పివి మార్గాన్ని ప్రజా ప్రభుత్వం అనుసరిస్తుంది
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 28: ప్రధాని ఇందిరాగాంధీ తీసుకువచ్చిన భూ సంస్కరణలను ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో అమలు చేసి సమసమాజానికి పునాదులు వేసిన సంస్కర్త పి.వి.నరసింహారావు అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. నెక్లెస్ రోడ్‌లోని పి.వి ఘాట్ వద్ద శనివారం నివాళులర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మాజీ ప్రధాని, భారతరత్న, ఆర్థిక సంస్కరణల పితామహుడు మన రాష్ట్రంలో జన్మించడం అందరికీ గర్వకారణమని, రాష్ట్రంలో మంత్రిగా, ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, ప్రధానిగా ఆయన తీసుకొచ్చిన అనేక సంస్కరణలు సమాజానికి గొప్ప మేలు చేశాయని తెలిపారు. అందరికీ ఒకే రకమైన విద్యాబోధన ఉండాలని ఈ దేశ మొట్టమొదటి మానవ వనరుల శాఖ మంత్రిగా ప్రజాస్వామ్య భావనకు పునాదులు వేశారని డిప్యూటీ సీఎం గుర్తు చేశారు. ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టే నాటికి దేశం ఆర్థిక, రాజకీయ సంక్షోభంలో ఉందని, ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని ఆయన ఈ దేశ ఆర్థిక, రాజకీయ వ్యవస్థలను గాడిలో పెట్టారని తెలిపారు. తాకట్టులో ఉన్న దేశ బంగారాన్ని విడిపించి ఆర్థిక సంస్కరణలతో ప్రపంచంలో భారతదేశం ఒక బలమైన దేశంగా నిలబెట్టారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాల కాలంలో పేదలకు పంపిణీ చేసిన భూములను గత పదేళ్లు పరిపాలించిన వారు ధరణి పేరుతో రకరకాల ఇబ్బందులకు గురిచేసి అన్యాక్రాంతం చేశారని విమర్శించారు. ఆ భూములను తిరిగి స్వాధీనం చేసుకొని పేదల అస్తిత్వాన్ని, హక్కులను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిందని వివరించారు. పీవీ మార్గాన్ని ప్రజా ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ తూ.చ తప్పకుండా అమలు చేస్తుందని భట్టి విక్రమార్క తెలిపారు.



