46లక్షల మంది ఎస్‌హెచ్‌జీ మహిళల హెల్త్ ప్రొఫైల్ తయారీ

– అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 8 నుంచి స్క్రీనింగ్
– టీ డయాగ్నస్టిక్స్ ద్వారా ఒక్కొక్కరికి 30 రకాల పరీక్షలు
– 99 రోజుల ప్రణాళిక కార్యక్రమాలపై మంత్రి దామోదర్ సమీక్ష

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 4: రాష్ట్రవ్యాప్తంగా స్వయం సహాయక సంఘాల మహిళల హెల్త్ ప్రొఫైల్ రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమాన్ని ఈ నెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు ప్రారంభించాలని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా ఆరోగ్యశాఖ నిర్వహించాల్సిన కార్యక్రమాలపై సెక్రటేరియట్‌లో మంత్రి బుధవారం సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఈ నెల 6 నుంచి జూన్ 12 వరకూ 99 రోజులపాటు చేపట్టనున్న కార్యక్రమాలపై ఉన్నతాధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు. మొత్తం నాలుగు దశల్లో కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. తొలి దశలో ఈనెల 6 నుంచి 31వ తేదీ వరకు 26 రోజులపాటు మాతా శిశు సంరక్షణ, కౌమార దశ బాలికలు, వృద్ధుల ఆరోగ్య సేవలపై దృష్టి కేంద్రీకరించనున్నారు. హాస్పిటళ్లలో పారిశుధ్య నిర్వహణ, పెండింగ్ ఫైళ్ల పరిష్కారం, ఆస్తుల వెరిఫికేషన్ వంటి పరిపాలనాపరమైన అంశాలను చక్కదిద్దడంతోపాటు క్షేత్రస్థాయిలో రక్తహీనత నివారణ, పాఠశాలలు, అంగన్‌వాడీల్లో పిల్లలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించనున్నారు. 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సెల్ఫ్‌హెల్ప్ గ్రూపు మహిళల హెల్త్ ప్రొఫైల్ తయారీ ప్రోగ్రామ్‌ను ప్రారంభిస్తారు. తెలంగాణ డయాగ్నస్టిక్స్ సహకారంతో ఒక్కో మహిళకు 30 రకాల పరీక్షలు చేయనున్నారు. మూడు దశల్లో సుమారు 46 లక్షల మంది మహిళలకు పరీక్షలు చేయనున్నారు. తొలి దశలో ప్రతి జిల్లా నుంచి 5 మండలాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి, రెండో దశలో మరో 10 మండలాల్లో, చివరి దశలో మిగిలిన అన్ని మండలాల్లో స్క్రీనింగ్ చేపట్టనున్నారు. మొత్తం స్క్రీనింగ్‌ను ఆరు నెలల్లో పూర్తి చేయాలని మంత్రి సూచించారు. ఏప్రిల్ 1 నుంచి 15వ తేదీ వరకు ప్రజాపాలన రెండో దశలో అసంక్రమిత వ్యాధులైన బీపీ, షుగర్, కేన్సర్ వంటి వాటిని గుర్తించేందుకు సబ్ సెంటర్ల పరిధిలో స్క్రీనింగ్ క్యాంపులు ఏర్పాటు చేస్తారు. జిల్లా డే కేర్ కేన్సర్ సెంటర్లలో కీమోథెరపీ సేవలను మ్యాపింగ్ చేయడంతోపాటు డయాలసిస్ రోగులకు వైరల్ ఇన్ఫెక్షన్ పరీక్షలు తప్పనిసరి చేయాలని మంత్రి ఆదేశించారు. ఏప్రిల్ 16 నుంచి మే 15 వరకు మూడో దశలో అంటువ్యాధుల నియంత్రణ, ప్రజారోగ్య సన్నద్ధతపై యంత్రాంగం దృష్టి సారించనుంది. టీబీ ముక్త్ భారత్ లక్ష్యంగా టీబీ కేసులను గుర్తించడంతోపాటు వడదెబ్బ, డెంగ్యూ, మలేరియా వంటి సీజనల్ వ్యాధులపై ప్రజల్లో అవగాహన కల్పించి, అత్యవసర మందులను అందుబాటులో ఉంచాలని మంత్రి ఆదేశించారు. మే 16 నుంచి జూన్ 12 వరకు నాలుగో దశలో పట్టణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలను విస్తరించనున్నారు. ముఖ్యంగా జీహెచఎంసీ, సైబరాబాద్, మేడ్చల్ పరిధిలోని 145 అర్బన్ పీహెచ్‌సీలను పాలిక్లినిక్స్‌గా అప్‌గ్రేడ్ చేసి స్పెషాలిటీ వైద్య సేవలదించాలని మంత్రి సూచించారు. బస్తీల్లో మొబైల్ వైద్య శిబిరాలు నిర్వహించి పేదలకు వైద్యం చేరువ చేయనున్నారు. ఫుడ్ సేఫ్టీ మేళాలు నిర్వహించి ప్రజల్లో కల్తీ ఆహారంపై చైతన్యం తీసుకురావాలని మంత్రి సూచించారు. సమీక్షలో ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్తు, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ సంగీత సత్యనారాయణ, ఆరోగ్యశ్రీ సీఈవో ఉదయ్ కుమార్, డ్రగ్ కంట్రోల్ అథారిటీ డైరెక్టర్ జనరల్ షానవాజ్ ఖాసీం, డీఎంఈ నరేంద్ర కుమార్, టీవీవీపీ కమిషనర్ అజయ్‌కుమార్, డీహెచ్ రవిందర్ నాయక్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *