హామీలు అమలయ్యేదాకా రేవంత్‌ను వదలం

తెలంగాణ భవన్‌లో విద్యార్థులు, నిరుద్యోగులతో హరీష్‌రావు భేటీ

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 28: రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం ఆనాడు ఇచ్చిన అన్ని హామీలు అమలు చేసే దాకా అసెంబ్లీ లోపల, బయట బీఆర్‌ఎస్‌ పోరాటం చేస్తుందని, తమ సమస్యలపై పోరాడుతున్న విద్యార్థులకు, నిరుద్యోగులకు సంపూర్ణ మద్దతు ఇస్తామని బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి హరీష్‌రావు తెలిపారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి బీఆర్‌ఎస్‌ భవన్‌కు వచ్చిన విద్యార్థులు, నిరుద్యోగులతో భేటీ అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రపతి ఉత్తర్వులు సవరించి 95శాతం ఉద్యోగాలు స్థానికులకు వచ్చేలా కేసీఆర్‌ ఆధ్వర్యంలోని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిందని, లక్షా 62వేల ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. తాము ఉద్యోగాలు ఇవ్వలేదని రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం గోబెల్స్‌ ప్రచారం చేస్తున్నదని, తాము గట్టిగా ప్రశ్నిస్తే రేవంత్‌ రెడ్డి అసెంబ్లీలో జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేశారని, చర్చ పెట్టకుండా వెంటనే సభను వాయిదా వేసుకొని పారిపోయారని విమర్శించారు. ఎస్పీడీసీఎల్‌, ఫారెస్ట్‌, గ్రూప్స్‌, డీఎస్సీ, పోలీసు.. ఇలా అన్ని శాఖల్లో పోస్టుల భర్తీ అని జాబ్‌ క్యాలెండర్‌లో చెప్పారు కానీ ఒక్క నోటిఫికేషన్‌ కూడా రాలేదు.. మెగా డీఎస్సీ దగా డీఎస్సీ అయ్యింది‘ అని హరీష్‌ విమర్శించారు. ‘ఇది జాబ్‌ క్యాలెండర్‌ కాదు, జాబ్‌ లెస్‌ క్యాలెండర్‌ అని ఆరోజు అంబేద్కర్‌ విగ్రహం వద్ద ధర్నా చేసినం.. తెలంగాణ అమరుల స్తూపం ముందు కూర్చొని కాంగ్రెస్‌ మోసాన్ని ఎండగట్టినం అన్నారు. అసెంబ్లీలో పెట్టి కూడా ఒక్క ఉద్యోగానికీ నోటిఫికేషన్‌ ఇవ్వని చరిత్ర కాంగ్రెస్‌దన్నారు. 20 నెలలు కావొస్తున్నా నోటిఫికేషన్లు లేని పరిస్థితి ఉండగా నోటిఫికేషన్లు వద్దు అని విద్యార్థులు ధర్నా చేస్తున్నారని రేవంత్‌ అబద్దాలు మాట్లాడుతున్నడని అన్నారు. 20 నెలల్లో నువ్వు ఇచ్చిన ఉద్యోగాలు 12వేలు దాటలేదు రేవంత్‌ రెడ్డీ.. యువతను దారుణంగా మోసం చేసినవ్‌.. ఏడాదికి 16వేల ఉద్యోగాలు సగటున మేం ఇస్తే రెండేళ్లుగా నువ్వు సగం కూడా ఇవ్వలేదు అని నిలదీశారు. నోటిఫికేషన్లు ఇవ్వ చేతగాక అబద్దాలు మాట్లాడుతున్నవు అని మండిపడ్డారు. ప్రియాంక గాంధీ సరూర్‌ నగర్‌ స్టేడియంలో మీటింగ్‌ పెట్టి ఇందిరాగాంధీ మనవరాలుగా మాటిస్తున్నాను అని యూత్‌ డిక్లరేషన్‌ విడుదల చేశారు.. నేడు అది ఏమెపోయింది.. నోటిఫికేషన్లు, ఉద్యోగాలు ఇవ్వని రేవంత్‌ రెడ్డిని మీరు ఎందుకు ప్రశ్నించడం లేదు.. మీ కుటుంబ గౌరవం తీస్తున్నడు రేవంత్‌ రెడ్డి.. ఐదు అంశాల యూత్‌ డిక్లరేషన్‌లో ఒక్కటి కూడా అమలు కాలేదు.. అవన్నీ ఏమైనయ్‌. యూత్‌ డిక్లరేషన్‌ దిక్కు లేకుండా పోయింది అని విమర్శించారు. ప్రైవేటు రంగంలో ఎస్సీ, ఎస్టీ బీసీలకు మేలు చేసేలా 75శాతం రిజ్వరేషన్‌ తెస్తం అన్న మాట దేవుడెరుగు.. కానీ జీవో 29 రద్దు చేసి ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు నియామకాల్లో దగా చేశారు.. విద్యార్థి భరోసా కార్డు రాలేదు, నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. ప్రియాంక గాంధీ ఒక్క హామీ అమలు కాలేదు, రాహుల్‌ గాంధీ సెంట్రల్‌ లైబ్రరీ మెట్లపై కూర్చొని నిరుద్యోగులకు 2లక్షల ఉద్యోగాలు అని ఇచ్చిన మాట తప్పారు. తక్షణం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తున్నామన్నారు. నిరుద్యోగులూ భయపడకండి. మీరు పోరాడండి.. మీ వెనుక బీఆర్‌ఎస్‌ పార్టీ ఉంటది.. మీకు రెండు లక్షల ఉద్యోగాలిచ్చే దాకా రేవంత్‌రెడ్డిని వదిలిపెట్టం అని హరీష్‌రావు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ’హలో నిరుద్యోగి.. చలో సెక్రటేరియట్‌‘ పోస్టర్‌ను ఆవిష్కరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *