“రాయలసీమ ఎత్తిపోతల కేవలం ఒక పథకం మాత్రమే కాదు, రాజకీయంగా అత్యంత కీలకం. 2024 లో ఈ ప్రాంతంలో 52 సీట్లను తెలుగుదేశం గెలుచుకోవడానికి ఈ పథకమే కారణం. సాగునీటి విషయంలో వైఎస్‌ఆర్సీపీ వైఫల్యాలను ఎత్తిచూపుతూ సంస్కరణలు తీసుకొస్తామంటూ గత ఎన్నికల్లో టీడీపీ విస్తృత ప్రచారం చేసింది. మరిప్పుడు ఈ కరువు సీమ నీటి సమస్యను పరిష్కరించడంలో చంద్రబాబు విశ్వసనీయత ప్రశ్నార్థకంగా మారింది. తెలంగాణ కోసమే తాను పనిచేస్తున్నానంటూ విపక్షాలను తెలియజెప్పే ఉద్దేశంతో రేవంత్ ప్రదర్శించిన అత్యుత్సాహం ఇప్పుడు బెడిసికొట్టిందనే చెప్పాలి. ఒకవైపు ఏ హామీలను ప్రజలకిచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందో వాటి విషయంలోనే లాలూచీ పడుతోందని ప్రచారం చేయడానికి విపక్షాలకు ఒక అస్త్రం దొరికినట్లయింది. మరోవైపు చంద్రబాబు విశ్వసనీయ తను రాయలసీమలో పూర్తిగా దెబ్బతినేలా చేసింది. ఈ విధంగా రేవంత్ ప్రకటన రెండు రాష్ట్రాల ప్రభుత్వాల ప్రతిష్టను మసకబార్చిందనే చెప్పాలి..”
చంద్రబాబు కొంప ముంచిన రేవంత్!!

‘‘ప్రాంతేతరుడు మోసం చేస్తే పొలిమేరవరకు తరిమికొడతాం, ప్రాంతం వాడే మోసం చేస్తే ప్రాంతం లోపలే పాతిపెడతాం’’`ప్రజాకవి కాళోజీ..!
తెలంగాణకు చెందిన కవి కాళోజీ చెప్పిన అన్ని కాలాలకు,అన్ని ప్రాంత వాసులకు వర్తించే ‘‘మోసపోవడం’’ అనే పదం ప్రస్తుతం రాయలసీమ వాసులకు వర్తిస్తుందనిపిస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాలమూరు`రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై తమ ప్రభుత్వ వైఖరిని సమర్థించుకుంటూ అసెంబ్లీలో జనవరి 1న ఒక ప్రకటన చేశారు. కేవలం తన వ్యక్తిగత అభ్యర్థన మేరకే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపారన్నది ఆయన ప్రకటన సారాంశం. అయితే తెలంగాణ ప్రయోజనాల విషయంలో తన నిబద్ధతను వెల్లడి చేసేందుకు, ప్రత్యర్థులపై రాజకీయ అస్త్రంగా దీన్ని బహిర్గతం చేసి ఉండవచ్చు. రేవంత్ ఏ కారణంతో ఈ విషయాన్ని బహిర్గతం చేసినా, దీని ప్రకంపనలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కుదిపేస్తున్నాయి.
నిజం చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్‌లో కరువుసీమగా రాయలసీమకు పేరు. ఇప్పుడు రేవంత్ అసెంబ్లీలో రొటీన్‌గా వెల్లడించిన ఈ విషయం చంద్రబాబు మెడకు చుట్టుకుంది. ఫలితంగా రాయలసీమ ప్రజల దృష్టిలో ఇప్పుడు చంద్రబాబు ఒక దోషి. రెండు రాష్ట్రాల మధ్య సంబంధాల కోసం తమ ప్రాంతాన్ని బలిపశువును చేశారన్న అభిప్రాయం ఈ ప్రాంత ప్రజల్లో కలగడం సహజమే. ప్రజాకవి కాళోజీ చెప్పిన ‘‘మోసం’’ అనే పదం ఇప్పుడు రాయలసీమ వాసులను కుదిపేస్తున్నది. ముఖ్యంగా ముఖ్య మంత్రి చంద్రబాబునాయుడే తమను నిట్టనిలువున ‘‘మోసగించారన్న’’ అంశం వారికి మింగుడుపడటంలేదు. తెలంగాణ అసెంబ్లీలో రేవంత్‌రెడ్డి ప్రకటన చేసిన వెంటనే దాన్ని ఖండించకుండా చంద్రబాబు వ్యూహాత్మక మౌనాన్ని పాటించడం రాయలసీమ వాసుల్లో ఆగ్రహాన్ని కలిగిస్తున్నది . అంటే ఇద్దరు నాయకులు నాలుగు గోడల మధ్య కూడబలుక్కొని రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేశారన్న అభిప్రాయం వారిలో వ్యక్తమవుతోంది. మరి ఈ ప్రాంత వాసుల నీటి అవసరాలు తీర్చే ఒకే ఒక పథకం ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం. తమకు ప్రాణాధారమైన ఈ పథకాన్ని నిలిపివేయడం ఈ ప్రాంత వాసులకు ఆగ్రహం తెప్పించడం సహజమే!
ఈ పరిణామాన్ని అందిపుచ్చుకొని తనకు అనుకూలంగా మలచుకునేందుకు తక్షణమే వైఎస్‌ఆర్‌సీపీ రంగంలోకి దిగింది. జనవరి 6న ఈ పార్టీ నాయకులు క్షేత్రస్థాయి పరిశీలనకంటూ ఎత్తిపోతల పథకం వద్దకు వచ్చి, గురు-శిష్యులిద్దరూ రాయలసీమకు మరణశాసనం రాసారంటూ అగ్నికి ఆజ్యం పోసే రీతిలో ప్రకటనలు గుప్పించారు. రాయలసీమ వాసులకు ప్రాణాధారమైన ఈ ఎత్తిపోతల పథకం పనులను తక్షణం ప్రారంభించాలని, ఒకవేళ ఆ విధంగా చేయకపోతే, పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. తన రాజకీయ ప్రత్యర్థులు నోళ్లు మూయించడానికి రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో ఆవిధంగా ప్రకటన చేసివుండవచ్చు. అయితే ఈ ప్రాజెక్టు పనులు ఆపేయడంపై చంద్రబాబు, రేవంత్ రెడ్డిల మధ్య నిజంగా అవగాహన కుదిరిందా? అన్నది అసలు ప్రశ్న. ఒకవేళ అటువంటిదేమీ లేకపోతే, చంద్రబాబు దీన్ని ఖండించకుండా, మౌనంగా ఎందుకుండిపోయారన్న ప్రశ్న ఉదయిస్తుంది.
ఈ రెండు ప్రాంతాల మధ్య బహుకాలంగా నీటి జగడాలు కొనసాగుతున్నాయి. సంఘర్షణ ఒక్కటే తక్కువ అన్న రీతిలో ఉన్న ఈ విభేదాల నేపథ్యంలో, ఇప్పుడు రాయలసీమ వాసులకు ప్రజాకవి కాళోజీ చెప్పిన ‘‘మోసం’’ అనే పదం బాగా అనుభవంలోకి వచ్చే ఉంటుంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలను ఏలుతున్న ప్రభుత్వాలు ఉన్న సమస్యలకు తోడు తమకు తామే కొనితెచ్చుకున్న వివాదాలతో విపక్షాలకు చేజేతులారా బలమైన అస్త్రాలను అందిస్తున్నాయి. ఫలితంగా రాజకీయాలు మరింత భ్రష్టుపట్టే దుస్థితి ఏర్పడుతోంది. వ్యక్తిగత విధేయతకంటే, తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యమన్న రీతిలో రేవంత్ ప్రకటన చేసారని, నాయకులు వివరణ ఇచ్చినా, దీని ప్రకంపనలు మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కుదిపేసేరీతిలో ఉన్నాయి. రేవంత్ ప్రకటన, రాయలసీమ వాసుల జీవనాడిని కదిలించిందనడంలో ఎంతమాత్రం సందేహం లేదు.
2014లో రెండు రాష్ట్రాలు ఏర్పడిన నాటి నుంచి రాయలసీమ ఎత్తిపోతల పథకం ఇరు ప్రాంతాల మధ్య ఉధ్రిక్తలకు కారణమవుతోంది. వైఎస్. జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకానికి అంకురార్పణ జరిగింది. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి మూడు టీఎంసీల నీటిని ఈ పథకం ద్వారా ఎత్తిపోసి కరువు ప్రాంతాలుగా ఉన్న అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లోని ఆరులక్షల ఎకరాలకు సాగునీరు అందించాలన్నది ప్రధాన లక్ష్యం. ఆంధ్ర ప్రదేశ్‌లో నీటి ఎద్దడి ప్రాంతాలను సస్యశ్యామలం చేసేదిగా పేర్కొన్న ఈ పథకం ఇప్పుడు డోలాయమానంగా మారడం వర్తమాన వైచిత్రి. అసెంబ్లీ లో రేవంత్ ప్రకటనపై తెలుగుదేశం నాయకత్వం మౌనం వహించడంతో, తమకు ప్రాణాధారమైన ఈ ప్రాజెక్టును నాలుగుగోడల మధ్య కుదుర్చుకున్న ఒప్పందానికి బలిచేశారన్న స్పష్టమైన అభిప్రాయానికి రాయలసీమ వాసులు వచ్చేశారు.
2020లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ) ఆదేశాల మేరకు ఈ పథకాన్ని ఎప్పుడో నిలిపేసారని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న వాదనలో పస లేదు. అదీకాకుండా రేవంత్ ప్రకటనను బలంగా ఖండించడానికి టీడీపీ నాయకత్వం ఇబ్బంది పడుతుండటం కూడా రహస్య ఒప్పందం ఏదో కుదిరిందన్న అభిప్రాయం బలపడటానికి కారణమవుతోంది. టీడీపీ మౌనం వ్యూహాత్మకమైనప్పటికీ, రాయలసీమ విషయంలో ఒక విజనరీగా చంద్రబాబు ప్రతిష్ట మసకబారడం ఖాయం. రాయలసీమ ఎత్తిపోతల కేవలం ఒక పథకం మాత్రమే కాదు, రాజకీయంగా అత్యంత కీలకం. 2024 లో ఈ ప్రాంతంలో 52 సీట్లను తెలుగుదేశం గెలుచుకోవడానికి ఈ పథకమే కారణం. సాగునీటి విషయంలో వైఎస్‌ఆర్సీపీ వైఫల్యాలను ఎత్తిచూపుతూ సంస్కరణలు తీసుకొస్తామంటూ గత ఎన్నికల్లో టీడీపీ విస్తృత ప్రచారం చేసింది. మరిప్పుడు ఈ కరువు సీమ నీటి సమస్యను పరిష్కరించడంలో చంద్రబాబు విశ్వసనీయత ప్రశ్నార్థకంగా మారింది. తెలంగాణ కోసమే తాను పనిచేస్తున్నానంటూ విపక్షాలను తెలియజెప్పే ఉద్దేశంతో రేవంత్ ప్రదర్శించిన అత్యుత్సాహం ఇప్పుడు బెడిసికొట్టిందనే చెప్పాలి. ఒకవైపు ఏ హామీలను ప్రజలకిచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందో వాటి విషయంలోనే లాలూచీ పడుతోందని ప్రచారం చేయడానికి విపక్షాలకు ఒక అస్త్రం దొరికినట్లయింది. మరోవైపు చంద్రబాబు విశ్వసనీయ తను రాయలసీమలో పూర్తిగా దెబ్బతినేలా చేసింది. ఈ విధంగా రేవంత్ ప్రకటన రెండు రాష్ట్రాల ప్రభుత్వాల ప్రతిష్టను మసకబార్చిందనే చెప్పాలి.
– శామ్ సుందర్
పొలిటికల్ అనలిస్ట్




