అన్ని వర్గాలను నిండా ముంచిన కాంగ్రెస్‌

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు

లక్షెట్టిపేట, ప్రజాతంత్ర, ఆగస్టు 5: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో రైతు సమస్యలను పట్టించుకోకపోవడంతో రైతుల ఆత్మహత్యలు పెరిగాయని, రెండోసారి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతుబంధు, రైతు రుణ మాఫీని సరిగా అమలు చేయలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు ఆరోపించారు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో జరిగిన రైతు సమ్మేళనంలో ఆయన ప్రసంగించారు. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌ పార్టీ రైతులను మభ్యపెట్టడంతో బీఆర్‌ఎస్‌పై ఆగ్రహంతో రైతులు కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారని, అధికారంలోకి వచ్చిన తరువాత ఆ పార్టీ వారితోపాటు అన్ని వర్గాలను నిండా ముంచిందని ఆరోపించారు. ప్రభుత్వం ‘రైతు భరోసా’ పేరిట ఎకరాకు రూ.15వేలు ఇస్తామని చెప్పి రూ.12వేలకు కుదించిందని, అయితే అది కూడా ఇవ్వలేదని, ‘రైతు భరోసా’ పథకం అమలు చేయలేదు.. కౌలు రైతులకు ‘రైతు భరోసా ఇవ్వలేదని ఆయన తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గరపడ్డాయని కేవలం రెండు విడతల్లో రూ.6 వేల చొప్పున మాత్రమే రైతుల ఖాతాల్లో డబ్బులు జమచేసిందన్నారు. నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం రైతులకు యూరియా కొరత తీరేందుకు రూ.300 కోట్లతో రామగుండం ఎరువుల కర్మాగారాన్ని పునఃప్రారంభించిందని, అక్కడినుంచి తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాలకు యూరియా సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. తెలంగాణలో కృత్రిమంగా యూరియా కొరతను సృష్టిస్తున్నారని తెలిపారు. అందుకే కాంగ్రెస్‌ నాయకులను ప్రజలు నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులకు న్యాయపరమైన ధరలు పొందేలా చూసేందుకు పంటలకు కనీస మద్దతు ధరను కేంద్రం పెంచుతోందని, రైతుల సంక్షేమం గురించి, రైతుల శ్రేయస్సు గురించి ఆలోచించేది కేంద్ర ప్రభుత్వమని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రైతులు బీజేపీని ఆశీర్వదించి గెలిపించాలని రామచందర్‌రావు విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *