ఆర్‌అండ్‌బి అధికారులు అపమ్రత్తంగా ఉండాలి

మంత్రి కోమటిరెడ్డి ఆదేశాలు

 

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 18: గత అనుభవాల దృష్ట్యా వర్షాకాలంలో ఆర్‌అండ్‌బి అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండాలని, జిల్లా హెడ్‌క్వార్టర్‌లో అందుబాటులో ఉంటూ క్షేత్రస్థాయిలో రోజువారీ పర్యవేక్షణ చేయాలని ఆర్‌అండ్‌బీ, సినిమాటోగ్రఫీ మంత్రి సూచించారు. రాష్ట్రస్థాయిలో చీఫ్‌ ఇంజనీర్లు, జిల్లాల్లో సూపరింటెండెంట్‌ ఇంజనీర్లు ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లు, క్షేత్రస్థాయి ఇంజనీర్లతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలన్నారు. భారీ వర్షాలు, వరదల వల్ల రోడ్ల కనెక్టివిటీకి ఇబ్బంది రాకుండా పర్యవేక్షణ చేయాలన్నారు. వరదల వల్ల ధ్వంసమైన రోడ్లను వెంటనే పునరుద్ధరించేందుకు వీలుగా ఇసుక, సిమెంట్‌ బస్తాలు ఏఈ స్థాయిలో అందుబాటులో ఉండే ఏర్పాట్లు చేయాలన్నారు. ఉదృతంగా ప్రవహించే నదులు వాగులు వద్ద బ్రిడ్జిలు, కల్వర్టులపై ప్రజా రవాణాకు ఇబ్బందులు లేకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, అందుకనుగుణంగా జిల్లాస్థాయిలో కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రధాన కార్యాలయ కంట్రోల్‌ సెంటర్‌కు అనుసంధానం చేయాలని సూచించారు. వెంటనే సమస్య పరిష్కారమయ్యేలా రాష్ట్రస్థాయిలో అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. గతంలో రోడ్లపై ఏర్పడిన గుంతలు పూడ్చేందుకు ఆర్‌అండ్‌బి ఆధ్వర్యంలో యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టామంటూ ఇంకా పెండిరగ్‌లో ఉన్న ప్యాచ్‌వర్క్‌లపై అధికారులను ఆరా తీశారు. రాష్ట్రవ్యాప్తంగా ఆర్‌అండ్‌బి స్టేట్‌ రోడ్స్‌కు సంబంధించి మొత్తం 1214 గుంతలు ఏర్పడి 2488 కి.మీ రోడ్డు పాక్షికంగా దెబ్బతిన్నాయని, 2186 కి.మీ రోడ్డు మరమ్మతులు పూర్తయ్యాయని, ఇంకా 302 కి.మీ రోడ్డు పనులు కొనసాగుతున్నాయని అధికారులు మంత్రికి వివరించారు. అలాగే వాడుకలో ఉన్న కల్వర్టులు, బ్రిడ్జిలు, ఆర్వోబి, ఆర్‌యుబిల పనితీరును సైట్‌ విజిటింగ్‌ చేసి పరిశీలించాలని సూచించారు. నిరంతర రాకపోకలు ఉండే నదులు,వాగుల మార్గాల్లోని కల్వర్టులు, బ్రిడ్జిలు, రోడ్లపై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న వాటి ప్రోగ్రెస్‌తోపాటు వాడుకలో ఉన్న వాటి నాణ్యతకు సంబంధించిన వివరాలతో వారంలోపు పూర్తిస్థాయి నివేదిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. మంచి రోడ్లు అభివృద్ధికి చిహ్నాలు నినాదంతో ముందుకెళ్లాలని సూచించారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రోడ్లు, భవనాలు శాఖపై ప్రత్యేక బాధ్యతలు ఉంచారని, రాష్ట్ర ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ అభివృద్ధిలో రోడ్లు, భవనాల శాఖ గేమ్‌ చేంజర్‌ రోల్‌ పోషిస్తున్న నేపథ్యంలో త్వరలో ఆర్‌అండ్‌బి శాఖకు సంబంధించి రాష్ట్రస్థాయి సమీక్ష నిర్వహిస్తామని, అధికారులు పూర్తి వివరాలతో సన్నద్ధంగా ఉండాలని మంత్రి కోమటిరెడ్డి సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *