– అటు టెట్.. ఇటు నెట్.. మరోవైపు ప్రాక్టికల్స్
– బీఈడీ విద్యార్థుల్లో అయోమయం
– కె.యు అధికారులు ఆలోచించాలని విజ్ఞప్తి
కాళోజి జంక్షన్ /హనుమకొండ, ప్రజాతంత్ర, డిసెంబర్ 27 : చాలా రోజుల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(టెట్) కోసం దరఖాస్తు చేసిన కేయు పరిధిలోని వందలాదిమంది విద్యార్థులు అయోమయంలో పడ్డారు. మరొకవైపు కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలోని 42 బిఈడి కళాశాలల్లో మూడవ సెమిస్టర్ సమీపిస్తున్న తరుణంలో విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. త్వరలో ప్రభుత్వం ప్రకటించబోయే డీఎస్సీ పరీక్షకు హాజరు కావాలనుకుంటున్న బిఈడి థర్డ్ సెమిస్టర్ విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలోని మూడువేల మంది విద్యార్థులు స్టేట్ టెట్ కు దరఖాస్తు చేసుకున్నారు. ప్రతి విద్యార్థి వేయి రూపాయల వరకు పోటీ పరీక్ష రుసుము చెల్లించి ఉన్నారు. మరోవైపు కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలోని బీఈడీ కళాశాల్లో మూడో సెమిస్టర్ విద్యార్థులకు జనవరి రెండు నుంచి ఆరవ తేదీ వరకు మెథడాలజీ ఒకటి, మెథడ్ రెండులలో ఫైనల్ లెసన్ పరీక్షలు నిర్వహించడానికి కేయు విద్యా విభాగం ఉన్నతాధికారులు ప్రాక్టికల్స్ టైం టేబుల్ విడుదల చేశారు. మరొకవైపు పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన బీఈడీ విద్యార్థులకు నెషనల్ ఎలిజిబుల్ పరీక్షలు కూడా జనవరిలోనే ఉండటంతో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అధేవిధంగా నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ నిర్వహణ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో ఉంది. అంతేకాకుండా అది రాష్ట్రంలోని లక్షలాదిమంది విద్యార్థులతో ముడిపడి ఉన్న టైం టేబుల్ కావడంతో అది మార్చడం సాధ్యం కాదని విద్యార్థులు అంటున్నారు. అయితే కాకతీయ విశ్వవిద్యాలయం ఉన్నతాధికారులు మానవతా దృక్పథంతో చొరవ తీసుకుంటే కేయూ పరిధిలోని 42 బిఈడి కళాశాలల పరిధిలోని విద్యార్థులకు ఆందోళన నుంచి ఉపశమనం కలిగించవచ్చని విద్యార్థులు కోరుతున్నారు. ప్రధానంగా టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ లు జనవరి 2 నుంచి ప్రారంభమై జనవరి 20 వరకు వివిధ దశలలో పేపర్ వన్, పేపర్ టు పరీక్షలు జరగనున్నాయి. థర్డ్ సెమిస్టర్ విద్యార్థులు ఎంతో ఆశతో టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ హాజరు కావడానికి వేలాది రూపాయలు చెల్లించి ఉన్నారు. మరొకవైపు ఆ పరీక్షలో నెగ్గడానికి తీవ్రంగా కృషి కూడా చేసి ఉన్నారు. టెట్ పరీక్షకు హాజరు కాకపోయినట్లయితే సమీప భవిష్యత్తు లో డీఎస్సీకి అర్హత పొందే అవకాశం ఉండదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్థులు సైతం తాము పోటీ పరీక్షల కోసం చెల్లించిన పరీక్ష ఫీజులు కూడా వృధా అయ్యే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. టెట్, నెట్ పరీక్షలు ఉండడం వల్ల తాత్కాలికంగా బీఈడీ మూడో సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయాలని విశ్వవిద్యాలయ విద్యా విభాగం ప్రిన్సిపాల్ శ్రీనివాస్ రావుకు ఇప్పటికే విద్యార్థులు వేర్వేరుగా వినతి పత్రం అందజేసి ఉన్నారు. మూడు పరీక్షల తేదీలు సమీపిస్తుండడంతో ఏ పరీక్షకు సంసిద్ధం కావాలో అర్థం కాక విద్యార్థులు తీవ్రమైన ఆందోళనకు గురవుతున్నారు. ఏ పోటీ పరీక్షలకు హాజరు కాకపోయినా తమ భవిష్యత్తుకు భంగం వాటిల్లుతుందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో కాకతీయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్, పరీక్షల విభాగం అధికారులు పునరాలోచించి జనవరి 20 వరకు బీఈడీ మూడో సెమిస్టర్ ప్రాక్టికల్ పరీక్షలు వాయిదా వేయాలని కోరుతున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



