రూ.232 కోట్లతో పోలీస్‌ క్వార్టర్స్‌ నిర్మాణం

– మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి

నల్గొండ, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 13: రాష్ట్రవ్యాప్తంగా పోలీసు అధికారులు, సిబ్బంది క్వార్టర్స్‌ నిర్మాణాలు రూ.232 కోట్లతో చేపట్టినట్లు రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని పోలీసు హెడ్‌ క్వార్టర్స్‌లో నిర్మించిన ఏఆర్‌ డిఎస్‌పి రెసిడెన్సీ క్వార్టర్స్‌, సీఐ, ఎస్‌ఐ క్వార్టర్లను, శిశువిహార్‌ను శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శిథిలావస్థలో ఉన్న పోలీస్‌ అధికారులు, సిబ్బంది క్వార్టర్స్‌ను తొలగించి వాటి స్థానంలో కొత్తవి నిర్మిస్తున్నామని, ఇందులో భాగంగానే అవసరమైనచోట రూ.232 కోట్లతో పోలీస్‌ క్వార్టర్స్‌ నిర్మాణం చేపట్టినట్లు వెల్లడిరచారు. ఇంకా ఎక్కడైనా ఇలాంటి స్థితిలో క్వార్టర్స్‌ ఉంటే గుర్తించి వాటి స్థానంలో కొత్త వాటిని నిర్మించే విధంగా చర్యలు తీసుకోవాలని పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఎండీ రమేష్‌రెడ్డిని ఆదేశించారు. నల్గొండ జిల్లా డీఎస్పీ కార్యాలయం యాభయ్యేళ్ల క్రితం నిర్మించినది అయినందున త్వరలోనే ఈ కార్యాలయాన్ని కూలగొట్టి దాని స్థానంలో కొత్తది మంజూరు చేయిస్తామని, ముఖ్యమంత్రితో మాట్లాడి డీఎస్ప్పీ కార్యాలయంతోపాటు ఏఆర్‌ కానిస్టేబుల్‌ క్వార్టర్స్‌ శిథిలావస్థలో ఉన్నందున వాటికి కూడా మంజూరు చేయిస్తామని తెలిపారు. పోలీసు అధికారులు, సిబ్బంది 24 గంటలు పనిచేస్తారని, అలాంటి వారికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. హింసను నిర్మూలించి శాంతియుత వాతావరణం నెలకొల్పడంతోపాటు, సమాజంలో మత్తుమందుల నిరోధానికి పోలీసులు కృషి చేస్తున్నారంటూ ప్రత్యేకించి నల్గొండ జిల్లాలో జిల్లా ఎస్పీ, జిల్లా కలెక్టర్లు మత్తుపదార్థాల నివారణకు చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. డ్రగ్స్‌ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ్ట ముఖ్యమంత్రి కృషిచేస్తున్నారని తెలిపారు. జిల్లా ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌, జిల్లా కలెక్టర్‌ ఇలా త్రిపాఠి, ఐజి ఇక్బాల్‌, ఎంఎల్‌సి నెల్లికంటి సత్యం, స్థానిక సంస్థల ఇన్‌చార్జి అదనపు కలెక్టర్‌ నారాయణ్‌ అమిత్‌, రెవెన్యూ అదనపు కలెక్టర్‌ జె.శ్రీనివాస్‌, దేవరకొండ ఏసీపీ మౌనిక, ఇతర పోలీసు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *