– పలుచోట్ల పొగమంచుతో ఇబ్బందులు
హైదరాబా, జనవరి1: రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు చలి గుప్పిట్లో చిక్కుకుని విలవిల్లాడుతున్నారు. ఎన్నడూ లేని విధంగా నెల రోజులుగా చలి తీవ్రత పెరగడంతో ఏజెన్సీ ప్రాంతాలేకాక పట్టణాలు, నగరాలు అనే తేడా లేకుండా ప్రజలు వణికిపోతున్నారు. ప్రస్తుతం తెలంగాణవ్యాప్తంగా సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీల వరకు తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పలు ప్రాంతాల్లో దట్టమైన పొంగమంచు కురవడంతో వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్‌లో నూతన సంవత్సరం రోజు మంచుదుప్పటి పరచుకుంది. దీంతో ఉదయం 9 గంటలు దాటినా సూరీడు దర్శనమివ్వలేదు. ఉమ్మడి మెదక్, రంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. కోహిర్, సిర్పూర్ ప్రాంతాల్లో నెల రోజులుగా 5 నుంచి 6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతున్నట్లు అధికారులు తెలిపారు. ఆసిఫాబాద్, మంచిర్యాల, వరంగల్, హన్మకొండ, సిద్దిపేట, జనగాం, మెదక్, రంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో చలి తీవ్రత బాగా పెరిగింది. హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లోనూ పరిస్థితి దారుణంగా ఉంది. అక్కడి ప్రాంతాల్లో 8 నుంచి 12 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక ఆంధప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో విపరీతమైన చలి ప్రభావం కనిపిస్తోంది. రాబోయే మూడు రోజుల్లో కోస్తాంధ్ర, యానాం, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 2`3 డిగ్రీల సెల్సియస్‌కు తగ్గే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో మధ్యాహ్నం కూడా విపరీతంగా చలి ఉంటోంది. దక్షిణ తీర ప్రాంతాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశముందని ఐఎండీ అంచనా వేస్తోంది. 1వ తేదీ తర్వాత వాతావరణంలో చాలా మార్పులు ఉండే అవకాశం ఉందని, ఉత్తర భారతదేశం నుంచి చల్లటి పవనాలు వీయడం వల్లనే ఉష్ణోగ్రతలు తగ్గాయని పేర్కొంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





