– యాదాద్రి ఆలయంలో క్యూ ఆర్ కోడ్‌తో రూట్ మ్యాప్
యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, ఆగస్టు 4: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఆలయ ఈవో వెంకట్రావు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా యాదాద్రి దేవస్థాన పరిధిలో భక్తులు ఎక్కడికి వెళ్లాలన్నా ఏ మార్గంలో వెళ్లాలి అని యాప్ ద్వారా చూపించే విధంగా క్యూ ఆర్ కోడ్‌లతో కూడిన బోర్డులను ఈవో ఆదేశాలతో అధికారులు ఏర్పాటు చేశారు. భక్తులు ఆలయ పరిధిలో ఎక్కడికి చేరుకోవాలనుకుంటున్నారో ఆ ప్రదేశానికి సంబంధించిన క్యూ ఆర్ కోడ్ తమ ఫోన్‌లో స్కాన్ చేసుకుంటే ఆ ప్రాంతానికి సులభంగా చేరుకునే విధంగా ఈ యాప్ పనిచేయనుంది అని తెలిపారు. స్వామివారి దర్శనానంతరం భక్తులు ఆలయ పశ్చిమ రాజ గోపురం మార్గంలో బయటకు వెళ్లే విధంగా ఏర్పాట్లు చేస్తూ భక్తులకు ఇచ్చే ప్రసాదం 30 గ్రాములకు తగ్గకుండా డొప్పలలో అందించాలని ఆలయ అధికారులను ఆదేశించారు. ఆలయ భద్రతకు సంబంధించి మాట్లాడుతూ ఆలయం లోపల, ఆలయ పరిసర ప్రాంతాలు అన్నీ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయటానికి సిబ్బందికి అవసరమైన శిక్షణ ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. ధర్మ దర్శనం, ప్రత్యేక దర్శనం, విఐపి ప్రొటోకాల్ దర్శనం చేసుకునే భక్తుల భద్రత సౌకర్యాలకనుగుణంగా ఆధునిక పరికరాలను ఉపయోగించాల్సిందిగా భద్రతా సిబ్బందిని ఆదేశించారు.



