బిజెపి ఆధ్వర్యంలో రైతు సమస్యలపై నిరసన

యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, జూలై 7: రైతు సమస్యలపై బీజేపీ ఆధ్వర్యంలో యాదగిరిగుట్ట పట్టణంలోని తహసిల్దార్‌ కార్యాలయం ముందు నిరసన తెలియజేశారు. అనంతరం తహసిల్దార్‌ గణేష్‌కు బీజేపీ శ్రేణులు వినతి పత్రం ఇచ్చాయి. ఈ సందర్భంగా పార్టీ పట్టణ అధ్యక్షుడు కర్రే ప్రవీణ్‌ మాట్లాడుతూ రైతు ప్రభుత్వం అని చెప్పుకునే కాంగ్రెస్‌ పార్టీ డిక్లరేషన్‌ పేరుతో రైతులను వంచించింది తప్ప ఎలాంటి మేలు చేయలేదన్నారు. రుణ మాఫీ చేయకుండా రైతులను బ్యాంకుల చుట్టూ తిప్పుతున్నారని, రైతు భరోసా కూడా చాలామంది రైతుల ఖాతాల్లో జమ కాలేదని చెప్పారు. ఎకరం భూమి ఉంటే రెండు గుంటలకు మాత్రమే రైతు భరోసా పడిరదన్నారు. కౌలు రైతులకు సహాయం ఇంతవరకు అందలేదన్నారు. సన్నాలకు ఇస్తానన్న బోనస్సు రాలేదు.. కేంద్రం యూరియా అందిస్తున్నా సరిగా పంపిణీ చేయకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నారని ఆయన విమర్శించారు. స్థానిక ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సొంత మండలంలో పొలాలకు నీళ్లు లేక, కరెంటు లేక చాలామంది రైతులు పంటలు వేయకుండా ఉన్న పరిస్థితి కనిపిస్తోందన్నారు. రైతు బీమాకు సంబంధించి కూడా ఈ ప్రభుత్వం ఎల్‌ఐసికి డబ్బులు చెల్లించడం లేదన్నారు. అందుకే తహసిల్దార్‌ కార్యాలయం ముందు నిరసన తెలియజేసినట్లు ప్రవీణ్‌ వివరించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి కాదురి అచ్చయ్య, ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు కిషన్‌ నాయక్‌. బిజెపి మండల మాజీ అధ్యక్షుడు గుంటిపల్లి సత్యం. మండల ప్రధాన కార్యదర్శి గోపగాని ప్రసాద్‌ గౌడ్‌, దేవరకొండ నారాయణ, పట్టణ ప్రధాన కార్యదర్శి జెల్ల బాలచందర్‌, కార్యదర్శులు సుంచు శ్రావణ్‌, దొమ్మాట ప్రభాకర్‌. పలుగుల సురేష్‌, ఆవుల సత్యనారాయణ, ఆలేటి కర్ణ, కిసాన్‌ మోర్చా అధ్యక్షుడు రాజిరెడ్డి, జిల్లా కౌన్సిల్‌ మెంబర్‌ మహేష్‌ గౌడ్‌, ఉపాధ్యక్షులు ఏలూరి సత్యనారాయణ, కొత్తపల్లి రమేష్‌, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *