– ప్రభుత్వానికి మచ్చ రాకుండా పనిచేయండి
– రాష్ట్ర ప్రజలకు విశేష సేవలందించండి
– జీపీవోలతో ప్రతిజ్ఞ చేయించిన మంత్రి పొంగులేటి
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 5: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం ఏర్పడిన వెంటనే గ్రామ సుపరిపాలనపై దృష్టి సారించి గ్రామాధికారుల నియామకానికి శ్రీకారం చుట్టామని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ హైటెక్స్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్న జీపీవోల నియామక పత్రాల అందజేత కార్యక్రమానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో 2020 ఆర్వోఆర్ చట్టం, ధరణి పోర్టల్ వల్ల తెలంగాణ సమాజం తీవ్రంగా నష్టపోయిందన్నారు. అందువల్లే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ధరణిని బంగాళాఖాతంలో కలిపేసి భూభారతి చట్టాన్ని తెచ్చామని, దీని రూపకల్పన సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని 36-37 గంటలకుపైగా పలుమార్లు విసిగించి ఆయన సలహాలతో మరీ అద్బుతంగా తీసుకొచ్చామని వివరించారు. భూభారతిని తొలుత నాలుగు మండలాల్లోని నాలుగు గ్రామాల్లో పైలట్ ప్రాజెక్ట్‌గా తీసుకొచ్చామని, తర్వాత 32 మండలాల్లోనూ, జూన్ 2 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు అందించామని వివరించారు. ఎవరి నుంచీ ఒక్క రూపాయికూడా తీసుకోకుండా 8.65 లక్షల దరఖాస్తులు తీసుకున్నామని తెలిపారు. గత ప్రభుత్వంలో సాదా బైనామాలపై సుమారు 9.26 లక్షల దరఖాస్తులకు మోక్షం కలగలేదని, పైగా కోర్టులలో కేసులు నమోదయ్యాయని తెలిపారు. తాజాగా నిర్వహించిన సదస్సులలో సుమారు 8.65 లక్షల దరఖాస్తులు వచ్చాయన్నారు. ఈ నేపధ్యంలో ఇందిరమ్మ ప్రభుత్వం తరపున మరింత గట్టిగా కృషి చేసి వారం క్రితం కోర్టులో సాదా బైనామాలపై స్టేను తొలగించేలా ప్రయత్నించి సఫలమయ్యామని వివరించారు. గతంలో వచ్చిన దరఖాస్తులు, ప్రస్తుత తాజా దరఖాస్తులన్నింటినీ సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. రాష్ట్రంలో 6,860 క్లస్టర్‌లను ఏర్పాటు చేసి 10,954 రెవెన్యూ గ్రామాలలో గ్రామ పరిపాలనాధికారుల నియామకం చేపడుతున్నామని వివరించారు. సర్వేయర్ల నియామకం ద్వారా భూ సమస్యలకు చెక్ పెడతామన్నారు. 318 మంది సర్వేయర్లుకు అదనంగా 800 మందిని నియమించడమేగాక 7000 మంది లైసెన్స్‌డ్ సర్వేయర్లను వచ్చే ఉగాదిలోగా భర్తీ చేస్తామని ప్రకటించారు. అంతేగాక సుమారు మూడు దశాబ్దాలుగా వివిధ ప్రాజెక్టులకు జరిగిన భూ సేకరణలో ఇంకా రైతుల పేర్లు పహణీలో ఉండిపోయాయని, ఈ సమస్యను కూడా పరిష్కరిస్తామన్నారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ 31నాటికి అన్ని గ్రామాల వారీగా జమాబందీ మేరకు అప్పటివరకు జరిగిన క్రయవిక్రయాలను హక్కులను వివరించేలా ప్రకటన జారీ చేస్తామన్నారు. దీని హార్డ్‌కాపీలు ప్రతి రెవెన్యూ గ్రామంలో అందుబాటులో ఉంచుతామన్నారు. ఇకపై ప్రభుత్వానికి మాట, మచ్చ రాకుండా పనిచేయాల్సిన బాధ్యత రెవెన్యూ కుటుంబ సభ్యులదేనని చెబుతూ ఉన్నత సేవలు అందిస్తామంటూ వారితో మంత్రి ప్రత్యేకంగా ప్రతిజ్ఞ చేయించారు. నాతోపాటు మీరు, మీతోపాటు నేను ప్రజలకు మరిన్ని మంచి సేవలు అందిద్దామన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





