కాలుష్య రహిత నగరంగా హైదరాబాద్‌

‌- మన పిల్లలకు మంచి భవిష్యత్‌ ‌కోసం తపన
– నగరంలోపల ఉన్న పరిశ్రమలను అవతలికి తరలింపు
– సిటీలో పీల్చే గాలి స్వచ్ఛంగా ఉండాలన్నదే లక్ష్యం
– పారిశ్రామక ప్రాంతాలను నివాస యోగ్యంగా మారుస్తాం
– హిల్ట్‌ పాలసీపై ప్రకటన.. మంత్రి శ్రీధర్‌ ‌బాబు 

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 6: రేపటి తరాల భవిష్యత్‌ ‌కోసం హిల్ట్‌పాలసీని తీసుకొస్తున్నామని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. హిల్ట్‌పాలసీపై చర్చ సంరద్భంగా అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. హిల్ట్‌ పాలసీని సాదాసీదా భూమార్పిడిగా చూస్తున్నారు. దీనిపై సద్విమర్శలు చేస్తే స్వీకరిస్తాం. హిల్ట్ ‌పాలసీ ద్వారా పారిశ్రామిక ప్రాంతం నివాస ప్రాంతంగా మారుతుంది. ఓఆర్‌ఆర్‌ ‌లోపలి ప్రాంతాల్లో కాలుష్యం లేకుండా చేసేందుకు సీఎం యత్నిస్తున్నారు. నగరంలోని పరిశ్రమలను ఓఆర్‌ఆర్‌ అవతలి వైపునకు తరలిస్తాం అని తెలిపారు. ఈ పాలసీ తాము కొత్తగా చేస్తున్నది కాదు.. దీనికోసం విస్తృతంగా చర్చలు జరిగాయి. హిల్ట్ ‌పాలసీ గురించి తెలియకుండా ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారు.. పారిశ్రామికవేత్తల భూములను ప్రభుత్వ భూములని ప్రచారం చేస్తున్నారు.. జీవోఎంఎస్‌ 19‌కు సంబంధించి లీజు భూములపై ప్రభుత్వానికి సర్వాధికారులు ఉంటాయని గత ప్రభుత్వం జీవో తెచ్చింది. స్వచ్ఛందంగా ముందుకు వస్తే భూములు కన్వర్ట్ ‌చేస్తాం. నగరవాసులను కాలుష్యం నుంచి రక్షించాలన్నదే త‌మ‌ లక్ష్యం అన్నారు. త‌మ‌ నిర్ణయానికి హేతుబద్ధత, శాస్త్రీయత ఉండాలని చూస్తున్నాం. భవిష్యత్‌ ‌గురించి ఆలోచించే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని మంత్రి శ్రీధర్‌బాబు చెప్పారు. మనం ఇన్ఫర్మేషన్‌ ‌రెవల్యూషన్‌లో ఉన్నామని, అంతరిక్షంలో ఇళ్లు కట్టుకోబోతున్నామని గొప్పలు చెప్పుకుంటున్నాం.. కానీ ఈ భూమిపై పుట్టిన జీవికి స్వచ్ఛమైన గాలి, నీరు అందించలేని అసమర్థ నాగరికతలో ఉన్నామనేది చేదు నిజం. అభివృద్ధి పేరిట జరుగుతున్న పర్యావరణ విధ్వంసాన్ని ఆపి రాబోయే తరాలకు ఒక ’క్లీన్‌ ఎన్విరాన్‌మెంట్‌’‌ను అందించడమే లక్ష్యంగా రేవంత్‌ ‌రెడ్డి ప్రభుత్వం ’హిల్ట్’  ‌పాలసీకి శ్రీకారం చుట్టిందని మంత్రి శ్రీధర్‌బాబు వివరించారు. చాలామంది హిల్ట్ ‌పాలసీని కేవలం పారిశ్రామిక ప్రాంతాలను నివాస ప్రాంతాలుగా మార్చే ఒక సాదాసీదా ’ల్యాండ్‌ ‌ట్రాన్స్‌ఫార్మేషన్‌’ ‌పక్రియగా చూస్తున్నారు. కానీ ఇది కేవలం రెవెన్యూ రికార్డుల్లో మార్పు కాదు. ‘పరిశ్రమలను ఓఆర్‌ఆర్‌ అవతలికి తరలించి, మన పిల్లలకు పీల్చేందుకు స్వచ్ఛమైన గాలిని, తాగేందుకు విషరహితమైన నీటిని అందించాలన్నదే త‌మ‌ సంకల్పం. ఇది రాబోయే తరాల కోసం త‌మ‌ ప్రభుత్వం వేస్తున్న ఆరోగ్యకరమైన పునాది  అని మంత్రి చెప్పారు.

‘బఫర్‌ ‌జోన్‌’ ‌మాయమైపోయింది

1970వ దశకంలో హైదరాబాద్‌ ‌పారిశ్రామిక ప్రస్థానం మొదలైంది. అప్పట్లో బాలానగర్‌, ‌సనత్‌ ‌నగర్‌, ఉప్పల్‌, ‌జీడిమెట్ల వంటి ప్రాంతాలు నగరం వెలుపల ఉండేవి. కానీ నేడు..ఈ ప్రాంతాలు నగరం నడిబొడ్డున చేరాయి. ఫ్యాక్టరీ గోడ పక్కనే అపార్ట్‌మెంట్లు వెలిశాయి. పరిశ్రమల చిమ్నీల‌నుండి వచ్చే విషపూరిత పొగ నేరుగా బెడ్‌రూమ్‌ల్లోకి ప్రవేశిస్తోంది. నివాస గృహాలకు, పరిశ్రమలకు మధ్య ఉండాల్సిన ’బఫర్‌ ‌జోన్‌’ ‌మాయమైపోయింది. మనం మన పిల్లల కోసం కోట్ల ఆస్తులు కూడబెట్టవచ్చు కానీ, వారు పీల్చే గాలి, తాగే నీరు విషతుల్యం అయితే ఆ ఆస్తుల వల్ల ఉపయోగం ఏంటని మంత్రి ప్రశ్నించారు. ఇది ‘బిడ్డలకు బంగారు గిన్నెలో విషం ఇచ్చి తాగమన్నట్టు‘ ఉంటుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకృతి ఒక్కసారి నాశనమైతే తిరిగి రాదని, మనం ఈ భూమికి యజమానులం కాదని, కేవలం ధర్మకర్తలం మాత్రమేనని గుర్తుచేశారు. చరిత్రలో గొప్ప మార్పులన్నీ ఒకే అడుగుతో మొదలవుతాయని, అభివృద్ధి పేరిట జరుగుతున్న విధ్వంసాన్ని ఆపడానికి ఆ మొదటి అడుగు తెలంగాణ నుండే ఎందుకు పడకూడదని మంత్రి శ్రీధర్‌ ‌బాబు ఉద్ఘాటించారు. రాజకీయ విమర్శలు పట్టించుకోకుండా, నేల మనుగడ కోసం, పిల్లల ప్రాణాలను కాపాడటం కోసం ఈ చారిత్రక బాధ్యతను ప్రభుత్వం భుజానెత్తుకుందని ఆయన స్పష్టం చేశారు. పరిశ్రమలను జనావాసాలకు దూరంగా తరలించడం ద్వారా హైదరాబాద్‌ను కేవలం కాంక్రీట్‌ ‌వనంగా కాకుండా, ఒక నివాసయోగ్యమైన మహా నగరంగా మార్చడమే ’హిల్ట్’ ‌పాలసీ అంతిమ లక్ష్యమని వ్యాఖ్యానించారు.

పరిశ్రమలను మూసేసేలా ప్రభుత్వ విధానాలు: బీజేపీ పక్ష నేత మహేశ్వర్‌ ‌రెడ్డి 

హిల్ట్ ‌పాలసీకి సంబంధించి సబ్‌ ‌కమిటీ నిర్ణయాలను ఎందుకు బయటపెట్టలేదని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ప్ర‌శ్నించారు. జీవో 27 చాలా వివాదాస్పదంగా ఉందన్నారు. హిల్ట్ ‌పాలసీపై చర్చ సందర్భంగా అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. జీవో లీక్‌ ‌కావడంపై ప్రభుత్వంలో ఆందోళన ఉంది. టౌన్‌షిప్‌లు, అపార్ట్‌మెంట్‌లు ఉండాలని జీవో 27లో ఉంది. అతితక్కువ ధరకు భూములు ఇచ్చారు. 22 పారిశ్రామికవాడలను అన్యాక్రాంతం చేస్తున్నారు. ఫార్మా సిటీ కోసం రైతుల నుంచి సేకరించిన భూములను ఫోర్త్ ‌సిటీకి ఉపయోగిస్తున్నారు. ఆ భూములపై హైకోర్టు అఫిడవిట్‌ అడిగింది. పరిశ్రమలను మూసివేసేలా ప్రస్తుత పాలసీ ఉంది. గత ప్రభుత్వ జీవోను రద్దు చేసే అధికారం ప్రస్తుత ప్రభుత్వానికి ఉంది. ఆ జీవోలో తప్పులు ఉంటే చర్యలు తీసుకోవాలి గానీ పరిశ్రమల భూములను రియల్‌ ఎస్టేట్‌ ‌భూములుగా మార్చాలని ప్రభుత్వం ఆలోచిస్తోందన్నారు. ఇది సరికాదన్నారు. గత బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం 43,342 జీవోలు దాచిపెట్టింది. ప్రస్తుత ప్రభుత్వం 19,064 జీవోలు ఇస్తే 3,290 జీవోలు మాత్రమే పబ్లిక్‌ ‌డొమైన్‌లో ఉన్నాయని ఆరోపించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *