పోలీసుల రుణం తీర్చుకోలేనిది

– వారంటే సమాజానికి ఒక నమ్మకం, భరోసా
– దేశానికే ఆదర్శంగా తెలంగాణ పోలీసు శాఖ
– ఘనంగా పోలీస్‌ ‘ఫ్లాగ్‌ డే’
– విధి నిర్వహణలో అమరులైనవారికి సీఎం శ్రద్ధాంజలి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 21: విధి నిర్వహణలో ప్రాణాలను సైతం పణంగా పెట్టాల్సి వచ్చినా వెనుకడుగు వేయని సమాజ సేవకుడు పోలీస్‌ అని, దేశం కోసం ప్రాణాలర్పించిన ఎందరో పోలీసు అమర వీరులను స్మరించుకోవడం మనందరి కర్తవ్యమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఆ బాధ్యతతోనే దేశవ్యాప్తంగా ప్రతీ సంవత్సరం అక్టోబరు 21న పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవం (పోలీసు ఫ్లాగ్‌ డే)గా ఘనంగా నిర్వహించుకుంటున్నామన్నారు. విధి నిర్వహణలో వీరమరణం పొందిన పోలీసు అమరవీరులకు ఆయన శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా 191 మంది, రాష్ట్రంలో ఆరుగురు పోలీసులు విధి నిర్వహణలో ప్రాణాలనర్పించారని, గ్రేహౌండ్స్‌ కమాండోలు టి.సందీప్‌, వి.శ్రీధర్‌, ఎన్‌.పవన్‌ కళ్యాణ్‌లు సంఘవిద్రోహ శక్తులతో పోరాడుతూ వీరమరణం చెందారని తెలిపారు. అసిస్టెంట్‌ కమాండెంట్‌ బానోతు జవహర్‌లాల్‌, నల్గొండ కానిస్టేబుల్‌ బి.సైదులు విధి నిర్వహణలో మరణించారని, మూడు రోజుల కింద నిజామాబాద్‌లో సీసీఎస్‌ కానిస్టేబుల్‌ ఎంపల్లి ప్రమోద్‌ కుమార్‌ విధి నిర్వహణలో వీర మరణం చెందారని తెలిపారు. అతని భార్య ప్రణీతకు, అతి చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయిన అతని ముగ్గురు కుమారులకు, వారి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. రూ.కోటి ఎక్స్‌గ్రేషియా, అమరుడైన కానిస్టేబుల్‌ పదవీ విరమణ వరకు లాస్ట్‌ పే డ్రాన్‌ సాలరీతో పాటు కుటుంబ సభ్యులలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, 300 గజాల ఇంటి స్థలం మంజూరు చేస్తున్నామన్నారు. వీటితోపాటు పోలీస్‌ భద్రత సంక్షేమం నుండి రూ.16 లక్షల ఎక్స్‌గ్రేషియా, పోలీస్‌ వెల్ఫేర్‌ నుండి రూ.8 లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రమోద్‌ కుటుంబానికి చెల్లించి వారి కుటుంబానికి అండగా ఉంటామన్నారు. 2008 జూన్‌ 29న ఒరిస్సాలో మావోయిస్టుల దాడిలో మరణించిన 33మంది పోలీస్‌ కుటుంబాలకు గాజులరామారంలో 200 గజాల స్థలం కేటాయించామన్నారు. మన ప్రాణానికి తమ ప్రాణాలను అడ్డుపెట్టే పోలీసుల రుణం ఏమిచ్చినా తీరదన్నారు.

దేశానికి గర్వకారణంగా తెలంగాణ పోలీస్‌ శాఖ

నూతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలో దేశంలోనే అగ్రస్థానంలో నిలవడం తమ ప్రభుత్వానికి గర్వకారణమని ముఖ్యమంత్రి చెప్పారు. ఇండియా జస్టిస్‌ రిపోర్ట్‌ 2025 ప్రకారం దేశంలోనే తెలంగాణ పోలీస్‌ శాఖకు ప్రథమ స్థానం లభించిందని, పాస్‌పోర్ట్‌ వెరిఫికేషన్‌ విధానంలోనూ విదేశాంగ శాఖ నుంచి ప్రత్యేక అభినందనలు పొందిందని కొనియాడారు. తీవ్రవాదం, ఉగ్రవాదం, సంఘ విద్రోహ కార్యకలాపాలు, మతతత్వ ఆందోళనలు, వైట్‌ కాలర్‌ నేరాలు, మాదకద్రవ్యాలు, సైబర్‌ నేరాలు, కల్తీ ఆహారాలు, గుట్కా, మట్కా, ఇతర అసాంఘిక కార్యకలాపాలు రాష్ట్రంలో పెరగనివ్వకుండా అహర్నిశలు శ్రమిస్తూ దేశానికే ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. డ్రగ్స్‌ మహమ్మారిని నిర్మూలించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ‘ఈగల్‌’ వింగ్‌ సమర్థవంతంగా తన బాధ్యతలు నిర్వర్తిస్తోందన్నారు. సైబర్‌ నేరాలు, డిజిటల్‌ మోసాలు, మార్ఫింగ్‌ కంటెంట్‌, డ్రగ్స్‌, హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ వంటి కొత్త తరహా నేరాలు పోలీసులకు సవాలుగా మారుతున్నాయని, మానవ నేరాలను మించి సైబర్‌ క్రైమ్‌ వార్తలు ఎక్కువ వస్తున్నాయని, టెక్నాలజీ రూపంలో ఎదురవుతున్న సవాళ్లకు టెక్నాలజీతోనే తెలంగాణ పోలీసులు సమాధానం చెబుతున్న తీరు భేషుగ్గా ఉందని అన్నారు. సైబర్‌ క్రైం విభాగం అత్యంత సమర్ధవంతంగా విధులు నిర్వర్తిస్తూ దేశంలో ది బెస్ట్‌గా నిలిచిందని, సైబర్‌ నేరగాళ్ళను అరికట్టడానికి అంతర్‌ రాష్ట్ర ఆపరేషన్లు సైతం నిర్వహిస్తున్న తెలంగాణ పోలీసులకు యావత్‌ దేశం సెల్యూట్‌ చేస్తోందని చెప్పారు. నేడు పోలీస్‌ శాఖ చర్యల వల్ల తీవ్రవాదం, మావోయిస్టు కార్యకలాపాలు పూర్తిగా తగ్గి శాంతి నెలకొందని తెలిపారు.

సమర్థవంతంగా పనిచేస్తున్న మహిళా ఐపీఎస్‌లు

పలు కీలక విభాగాల్లో అనేకమంది మహిళా ఐపీఎస్‌లకు పోస్టింగులు ఇచ్చి దేశానికే తమ ప్రభుత్వం ఆదర్శంగా నిలిచిందని, పోలీసు అకాడమీ, జైళ్ల శాఖ, ఎస్‌ఐబీ, ఏసీబీ, సీఐడీ, విజిలెన్స్‌, ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌, సీసీఎస్‌, సైబర్‌ సెక్యూరిటీ బ్యూరోలకు మహిళా ఐపీఎస్‌ల సారథ్యం ప్రభుత్వానికి గర్వకారణమని సీఎం అన్నారు. కీలకమైన హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీసు కమిషనరేట్లలో జోన్‌ డీసీపీలుగా ఏడుగురు మహిళా అధికారులేనని, రెండేసి కీలక విభాగాలను సైతం సమర్థవంతంగా నడిపిస్తున్న వారిని చూసి తెలంగాణ గర్విస్తోందని అన్నారు. పోలీసు ఉద్యోగమంటే ప్రతీ క్షణం పరీక్షే.. ప్రతీ దినం పోరాటమే.. ఒకవైపు నేరాల అదుపు, మరోవైపు నేరాల విచారణ, ట్రాఫిక్‌ నియంత్రణ, రాత్రింబవళ్ల గస్తీ, బందోబస్తు, వీఐపీ రక్షణ.. ఇలా అనేక బాధ్యతలతో విరామం లేకుండా పనిచేస్తూ అందరం ప్రశాంతంగా జీవించేందుకు తమ జీవితాలను త్యాగం చేస్తుంటారని సీఎం పేర్కొన్నారు. ఇంతటి కష్టతరమైన బాధ్యతలు నిర్వర్తిస్తున్న పోలీసులకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందన్నారు.

పోలీసు సంక్షేమానికి అనేక చర్యలు

పోలీసుల సంక్షేమానికి అనేక చర్యలు చేపట్టిందని, తాము అధికారంలోకి వచ్చాక దాదాపు 16 వేల మంది కానిస్టేబుల్స్‌, ఎస్‌ఐలను రిక్రూట్‌ చేశామని, రాజకీయ జోక్యం లేకుండా స్వేచ్ఛగా విధులు నిర్వర్తించే పరిస్థితులు కల్పించామని సీఎం రేవంత్‌ చెప్పారు. సంఘ విద్రోహ శక్తులు, తీవ్రవాదులు, ఉగ్రవాదుల దాడుల్లో వీరమరణం పొందిన లేదా గాయపడి, అంగవైకల్యం పొందిన పోలీసు అధికారులు, సిబ్బందికి తెలంగాణలో అత్యధిక నష్టపరిహారం అందించామన్నారు. విధి నిర్వహణలో వీరమరణం పొందిన పోలీసు కుటుంబాల పిల్లలకు ప్రత్యేకంగా మెడికల్‌ సీట్లను కేటాయిస్తున్నామని, తీవ్రవాదుల, ఉగ్రవాదుల హింసలో చనిపోయిన వారికి అందించే ఎక్స్‌గ్రేషియాను కానిస్టేబుల్‌ నుంచి ఏఎస్‌ఐల వరకు రూ.కోటి, ఎస్సై, సీఐలకు రూ.కోటి 25 లక్షలు, డీఎస్పీ, అడిషనల్‌ ఎస్పీలకు రూ.కోటి 50 లక్షలను, ఎస్పీలు, ఇతర ఐపీఎస్‌ అధికారులకు రూ.2 కోట్లకు పెంచుతూ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుందని తెలిపారు. పోలీసులకు అండగా నిలవడంలో భాగంగా వారి పిల్లలకు అంతర్జాతీయ ప్రమాణాలతో నాణ్యమైన విద్యనందించేందుకు రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో యంగ్‌ ఇండియా పోలీస్‌ స్కూల్‌ను ప్రారంభించామని, ఇందులో 50 శాతం సీట్లు పోలీస్‌ సిబ్బంది పిల్లలకు, మిగతా 50 శాతం సాధారణ పౌరుల పిల్లలకు కేటాయించామని చెప్పారు. ఒలింపియన్‌, బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌, వరల్డ్‌ కప్‌ విన్నర్‌ క్రికెటర్‌ మహమ్మద్‌ సిరాజ్‌కు డీఎస్పీగా ఉద్యోగాలు ఇచ్చి తెలంగాణ పోలీసుల ప్రతిష్ఠను పెంచామన్నారు. సోషల్‌ మీడియా ప్రభావం బాగా పెరిగిన ఈ కాలంలో పోలీసుల ప్రతి అడుగు, మాట జాగ్రత్తగా ఉండాలని, ఫ్రెండ్లీ పోలీసింగ్‌ అంటే చట్టాన్ని గౌరవించే పౌరుల కోసమే కానీ చట్టాన్ని ఉల్లంఘించే వారికి కాదనే విషయం గుర్తుంచుకోవాలని సూచించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *