అశ్వారావుపేటను సుందరీకరిస్తాం

– దొంతికుంట చెరువుకు రింగ్‌ బండ్‌ ప్రణాళికలు సిద్ధం చేయండి.
– అశ్వరావుపేట మార్నింగ్‌ వాక్‌లో మంత్రి పొంగులేటి

దమ్మపేట/అశ్వారావుపేట, ప్రజాతంత్ర, జూలై 17 : అంతర్రాష్ట్ర సరిహద్దులో ఉన్న అశ్వరావుపేట పట్టణాన్ని అన్ని మౌలిక సదుపాయాలతో సుందరీకరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచాం, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. అశ్వరావుపేట రింగ్‌ రోడ్‌ నుండి దొంతికుంట చెరువు వరకు అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌ రాహుల్‌తో కలసి మంత్రి గురువారం మార్నింగ్‌ వాక్‌ చేశారు. ప్రజలను పలకరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇటీవల మున్సిపాలిటీగా ఏర్పడిన అశ్వరావుపేట పట్టణ అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. దొంతికుంట చెరువు పరిసరాలలో ఎనిమిది మీటర్ల వెడల్పుతో రింగ్‌ బండ్‌ నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఈ ప్రాంతాన్ని ప్రజల కోసం విశ్రాంతి కేంద్రంగా అభివృద్ధి చేయాలని, వాకింగ్‌ ట్రాక్‌లు, పచ్చదనం కలిగిన పార్కులు ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే పట్టణంలోని రహదారుల వెంట చెత్త వెంటనే తొలగించాలని మున్సిపల్‌ అధికారులను ఆదేశించారు. పట్టణంలోని డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచేందుకు మురుగునీరు శుద్ధి చేసే ప్లాంట్‌ ఏర్పాటు, డ్రైనేజీ లైన్ల నిర్మాణం, విద్యుదీకరణ వంటి పనులు విడతల వారీగా చేపడతామని మంత్రి పొంగులేటి చెప్పారు. గిరిజన ప్రాంతమైన అశ్వరావుపేట నూతన మున్సిపాలిటీని మోడల్‌ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు రహదారుల సుందరీకరణ, సెంట్రల్‌ లైటింగ్‌ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మంత్రితో వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *