస్థాన్ భాష మాట్లాడుతోందని విమర్శించారు. ఆ భాషకు బీఆర్‌ఎస్ పార్టీ మద్దతు ఇస్తోందన్నారు.
బీజేపీ వైపు సీపీఎం కేడర్ చూపు
దక్షిణ తెలంగాణలో బీజేపీని బలోపేతం చేయడమే తన లక్ష్యమని రామచందర్‌రావు చెప్పారు. కమ్యూనిస్టులు గతంలో ఖమ్మం జిల్లాను తమ అడ్డాగా చెప్పుకున్నారని, భవిష్యత్తులో ఖమ్మం గడ్డను బీజేపీ అడ్డాగా మారుస్తామని చెప్పారు. మహబూబాబాద్‌లో కూడా కార్యకర్తలు, ప్రజల నుంచి భారీ స్పందన వస్తోందన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీపీఎం కేడర్ మొత్తం బీజేపీ వైపు చూస్తోందని, బీజేపీిలో చేరాలని చూస్తున్నారని పేర్కొన్నారు. అసంపూర్తిగా నిలిచిపోయిన సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు, దేవాదుల ప్రాజెక్టులను త్వరితంగా పూర్తి చేసి బీడు భూములకు సాగునీరు అందించాలని, దీనిపై తమ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రభుత్వాన్ని స్పష్టత కోరతారని చెప్పారు. ఖమ్మం జిల్లాలో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో బీజేపీి కార్యకర్త సాయిగణేష్‌పై తప్పుడు కేసు పెట్టి ఒత్తిడి తేవడంతో తీవ్ర మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నాడని, ఇది బాధాకరమైన విషయం అని అన్నారు.



