– దేశం కోసం ప్రాణాలర్పించిన గాంధీ కుటుంబం
– రాజీవ్ సద్భావన యాత్ర సంస్మరణలో సీఎం రేవంత్
– మాజీ మంత్రి సల్మాన్‌కు రాజీవ్ సద్భావన అవార్డు
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 19: దేశ సమగ్రతను కాపాడేందుకు ఆనాడు రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర చేశారని, ఆయన స్ఫూర్తిని కొనసాగించేందుకు నేడు మనమందరం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. చార్మినార్ వద్ద రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర సంస్మరణ కార్యక్రమం నిర్వహించగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. దేశంలో గాంధీ అనే పదం భారత దేశానికి పర్యాయ పదం అని చెప్పారు. గాంధీ కుటుంబం దేశానికి స్పూర్తినిచ్చింది.. దేశ సమగ్రతను కాపాడేందుకు ఉక్కు మహిళ ఇందిరా గాంధీ ప్రాణాలర్పించారు.. ఆమె వారసత్వాన్ని కొనసాగిస్తూ రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణాలర్పించారు.. దేశం కోసం మూడు తరాలు ప్రాణాలర్పించిన చరిత్ర గాంధీ కుటుంబానిది అని కొనియాడారు. 18 ఏళ్లకే ఓటు హక్కును కల్పించి దేశ అభివృద్ధిలో యువతను భాగస్వామ్యం చేసిన మహనీయుడు రాజీవ్ గాంధీ అని గుర్తు చేశారు. కాగా, 21 ఏళ్లకే శాసనసభ్యుడిగా పోటీ చేసే అవకాశం కల్పిస్తూ రాజ్యాంగ సవరణ తీసుకు రావాల్సిన అవసరం ఉందని అన్నారు. రాజీవ్ స్ఫూర్తితో రాహుల్ గాంధీ దేశ సమగ్రత కోసం భారత్ జోడో యాత్ర చేశారని చెప్పారు. గాంధీ కుటుంబంతో కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ అనుబంధం ఈనాటిది కాదని, మూడు తరాలుగా వారి కుటుంబం గాంధీ కుటుంబంతో కలిసి పనిచేస్తోంది అని చెప్పారు. ఈ సందర్భంగా సల్మాన్ ఖుర్షీద్‌కు రాజీవ్ సద్భావన అవార్టును సీఎం అందజేశారు. ఆయనకు ఈ అవార్డు అందించడం మనందరికీ గర్వకారణమని అన్నారు. ఇదిలా వుండగా రాష్ట్రంలో బీఆర్‌ఎస్ పార్టీ బీజేపీకి బీ-టీమ్‌గా మారిందని, గత పార్లమెంటు ఎన్నికల్లో రహస్య ఒప్పందంతో బీజేపీకి మద్దతు ఇచ్చిందని ఆరోపించారు. పార్లమెంటు ఎన్నికల్లో 21 శాతం బీఆర్‌ఎస్ ఓట్లు ఎవరికి చేరాయి అని ప్రశ్నించారు. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలోనూ అదే చేయాలని కుట్రలు చేస్తున్నారని, వచ్చే ఎన్నికల్లోనూ ఓట్లు చీల్చాలని కుట్ర చేస్తారని, ఈ కుట్రలను తెలంగాణ సమాజం తిప్పి కొట్టాలని రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. రాజీవ్‌గాంధీ సద్భావన యాత్ర సంస్మరణ కార్యక్రమంలో పార్టీ జెండాను పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ ఎంపీ వి.హనుమంత రావు, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, చిన్నారెడ్డి, కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.