– కఠిన చట్టాలు అవసరమన్న సుప్రీం ధర్మాసనం
న్యూదిల్లీ,నవంబర్ 27(ఆర్‌ఎన్‌ఎ): దివ్యాంగులకు కూడా రక్షణ కవచం ఉండాలని సుప్రీంకోర్టు అభిప్రాయ పడింది. వారిని కించపరిచే వారిపై చర్యలు తీసుకునేందుకు వీలుగా ఎస్సీ/ఎస్టీ చట్టం లాంటి కఠినమైన చట్టాలు అవసరమని సుప్రీం కోర్టుపేర్కొంది. ఈ దిశగా ఆలోచన చేయాలని కేంద్రానికి సూచించింది. యూట్యూబర్ రణ్‌వీర్ అలహాబాదియా, సమయ్ రైనాలకు సంబంధించి పిటిషన్ల విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. కండరాల క్షీణత సమస్యపై అవగాహన కల్పిస్తూ బాధితులతో కలిసి ఓ ప్రదర్శన నిర్వహించాలని ఈ సందర్భంగా సమయ్ రైనాకు సుప్రీం కోర్టు సూచించింది. ఓ ఆన్‌లైన్ షోలో వెన్నెముక కండరాల క్షీణతతో బాధపడుతున్న ఓ చిన్నారికి అవసరమైన ఔషధాల గురించి ప్రస్తావిస్తూ వారిని కించపరిచే విధంగా సమయ్ రైనా మాట్లాడాడు. ఈ షోలో పాల్గొన్న వారిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ అరుదైన వ్యాధిపై పోరాడుతున్న స్వచ్ఛంద సంస్థ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దీన్ని తీవ్రంగా పరిగణించిన న్యాయస్థానం.. ఆ షోలో పాల్గొన్న వారు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆదేశించింది. ఈ మేరకు సమయ్ రైనా క్షమాపణలు చెప్పాడు.రణ్‌వీర్ అలహాబాదియా, సమయ్ రైనాలకు సంబంధించిన పిటిషన్లను సుప్రీం కోర్టు నేడు విచారించింది. బాధితుల తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది అపరాజితా సింగ్.. కమెడియన్ వ్యాఖ్యలు చిన్నారులను కించపరిచేలా ఉన్నాయని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. వారు ఎంతో ప్రతిభావంతులని, ఇలాంటి వ్యాఖ్యలు క్రౌడ్ ఫండింగ్‌కు ఇబ్బందిగా మారుతాయన్నారు. వీటితో సీజేఐ జస్టిస్ సుర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఏకీభవించింది. దివ్యాంగులపై ఎవరైనా కించపరిచే వ్యాఖ్యలు చేస్తే.. ఎస్సీ/ఎస్టీ చట్టం మాదిరిగా కఠిన చట్టాన్ని తీసుకువచ్చే విషయంపై ఎందుకు ఆలోచించరని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను సుప్రీం ధర్మాసనం అడిగింది. దివ్యాంగులకు రక్షణ కల్పించేందుకు కఠిన చట్టాలు తీసుకువచ్చే విషయంపై ఆలోచించాలని సూచించింది. వారికి కావాల్సింది గౌరవ, మర్యాదలని.. వారి విజయాలను చాటిచెప్పేందుకు వేదికను (ఆన్‌లైన్ షో) ఉపయోగించాలని యూట్యూబర్‌లకు సూచించింది. ఈ షోలకు దివ్యాంగులను కూడా ఆహ్వానించి, వాటితో వచ్చే నిధులను బాధితుల చికిత్సకు అందజేయాలని ఆదేశించింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.


