70 వేల ఉద్యోగాలిచ్చాం.. ఆ తలలు లెక్కబెడదాం రండి

– బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కు రాజకీయాలు
– కాంగ్రెస్‌నుదెబ్బ తీయాల‌న్న‌దే వాటి ఆలోచ‌న
– చొప్ప‌దండిలో సీఎం రేవంత్‌రెడ్డి ఫైర్‌

చొప్పదండి, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 5ః కాంగ్రెస్‌ను దెబ్బతీసేందుకు బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్రంగా దుయ్యబట్టారు. రెండేళ్లలో ఏం చేశారని ఆ పార్టీలు మమ్మల్ని ప్రశ్నిస్తున్నాయి.. పదేళ్లలో బీఆర్ఎస్ ఏం చేసింది, పన్నెండేళ్లల్లో మోదీ ఏం చేశారో చర్చిద్దాం రండి.. రెండేళ్లలో మేం ఏం చేశామో చెబితే మీ గుండెలు పగులుతాయ్ అని అన్నారు. చొప్పదండిలో గురువారం వివిధ పథకాలకు శంకుస్థాప చేసిన సందర్భంగా ప్రజా పాలన- ప్రగతి బాట సభలో ఆయన మాట్లాడారు. 70 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం.. ఆ 70 వేల మంది తలలు లెక్కపెడదాం.. ధైర్యముంటే ఎల్బీ స్టేడియంకు రండి, వంద నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నాం.. హాస్టల్ విద్యార్థులకు కాస్మెటిక్, డైట్ చార్జీలు పెంచాం.. చొప్పదండిలో డిగ్రీ కాలేజీ నిర్మిస్తున్నాం.. 25.35 లక్షల మంది రైతులకు రూ.2 లక్షలు రుణ మాఫీ చేశాం.. 9 రోజుల్లో రూ.9 వేల కోట్లు రైతు భరోసా అందించాం.. రైతుల కోసమే రెండేళ్లలో రూ.లక్ష కోట్లు ఖర్చు చేశాం అని వివరించారు. సన్న వడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్ అందించామని, రైతులు పండించిన ప్రతీ గింజ తమ ప్రభుత్వం కొంటున్నదని, వ్యవసాయం పండుగ చేసి చూపిస్తున్నామని చెప్పారు. తమ ప్రభుత్వం ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కోసం రెండేళ్లల్లో రూ.9 వేల కోట్లు ఖర్చు చేసిందని, రెండేళ్లలో రూ.27 కోట్లు మహిళలకు రుణాలు అందించి వ్యాపారంలో ప్రోత్సహిస్తున్న‌ద‌ని, ఆడబిడ్డలను ఆర్టీసీ బస్సులకు యజమానులను చేశామని తెలిపారు. 2027లో గోదావరి పుష్కరాలు రాబోతున్నాయి.. బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి పరివాహక ఆలయాలను అభివృద్ధి చేస్తాం.. ఎకో టూరిజంను అభివృద్ధి చేసి పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దుతాం అని చెప్పారు. బీఆర్ఎస్ ఎన్ని శాపనార్ధాలు పెట్టినా మరో ఎనిమిదేళ్లు అధికారం మాదే.. రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్‌గా తీర్చిదిద్దుతాం.. కరీంనగర్‌కు ఔటర్ రింగ్ రోడ్డు నిర్మిస్తాం.. వరంగల్, కరీంనగర్ జంట నగరాలుగా అభివృద్ధి చేసి రెండింటి మధ్యలో డంప్ యార్డు ఏర్పాటు చేసి విద్యుత్ ఉత్పత్తి చేస్తాం అని హామీ ఇచ్చారు. బండి సంజయ్ మాపై రంకెలేయడం కాదు.. కాళేశ్వరంపై సీబీఐ విచారణ జరిపించి కేసీఆర్‌ను బొక్కలో వేయించాలి అని డిమాండ్ చేశారు. దిల్లీ నుంచి కరీంనగర్ మున్సిపల్ అభివృద్ధికి ఏం నిధులు తెచ్చారో బండి చెప్పాలన్నారు. ఎవరు ఏం ఇచ్చినా ఇవ్వకపోయినా రాష్ట్రాభివృద్ధి ఆగదన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో మంచి వాళ్లను ఎన్నుకోండి అని ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా చొప్పదండిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రూ.45.15 కోట్లతో రామడుగులో అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటుకు, రూ.5 కోట్లతో గంగాధర మండలం మధురానగర్‌లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *