- మొక్కజొన్న, జొన్న పంటలను పీఎస్ ఎస్ లో చేర్చాలి
- ఆయిల్‌పామ్, పత్తిరైతులపై కేంద్ర వాణిజ్య విధానాల ప్రభావం
- కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ కు తుమ్మల లేఖ
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 11: దేశంలో ఆహార భద్రతను బలోపేతం చేయడానికి, రైతు సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం చూపుతున్న దృఢ సంకల్పాన్ని మంత్రి తుమ్మల (Thummala Nageshwar Rao) అభినందించారు. అయితే రాష్ట్రంలో అమలవుతున్న పీఎస్ ఎస్ పథకంలో ఉన్న పరిమితులు, ప్రధాన పంటల కొనుగోలుపై కేంద్రం చూపెడుతున్న నిర్లక్ష్యం మరియు రైతుల ఆదాయంపై ప్రభావం చూపుతున్న కేంద్ర వాణిజ్య విధానాల గురించికేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ కు లేఖ ద్వారా తెలియజేశారు. కాగా శనివారం “పీఎం ధన్ ధాన్య కృషి యోజన” “నేషనల్ మిషన్ ఆన్ పల్సెస్” పథకాలను ప్రారంభించిన సందర్భంగా కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ గారికి అభినందననలు తెలియజేశారు.
కాగా మద్దతు ధర పథకంలో 25% కొనుగోలు పరిమితి తొలగించాలని కోరారు. ప్రస్తుతం పీఎస్ ఎస్ పథకం కింద కొనుగోలు చేస్తున్న నువ్వులు, శనగలు, వేరుశెనగ, సోయాబీన్, పెసళ్ళు వంటి పంటలపై కేంద్రం 25% సీలింగ్ విధించడం వలన, రైతులు తాము పండించిన పంటలో కేవలం 25% మాత్రమే మద్ధతు ధరకు అమ్ముకొనే వెసులుబాటు కలుగుతుందని, తెలంగాణలాంటి రాష్ట్రాలలోని భూముల్లో నువ్వులు, శనగలు, వేరుశెనగ, సోయాబీన్, పెసళ్ళు వంటి పంటలు విస్తారంగా సాగవుతాయని, ఈ పరిమితిని విధించడంతో రైతులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. మార్కెట్‌లో ధరలు పడిపోయిన సమయంలో రైతుల ప్రయోజనార్థం రాష్ట్ర ప్రభుత్వం మార్క్ ఫెడ్ మరియు సహకార సంస్థల ద్వారా కేంద్రం విధించిన 25% సీలింగ్ కంటే ఎక్కువ కొనుగోళ్లు చేయవలసి వస్తోందని, దీని వల్ల రాష్ట్రంపై ఆర్థిక భారం పడుతోందని పేర్కొన్నారు.
అందువల్ల, పీఎస్ ఎస్ కింద ఉన్న 25% కొనుగోలు పరిమితిని రద్దు చేయాలని లేదా సడలించాలని కేంద్రాన్ని మంత్రి తుమ్మల కోరారు. మొక్కజొన్న, జొన్న పంటలను కూడా పీఎస్ ఎస్‌లో చేర్చాలని కోరారు. దీనివల్ల రైతులకు మద్దతు ధరపై భరోసా ఏర్పడుతుందన్నారు. కనిష్ట మద్ధతు ధర (ఎంఎస్‌పీ) ని కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్నప్పటికి, దాని భారం రాష్ట్ర ప్రభుత్వాలపై పడుతోందని పేర్కొన్నారు. అందువల్ల ఎంఎస్‌పీ అమలు మార్కెట్ జోక్యాల్లో కేంద్ర-రాష్ట్రాల మధ్య వ్యయభారం పంచుకునే ఆర్థిక విధానం రూపుదిద్దాలని మంత్రి సూచించారు. నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ – ఆయిల్ పామ్ (ఎన్ ఎంఈఓ-ఓపీ) పథకం అమలులో తెలంగాణ దేశంలో ముందంజలో ఉందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే 1.08 లక్ష హెక్టార్లలో 73,744 మంది రైతులు ఆయిల్ పామ్ సాగు చేస్తున్నారని, 2025-26 లో మరో 50,000 హెక్టార్ల విస్తరణ లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. అయితే, కేంద్ర ప్రభుత్వం మే 31, 2025న క్రూడ్ పామ్ ఆయిల్‌పై కస్టమ్స్ సుంకాన్ని 27.5% నుండి 16.5%కి తగ్గించడం వల్ల దేశీయ ధరలు తీవ్రంగా పడిపోయి, ఆయిల్ పామ్ రైతులు పొందే తాజా ఫ్రూట్ బంచ్ (ఎఫ్ ఈబీ) ధర టన్నుకి ₹20,000 కంటే తక్కువకు చేరిందని తెలిపారు.
అదే విధంగా, పత్తి విషయంలో సీసీఐ కొనుగోళ్లు 50–60% వరకు మాత్రమే పరిమితం అవుతున్నాయని, నాణ్యత పరమైన కారణాలు మరియు కొనుగోళ్లలో ఆలస్యం కారణంగా రైతులకు ఎంఎస్ పీ లభించడం లేదని మంత్రి అన్నారు. అంతేకాకుండా కాటన్ దిగుమతులపై దిగుమతి సుంకం మినహాయింపు చేయడం వలన కూడా దేశీయ ధరలు మరింతగా పడిపోయాయని తెలిపారు. ఈ వాణిజ్య విధానాలు రైతుల ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని, కాబట్టి ఆయిల్ పామ్ మరియు పత్తిపై దిగుమతి సుంక విధానాలు దేశీయ మార్కెట్ సీజన్‌లకు అనుగుణంగా ఉండేలా ఆర్థిక మంత్రిత్వ శాఖతో సమన్వయం చేయాలని ఆయన కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖను అభ్యర్థించారు. పీఎస్ ఎస్ లో పంటల కొనుగోళ్లపై విధించిన పరిమితులు, రాష్ట్ర ప్రధాన పంటలను పీఎస్ ఎస్ పథకం నుండి మినహాయించడం మరియు కేంద్ర అనాలోచిత వాణిజ్య విధానాల వల్ల తెలంగాణ రైతులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అన్ని విధాల సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ, కేంద్ర-రాష్ట్ర సమన్వయం ద్వారా మాత్రమే రైతులు కోరుకునే కనీస మద్దతు ధరపై రైతులకు భరోసా కల్పించడం సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు.





