– సమష్టి నిర్ణయాలతో మధిర పట్టణ అభివృద్ధి
– చైర్మన్ ఎంపికపై మంత్రి సురేఖ ప్రకటన చేస్తారు
– ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
మధిర, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 15 : ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుని వారి కష్టసుఖాల్లో తోడుండే వారే నిజమైన నాయకులుగా గుర్తింపు పొందుతారని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా మధిరలోని తన క్యాంపు కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ కౌన్సిలర్లతో ఆదివారం ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కౌన్సిలర్లకు దిశానిర్దేశం చేశారు. రాజకీయంలో పదవులు శాశ్వతం కాదు, అవి తోకల వంటివి మాత్రమే అని భట్టి వ్యాఖ్యానించారు. నాయకత్వం అంటే కేవలం అధికారం చెలాయించడం కాదని, ప్రజల హృదయాలను గెలుచుకోవడమని హితబోధ చేశారు. తనను నమ్మి ఓటు వేసిన డివిజన్ ప్రజలకు ఏ చిన్న ఆపద వచ్చినా మా నాయకుడు ఉన్నాడు అనే భరోసా కల్పించినప్పుడే ఒక కౌన్సిలర్ విజయం సార్థకమవుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతాలకు కట్టుబడి, క్రమశిక్షణతో ప్రజలకు సేవ చేయాలని సూచించారు. మధిర పట్టణాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు చైర్మన్, కౌన్సిలర్లు అందరూ సమన్వయంతో పనిచేయాలని డిప్యూటీ సీఎం కోరారు. వ్యక్తిగత నిర్ణయాలకు తావులేకుండా, పట్టణ ప్రయోజనాలే పరమావధిగా నిర్ణయాలు ఉండాలన్నారు.
అధిష్టానం మాటే శిరోధార్యం
మున్సిపల్ చైర్మన్ ఎంపికపై స్పందిస్తూ పార్టీ అధిష్టానం నిర్ణయానికి ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని భట్టి స్పష్టం చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొండా సురేఖ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి పేరును అధికారికంగా ప్రకటిస్తారని వెల్లడించారు. అభ్యర్థి ఎంపికలో ఎలాంటి తారతమ్యాలు ఉండవని, అర్హత, పార్టీ విధేయత ఆధారంగానే ఉంటుందని స్పష్టం చేశారు. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా పార్టీ నిర్ణయాలను అమలు చేసేందుకు, కౌన్సిలర్లకు మార్గనిర్దేశం చేసేందుకు 18వ వార్డు కౌన్సిలర్ కోన ధని కుమార్ కు విప్ జారీ చేసే అధికారాన్ని అప్పగిస్తున్నట్లు భట్టి ప్రకటించారు. నూతన కౌన్సిలర్లను అభినందించి సత్కరించారు. ఎంతో కష్టపడి గెలిపించిన కార్యకర్తలకు అభినందనలు తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




