రాడికల్‌ ‌పోరలు -2

గుడ్డు పొడుచుకొని
బయటకు వచ్చిన పక్షులై అక్షరాలు
పాలకంకుల చేతులు పట్టుకున్నాక
ఊళ్ళు విద్యాలయాలైయ్యాయి
ప్రజలు గురువులైయ్యారు

చెమట గొడ్డుకారం  బువ్వముద్దలు
చేతి నిండా నవ్వాయి

సబ్బండ వర్ణాల అడుగుల్లో అడుగులై
చెమట చుక్కల సభలతో
ఊళ్ళు కప్పుకున్న
భయం దుప్పటిగుంజేశారు

నెత్తురు పేరుకున్న దౌర్జన్యం
చెమట తాగిన దోపిడీ
గడి నిండిన హత్యాచారాలు
బద్ధకించిన కుర్చీల్లో
పచ్చని మొలక లెత్తిన
చెమట చేతులు కూర్చున్నాయి

పొక్కిలి వాకిళ్ళ
మోదుగుపూలు పూయించి
తూర్పు గాలి వీచారు

అమ్మా నాన్నలు పిలిచిన పేరు ఊరు
జ్ఞాపకాల పుటల్లో దాచుకున్నారు
సాదుకున్న జనం జానపదం పిలిచిన
పేరు ఊరు తలకెత్తుకున్నారు

వెన్నెల ప్రహించే కొత్తబాటల్లో
జగిత్యాల నుండి జంగల్మహల్‌ ‌దాకా
జీవితం పగల్లను రాత్రులను
కలల యవ్వనాన్ని
భూమి భుక్తి విముక్తి వీలునామై రాసి
ఊరి గుండెల్లో
బతుకు సంతకం చేశారు

అలుగు దునికి ప్రవహించిన
త్యాగాల ముందు
వినమ్రంగా
చరిత్ర
చేతులు కట్టుకొని నిలబడ్డది
                 – వడ్డెబోయిన శ్రీనివాస్‌ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *