– రద్దీ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున సోదాలు
హైదరాబాద్,ప్రజాతంత్ర,నవంబర్12: దేశ రాజధాని న్యూదిల్లీలోని ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనతో దేశవ్యాప్తంగా పోలీసులు అప్రమత్తమయ్యారు. బుధవారం దేశంలోని ఐదు ప్రధాన నగరాల్లోని ఎయిర్ పోర్టులను పేల్చి వేస్తామంటూ బెదిరింపులు వచ్చాయి. ఆ జాబితాలో హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ సైతం ఉంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగర పోలీసులు అలర్ట్ అయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్ మహానగరంలోని వివిధ ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు. అందులో భాగంగా బస్ స్టాప్‌లు, దేవాలయాలు, షాపింగ్ మాల్స్‌లో తనిఖీలు చేపట్టారు. రద్దీ ప్రాంతాల్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఇక బాలా నగర్ పీఎస్ పరిధిలోని పలు షాపింగ్ మాల్స్, టెంపుల్స్, బస్ స్టాప్‌లలోనూ పోలీసులు తనిఖీలు చేపట్టారు. అలాగే పబ్లిక్ ప్లేసెస్ వద్ద బాంబ్ స్క్వాడ్‌తో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. దీంతో రహదారులపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. రద్దీ వేళ.. ఈ సోదాల కారణంగా వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్, దిల్లీ, ముంబై, చెన్నై, తిరువనంతపురం ఎయిర్‌పోర్ట్‌లు పేల్చేస్తామంటూ ఇండిగో ఎయిర్ లైన్స్ కార్యాలయానికి ఈ మెయిల్ అందింది. ఈ ఎయిర్ లైన్స్ అధికారులు వెంటనే ఎయిర్ పోర్ట్ ఉన్నతాధికారులతోపాటు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఐదు ఎయిర్‌పోర్ట్‌ల్లో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టాయి. ఆ క్రమంలో ఆయా ఎయిర్ పోర్టుల్లోని ప్రయాణికులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. అయితే సోమవారం అంటే.. దిల్లీలోని ఎర్రకోట వద్ద కారు బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 12 మంది మరణించారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. చాలా కాలం తర్వాత బాంబు పేలుడు సంభవించడం.. అదికూడా న్యూఢిల్లీలో కావడంతో కేంద్ర ప్రభుత్వం వెంటనే అప్రమత్తమైంది. ఈ బాంబు పేలుడు వెనుక ఎవరు ఉన్నారనే కోణంలో దర్యాప్తు జరుగుతుంది. అలాగే ఈ పేలుడు ఘటనలో అనుమానిత కారును ఫరీదాబాద్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఖండవాలి గ్రామం వద్ద పార్క్ చేసిన కారును గుర్తించారు. అనుమానిత కారు నెంబర్ 0458గా గుర్తించారు. డాక్టర్ ఉమర్ పేరుపై ఈ ఎకో స్పోర్టస్ కారు రిజిస్టర్ అయినట్లు పోలీసులు కనుగొన్నారు. ఈ బాంబు పేలుడు ఘటనపై దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





